జీరో బడ్జెట్‌ వ్యవసాయం జీరోనే

13 Oct, 2018 03:12 IST|Sakshi

అభిప్రాయం

రైతుకి భూమికి ఉన్న అనుబంధం తెలిసినవారు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి. ఆ అనుబంధం తెలియని వాడు చంద్రబాబునాయుడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితిలో తనకు వ్యవసాయంపై మాట్లాడటానికి ఆహ్వానం వచ్చిందని రకరకాల చిందులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి ప్రపంచ వేదికల మీద చెప్పిన అబద్ధాలు సామాన్య జనానికికూడా అర్థమవుతోంది. ఇప్పటికే 60 వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో పాలేకర్‌ విధానంలో వ్యవసాయంలో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదం.  అయితే ఎక్కడ ఉన్నారో చూపిస్తే  అది ఎంత వరకు నిజమో తెలుస్తుంది. ఆవు ఉన్న ప్రతీ రైతు సహజసేద్యం చేస్తున్నట్లు లెక్కలు చూపించి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2029కి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ అంతా పాలేకర్‌ సేద్యంలో తీసుకెళ్ళడానికి ప్రణాళిక. దానికి దాదాపు రూ. 16,000 కోట్లు అప్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇది రైతులకు మేలు చేసే కార్యక్రమం కాదు అన్నది నిస్సందేహం.

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి వెళుతున్నానని, మోదీకన్నా నేనే గొప్పవాడినని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం ఆయనకు అలవాటే, ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. దాని పక్క చాలా హాల్స్‌ ఉంటాయి. దానిలో ఎప్పుడూ ఏదో ఒక సెమినార్‌లు, మీటింగ్‌లు అనేక విషయాలపై జరుగుతుంటాయి. వీటికి ఎవరైనా తమ సొంత ఖర్చులపై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదేదో ఏపీ ముఖ్యమంత్రి ఒక్కడికే అవకాశం వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ దాని వెనుక ఉన్న రహస్యం రైతులు చేసే వ్యవసాయం  పేరుతో అప్పు తెచ్చుకోవడం. ఐక్యరాజ్యసమితిలో సస్టైనబుల్‌ ఇండియా ఫైనాన్స్‌ ఫెసిలిటీ, పీఎన్‌బీ పరిబాస్, యూఎన్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ప్రోగ్రాం, ఎ వరల్డ్‌ ఆగ్రా పార్‌స్టీ సెంటర్‌ అన్నీ కలిపి పెట్టిన ఒక సెమినార్‌కు చంద్రబాబు హాజరై దానిలో వ్యవసాయం గురించి మాట్లాడటం జరిగింది. అసలు చంద్రబాబుకి వ్యవసాయం అంటే తెలుసా? ఎందుకంటే వ్యవసాయం దండగని చెప్పిన బాబు రైతులను తొలి నుంచీ దగాచేస్తూనే వచ్చారు. వ్యవసాయంలో ప్రకృతి, సేంద్రీయ, జీవరసాయన ఎరువుల వ్యవసాయం వంటి పద్ధతులు ఉన్నాయి. కొండకోనలో ఎవరు ఏమీ చేయకపోయినా ఏదో ఒక పండ్లు కానీ ఇతరత్రా పంటలు కానీ పండేది ప్రకృతి వ్యవసాయం. పశువుల ఎరువు, ఇతర వర్మికంపోస్టుల నుంచి తయారు చేసిన ఎరువులతో చేసేది సేంద్రీయ వ్యవసాయం.

జీవరసాయన వ్యవసాయం అంటే మనకు దొరికే ఉమ్మెత్త, మారేడు బెల్లం, కోడిగుడ్లు,  పచ్చిమిరపకాయలు మొదలైన వాటి నుండి జీవామృతం తయారు చేసి వాటి ద్వారా వ్యవసాయం చేసే ఒక పద్ధతి. దేశంలో హరిత విప్లవం సాధించాలని, రసాయనాలతో అత్యంత దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా దేశానికి అన్నంపెట్టడం సాధ్యమయింది. రసాయన ఎరువు వేసి పండిన పంటల వలన జీవన విధానానికి ముప్పువాటిల్లుతున్న మాట నిజమే కానీ వాటిని బాగా తగ్గించి ప్రతి రైతుకీ అవగాహన కల్పించి, రైతులను ప్రోత్సహించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అలాగని ప్రకృతి, సేంద్రియ, జీవరసాయన వ్యవసాయాలు తప్పు అని చెప్పటం కాదు. చిన్న చిన్న క్షేత్రాలకే పరిమితమైతే వాటి దిగుబడులు కూడా తగ్గడం జరుగుతుంది. బాబు రాజదాని కోసం తీసుకున్న 36 వేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని చెప్పినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే బీడు బారిన ఆ భూములలో పిచ్చి మొక్కలు ఎలాగూ ఉంటాయి కనుక. అదే జీరో బడ్జెట్‌ వ్యవసాయమని చెప్పినా ఆశ్చర్యంలేదు.

2029కి 100% జీరో బడ్జెట్‌ ఫైనాన్స్‌ వ్యవసాయంలో రైతులందరినీ భాగస్వామ్యం చేస్తానని చెప్పటం ఏ మేరకు సాధ్యపడుతుంది? అలాగే రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లకు ఈ విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేస్తానని చెప్పిన మాటలు సత్య దూరం. అసలు అంత సాగు భూమి రాష్ట్రంలో ఉందా? చంద్రబాబుకి తెలియకా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికా? ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇలాంటి చీప్‌ పబ్లిసిటీ వ్యవహారాలు మానుకొని రైతుల కష్టాలు తెలుసుకొని వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతులను ఆదుకోవాలి.

జీరో బడ్జెట్‌ వ్యవసాయం చేయడం సాధ్యం కాదని దీని వల్ల దిగుబడులు సాధించలేమని ఇప్పటికైనా తెలుసుకొని, ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పులు తీర్చడం రాష్ట్రానికి గుదిబండగా మారినందున, మళ్లీ కొత్త అప్పులు తేవడం మాని, రాష్ట్రంలో ఉన్న అవి నీతికి అడ్డుకట్ట వేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ప్రజలు కోరుచున్నారు.

కొవ్వూరి త్రినాథరెడ్డి
వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర  వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
మొబైల్‌ : 9440204323

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా