నిలిచిపోయిన ‘నర్తనం’

24 Jan, 2018 00:58 IST|Sakshi

నివాళి
ఒక మువ్వ రాలిపోయింది... నిన్నటి దాకా నేలపై నర్తించిన పాదం... శివునితో నాట్యం చేయడానికి కైలాసం చేరుకుంది...కూచిపూడి వెంపటి వారసత్వం లయమై పోయింది... ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు పద్మవిభూషణ్‌ వెంపటి చినసత్యం రెండవ కుమారుడు నాట్యాచార్యులు వెంపటి రవి శంకర్‌ ఈ ఉదయం గుండె పోటుతో చెన్నైలో కన్నుమూశారు.

‘‘1969 అక్టోబర్‌లో జన్మించిన రవి శంకర్‌ తండ్రి దగ్గర నాట్యాభ్యాసం చేయలేదు. వెంపటి చినసత్యంగారి ప్రథమ శిష్యురాలు బాల కొండలరావు దగ్గర వెంపటి నాట్యం ఆరంభించారు. ‘శ్రీనివాస కల్యాణం’లో కల్పతరువుగా నటించి, తండ్రి దృష్టిలో పడ్డారు. కుమారుడిని చూసి తండ్రి మురిసి పోయారు. ‘ఇంతింతై వటుడింతౖయె’ అన్నట్లుగా తండ్రికి దీటుగా నాట్యకారుడిగా అవ తరించాడు. చినసత్యం రూపొందించిన అంశాలను 1994 – 2004 మధ్యకాలంలో ప్రదర్శించారు. అర్ధనారీశ్వరుడిగా నటించి అందరినీ అలరించారు. ‘హరవిలాసం’లో శివుడు, ‘శకుంతలదుష్యంతులు’లో దుష్యంతుడు, ‘కిరాతార్జునీయం’లో అర్జునుడిగా నటించారు. బాల్యంలోనే  ‘క్షీరసాగర మథనం’లో అప్సరసగా కూచిపూడి సంప్రదాయ రీతుల్లో ఆడ వేషం వేశారు. 

1994లో ‘వందే ఉమాసుతం’ అనే స్వీయరచన చేసి 2007లో నృత్య రూపకల్పన చేశారు. ఈ రూపకాన్ని ఐదు గతుల్లో నడిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎవ్వరూ స్పృశించని అనేక అన్నమయ్య కీర్తనలకు నృత్యాభినయం సమకూర్చి పిల్లల చేత ప్రదర్శనలు ఇప్పించారు. ‘అతడిని మించినవాడు లేడు’ అనిపించుకున్నాడు’’ అంటున్నారు ప్రముఖ నాట్యాచార్యులు కూచిపూడి గ్రామానికి చెందిన పశుమర్తి కేశవప్రసాద్‌.

‘‘మాస్టారుగారి అబ్బాయికి నేర్పడం నాకు గర్వంగా ఉంది. నా శిష్యుడు నన్ను అధి గమించాడు. తండ్రితో సమానంగా, తండ్రికి ధీటుగా ప్రతి విషయాన్ని చక్కగా కూచిపూడి శైలిలో మలిచాడు’’ అంటారు వెంపటి రవిశంకర్‌ నాట్యగురువులు శ్రీమతి బాల కొండలరావు. 

‘‘పద్మభూషణ్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ దగ్గర సంగీతం అభ్యసించి, కచేరీలు చేశాడు. ఆయన మంచి నాట్యాచార్యుడు, నర్తకుడు. ఆయనకు జ్ఞాత, అజ్ఞాత శిష్యులు దేశవిదేశాలలో ఉన్నారు. ఆయన అçస్తమయం కూచిపూడి కళారంగానికి తీరనిలోటు. అన్ని వాద్యాల మీద అపరిమితమైన పరిజ్ఞానం ఉంది. ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో, ఏ వాద్యాన్ని ఏ సందర్భానికి ఉపయోగించాలో బాగా తెలుసు. లఘువు బిగువులు తెలిసిన మహావ్యక్తి. కుర్రవాళ్లలో ఇటువంటి వ్యక్తిని చూడలేదు. తీర్చిదిద్దడం, అంశాన్ని డ్రమెటైజ్‌ చేయడం ఆయనకి బాగా తెలుసు. మాకు బాలా త్రిపుర సుందరి మీద కీర్తనలు పాడి ఇచ్చారు. అందరి మనసులలో స్థానం ఏర్పరుచుకున్నారు.

సంగీతం, నృత్యం నేర్చుకోవడమే కాదు, అందులో నిష్ణాతులు. చినసత్యం అంతటి వారవ్వగలిగిన జ్ఞాని ఆయన. కాని అనారోగ్యం కారణంగా కాలేకపోయారు. దక్ష యజ్ఞంలో శివుడు వేషం వేసి మెప్పించారు. విద్వత్సభలలో సంగీత కచేరీలు చేశారు. నట్టువాంగం రావాలంటే సంగీతం వచ్చి తీరాలి. చినసత్యం గారు రూపకల్పన చేసిన వాటిని యథాతథం ప్రదర్శించేవారు. ఆనందతాండవం, జయముజయము... వంటివి. చినసత్యంగారి వారసుడుగా నిలబడలేకపోవడం కూచిపూడికి తీరనిలోటు.. అంటు న్నారు విజయవాడకు చెందిన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల వెంకట రామశర్మ.

2008లో మొట్టమొదటి కూచిపూడి నాట్య సమ్మేళనం అమెరికాలో జరిగినప్పుడు తండ్రితో పాటు సిలికానాంధ్రకు విచ్చేసి ‘కూచిపూడి వైజయంతిక’ అనే బ్యాలేలో సిద్ధేంద్ర యోగి పాత్ర ధరించారు. అప్పటి నుంచి సిలికానాంధ్ర చేస్తున్న అన్ని కార్యక్రమాలకు తోడ్పడుతూ వచ్చారు. 2016లో విజయవాడలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళనానికి ‘సాధన వీడియో’ స్వయంగా తయారుచేసి అందించారు. అద్భుత మైన కళాకారుడు. మృదుస్వభావి. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున 2015లో కళారత్న పురస్కారం అందచేశాం. ఎన్నో సాధించవలసిన వ్యక్తి, చినసత్యంగారి వార సుడు ఆయన. వారి కుటుంబానికి తగిన సహాయం సిలికానాంధ్ర తరఫు నుంచి అంద చేయాలని సంకల్పించాం... అన్నారు సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్‌.
                                       – డాక్టర్‌ పురాణపండ వైజయంతి

మరిన్ని వార్తలు