కొత్త సచివాలయం అవసరమా?

11 Jul, 2020 02:04 IST|Sakshi

అభిప్రాయం

నగరం నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో, ఠీవిగా నిలబడి, నాడు తెలుగు రాష్ట్రాల పరి పాలన వ్యవస్థను సమర్థ వంతంగా నిర్వహించిన సచివాలయం నేడు నేలమట్టం అవుతోంది. సువిశాలమైన భవనాలు, రాష్ట్రంలో ఏ మూలకైనా పరిపాలన వ్యవహారాలు సమీక్షించగలిగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగియున్న సచివాలయంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏం ఇబ్బందులు ఉన్నాయి? అంత పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనకు సరిపోయిన కార్యాలయాల సమూహం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేందుకు సరిపోదా? తెలంగాణ కొత్త రాష్ట్రమే, కానీ, సచివాలయం, అసెంబ్లీ, ఇతర రాష్ట్ర కార్యాలయాలు లేని రాష్ట్రం కాదు. అన్ని సౌకర్యాలు, హంగులు ఉన్నప్పటికీ, సీఎంగా ప్రమాణం చేసిన నాటినుంచి సచివాలయానికే రాని కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు? దేశంలోని 90% సచివాలయాలతో పోలిస్తే మన ఇప్పటి సచివాలయమే కొత్తది, పైగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినది. ఎన్నో రాష్ట్రాలలో చెక్క బల్లల మీద పాలన సాగుతోంది. పరిపాలన విధానాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతారే తప్ప రంగులద్దిన అద్దాల మేడలు చూసి కాదని పెద్దలు గ్రహించాలి.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొత్త ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ఉండగా, వందల కోట్ల రూపాయల ఖర్చు చేసి కొత్తగా ప్రగతి భవన్‌ నిర్మించిండు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కార్పొరేట్‌ దవాఖానలో బెడ్లు దొరకడంలేదు. కాళ్ళా వేళ్ళా పడి ఒక బెడ్‌ సాధిస్తే, లక్షల రూపాయల బిల్లులు కట్టాల్సిన దుస్థితి. ఇక గాంధీ, ఉస్మానియా, ఛాతీ దావాఖానలో రోగుల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో మనకు తెలుసు. పరిస్థితులు సర్దుకునేదాకా, అన్ని వసతులతో కూడిన విశాలమైన సచివాలయ భవన సముదాయాలను, కరోనా పాజిటివ్‌ పేషెంట్‌ వార్డులుగా ఉపయోగించాలనే డిమాండ్‌ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాల్సిన బోనులో నిలబడి, ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం సరి కాదు. 

ఇప్పుడు  రూ. 600 కోట్లు అంచనాతో కొత్త సచివాలయం నిర్మిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దుబారా వ్యయమే. ఇప్పటికైనా, కేసీఆర్‌ ప్రస్తుత సచివాలయం కూల్చివేతను ఆపాలి. కొత్త సచివాలయ నిర్మాణం ఆలోచనను విరమించుకోవాలి. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేం దుకు పాటుపడాలి. కావాలంటే నియోజకవర్గానికో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేయాలి, దానికి ప్రతిపక్షాల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం, ఇప్పటికే 2 లక్షల 80 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో పొదుపు నియమాలను పాటించాలి. అతిగా ఆర్భాటాలు, డంబాచార ప్రచారాలకు, తన వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కోసం ప్రజాధానాన్ని వృ«థా చేయరాదు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధం.


వ్యాసకర్త: కొనగాల మహేష్‌, ఏఐసీసీ సభ్యులు
మొబైల్‌ : 98667 76999

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు