చిన్నపరిశ్రమ ఆశలకు గండి

2 Feb, 2020 00:08 IST|Sakshi

విశ్లేషణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండో బడ్జెట్‌ని మొదటిసారి పరికిస్తే, ఆర్థిక వ్యవస్థ అనే వృషభాన్ని లొంగదీసుకుని ఇప్పుడున్న ఆర్థిక మందగమనాన్ని నిలువరించి, దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. దీర్ఘకాలం ఆర్థికమాంద్యం  కొనసాగితే అది మరింత పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. ఆదాయ పన్ను రేటును తగ్గించడం, భారీ పెట్టుబడులు అవసరమయ్యే ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రయత్నించడం, రైతులపై దృష్టిపెట్టి, రైతుల ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేస్తామని నొక్కి చెప్పడం వంటి  చర్యల ద్వారా ప్రజలకు మరింతగా నగదును అందజేయడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రయత్నించారు. ఆమె చేసిన ప్రతిపాదనలను ఎవరూ తప్పుపట్టలేరు.

 ఇటీవలి కాలం వరకు దేశంలో ఆర్థిక సంక్షోభం ఉందని అంగీకరించడానికి కూడా కేంద్రప్రభుత్వం సిద్ధపడలేదు. అయితే గత కొద్దినెలలుగా ఆర్థిక వ్యవస్థ సజావుగా లేదని నెమ్మదిగా అర్థం చేసుకోవడంతో తాజా బడ్జెట్‌ను ప్రభుత్వం సరైన దిశలో తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ స్వస్థతను పునరుద్ధరించడం కోసం ఆమె పూనుకున్న చికిత్సకు వివిధ దృక్ప«థాలకు చెందిన ఆర్థికవేత్తల సూచనలే ప్రాతిపదిక అని అర్థమవుతోంది.

 కానీ సంక్షోభం పరిమాణం, దాని లోతు బట్టి చూస్తే ఆర్థిక మంత్రి ప్రయత్నం ఫలితాలను ఇవ్వనుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. తాజా బడ్జెట్‌ వృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటున్నప్పటికీ, స్టాక్‌ మార్కెట్‌ కుప్పగూలడాన్ని చూస్తే నిర్మల బడ్జెట్‌ అంచనాలను అందుకోలేదని తెలుస్తుంది. వివిధ వాణిజ్యమండళ్లు, లాబీ గ్రూపులు ఈ బడ్జెట్‌ని స్వాగతించినా, వాటి సభ్యులు మాత్రం అంతర్గతంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగా లేదన్నది వారి అభిప్రాయం.

గత సంవత్సరం సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ పన్ను రేటును భారీగా తగ్గించడంతో బడ్జెట్‌కు ముందే తాము కోరుకున్నది పొందామని బడా పరిశ్రమ వర్గాలు సంతృప్తి చెందాయి. కానీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ బడ్జెట్‌వల్ల బాగా ఆశాభంగం చెందాయి. కార్పొరేట్‌ వర్గాలకు మల్లే తమకు కూడా కార్పొరేట్‌ పన్నును మినహాయిస్తారని వీరు ఆశలు పెంచుకున్నారు కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దేశం స్థూల ఆదాయంలో 32 శాతం వరకు దోహదపడుతున్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 11 కోట్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశ ఎగుమతుల్లో దాదాపు సగభాగం వీటి నుంచే జరుగుతున్నాయి.

 ఆర్థిక వ్యవస్థ సమగ్ర సంక్షేమానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుద్ధరణ కీలకమైనదని మనకు సులభంగా అర్థమవుతుంది. ప్రత్యేకించి 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ కలిగించిన ప్రకంపనలతో ఈ రంగానికి ఊపిరాడటం లేదు. తాము కోల్పోయిన వైభవాన్ని ఇవి ఇంకా సాధించడం లేదు. ఆనాటి నుంచి వందలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి కూడా. పన్ను వివాదాలు, వివాదాస్పదంగా మారిన పన్ను చెల్లింపు మొత్తాలకు సంబంధించి ప్రభుత్వ సహా యాన్ని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కోరుకుంటూ ఎదురు చూస్తున్నాయి. ఆర్థిక మంత్రి పన్ను వివాద పరిష్కార పథకాన్ని ప్రారంభించారు కానీ 2020 మార్చి 31లోగా చెల్లించని బకాయిలపై అపరాధరుసుం, వడ్డీరేటును తగ్గిస్తానని హామీ ఇవ్వడం తప్పితే మరే ఇతర రాయితీలనూ ఇవ్వడానికి తిరస్కరించారు.

ఈ సంవత్సరం మార్చి 31 తర్వాత చెల్లించే బకాయిలకు ఈ రంగం య«థాప్రకారం అపరాధరుసుం, వడ్డీరేటును చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం కూడా జూన్‌ 30 వరకే అందుబాటులో ఉంటుంది. అందుకే చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఈ షరతుపట్ల తీవ్రంగా ఆశాభంగం చెందిఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలకు జీఎస్టీ వివాదాలు మరొక శిరోభారంగా మారాయి. రాబడి ఫైలింగ్‌ వ్యవధిని మరో సంవత్సరం పాటు ప్రభుత్వం పొడిగించిందంటే, ప్రారంభించి రెండున్నర సంవత్సరాలు  పూర్తయినప్పటికీ నూతన పన్ను వ్యవస్థ ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని స్పష్టమవుతోంది. ఈ ఏప్రిల్‌ నుంచి ఆదాయ రిటర్నులను మరింత సరళీకరిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటిం చారు. అంటే జీఎస్టీ వ్యవస్థలో తలెత్తిన పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదనే అర్థం. పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్‌లను సకాలంలో పొందనట్లయితే అది నిరుపయోగమే అవుతుంది. పన్నుల రూపంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం స్వాగతించదగినదే. పన్నువసూళ్ల రంగంలోని పాలనాధికారులను ఆమె కట్టడి చేసినట్లయితే దేశం మొత్తానికి పెద్ద సేవ చేసినవారవుతారు.

జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్‌కి సంబంధించిందే అయినప్పటికీ బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా దాని హేతుబద్దీకరణ సాధ్యం కావడంలేదు. పాత, కొత్త పన్నుల వ్యవస్థ పక్కపక్కనే కొనసాగించడం వల్ల మరింత గందరగోళం పెరిగి కల్లోలానికి దారి తీస్తోంది. ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంచడం, 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదనీ, 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను చెల్లించాలని,  రూ. 5–7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు ఉంటుందని, రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు ఉంటుందని, రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను, రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలని ఆదాయపన్నులో మినహాయింపు ఇవ్వడం కాస్త ఊరటనిచ్చేదే. పైగా ఆర్థిక వ్యవస్థలో డిమాండును ఇది ప్రోత్సహిస్తుంది కూడా.


లక్ష్మణ వెంకట్‌ కూచి
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు 

మరిన్ని వార్తలు