సంక్షోభంలో శాసనసభ సమావేశాల ప్రాధాన్యత

22 May, 2020 15:00 IST|Sakshi

కోవిడ్‌–19 ఉపద్రవం వల్ల పార్లమెంట్, ఆయా రాష్ట్రాల శాసనసభలు తమ బడ్జెట్‌ సమావేశాలను కుదించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు జరగాల్సిన సమావేశాలను రద్దు చేశాయి. బదులుగా బడ్జెట్‌ కేటాయింపులపై అత్యవసరాదేశం(ఆర్డినెన్స్‌) జారీ చేశాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి కోవిడ్‌–19 సంక్షోభంలో 4500 పైగా నోటిఫికేషన్లు ఇచ్చాయి.

చట్టాలు చేసే అధికారాన్ని రాజ్యాంగం శాసనసభలకు ఇస్తోంది. వీటిని కార్యనిర్వాహక శాఖ అమలుపరుస్తుంది. వాటికి సంబంధించిన ఖర్చులు మినహా విధానాలు, ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లకు శాసనసభ ఆమోదం అవసరం లేదు. కానీ శాసనసభ ఆమోదం లేకపోతే ఆర్డినెన్సులు నియమిత కాలం మేరకే చెల్లుతాయి. శాసనసభ సమావేశాలు జరగని సమయంలో మాత్రమే రాష్ట్రపతిగానీ, గవర్నర్లు గానీ వీటిని జారీ చేస్తారు.

అలాగే, ప్రభుత్వ చర్యల మీద పర్యవేక్షణ చేసే అధికారం కలిగివుండటంతోపాటు ప్రభుత్వ అన్ని చర్యలకూ, నిష్క్రియాపరత్వానికీ కూడా దాన్ని బాధ్యురాలిగా నిలబెట్టే అధికారం శాసనసభ కలిగివుంటుంది. అయితే, అవేమీ తరచూ సమావేశం కావు, ముఖ్యంగా రాష్ట్రాల శాసనసభలు. సంవత్సరంలో సగటున 26 రోజులు సమావేశం అవుతాయి. అందులోనూ ఎక్కువ రోజులు బడ్జెట్‌ సమావేశాలకే ఖర్చవుతాయి. దాంతో చట్టాలు, బడ్జెట్‌ ప్రతిపాదనలు అవి ప్రవేశపెట్టిన వెంటనే తరచుగా పెద్ద మధనం జరగకుండానే ఆమోదం పొందుతాయి. అయితే పార్లమెంటరీ సమావేశాల సంఖ్య తగ్గినప్పటికీ, కార్యశీల స్టాండింగ్‌ కమిటీల ద్వారా ఆ లోటు పూడుతోంది. మంత్రిత్వ శాఖల చర్యలనూ, చట్టాలనూ ఈ కమిటీలు పరిశీలిస్తాయి. ఇలాంటి  విధానం ఆయా రాష్ట్రాల శాసనసభల్లో మొత్తంగా లేకపోవడంగానీ, ఉంటే నిష్క్రియత్వంతోగానీ ఉన్నాయి. కాబట్టే, కోవిడ్‌–19ను ఎదుర్కోవడానికిగానూ ప్రభుత్వాలు జారీ చేస్తున్న వివిధ ఆదేశాలు, ఆర్డినెన్సులను సూక్ష్మంగా పరిశీలించి, వాటి అనంతర పరిణామాలను అంచనావేయడానికి  శాసనసభ సమావేశాలు జరగడం అత్యావశ్యం.

నిర్దేశిత భవనాల్లో భౌతికంగా సమావేశాలు జరిగే సంప్రదాయ విధానాన్ని కోవిడ్‌–19 మహమ్మారి నిలువరించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా మూడు రకాలుగా శాసనసభల సమావేశాలు జరుగుతున్నాయి. (1) భౌతిక దూరం పాటిస్తూ జరుగుతున్న సమావేశాలు, (2) ఆన్‌లైన్‌ సమావేశాలు, (3) అసలు సమావేశాలే లేకుండా పోవడం.

ఇండియా ప్రస్తుతం మూడో విభాగంలోకి వస్తుంది. ఒక్క మేఘాలయ శాసనసభ మే 20న సమావేశం కావడం, అదీ యధావిధిగా ఏ నిర్బంధాలూ లేకుండా జరగడం ఒక్కటే దీనికి మినహాయింపు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే– పార్లమెంటు, అసెంబ్లీ నియమాలు ఏవీ కూడా ఫలానా చోట జరగాలనిగానీ, భౌతికంగానే జరగాలనిగానీ నిర్బంధాలు విధించలేదు. కేవలం ఛైర్మన్‌/స్పీకర్‌ లేదా అధికృత ఎంపీ/ఎమ్మెల్యే వాటికి అధ్యక్షత వహించాలనేది ఒక్కటే ఆవశ్యకత. అంతేకాదు, సమావేశాన్ని నడపడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విస్తృతమైన విచక్షణాధికారాలు ఛైర్మన్‌/స్పీకర్‌ కలిగివుంటారు.

ఈ పరిస్థితి ఇండియాకే ప్రత్యేకమైనది కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాసనసభలు అవి ఏ విధంగా కార్యాచరణ చేయదలిచాయో ఒక విధానాన్ని ఏర్పరుచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని దేశాలు ఇలా స్పందించాయి: (1) ఫ్రాన్స్, స్పెయిన్‌ లాంటివి భౌతిక దూరాన్ని పాటిస్తూ సమావేశాలు జరిపేలా నిర్ణయం తీసుకున్నాయి. (2) ఇటలీలో మాస్కుల ధరింపును తప్పనిసరి చేశారు. (3) గ్రీసులో ప్లెక్సిగ్లాసు ఆవరణలు ఏర్పాటు చేసుకున్నారు.  (4) మాల్దీవులు, ఎస్తోనియాల్లో ఆన్‌లైన్‌ సమావేశాలు జరుగుతాయి. అయితే అన్నిరకాల చర్చలు, కమిటీ సమావేశాలు, ఆఖరికి ఓట్లు వేయడం కూడా వాస్తవిక సమయం (రియల్‌ టైమ్‌) మాదిరిగానే జరుగుతాయి.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భారత పార్లమెంట్‌ ముందు వరుసలోనే ఉంది. టెలీప్రింటర్లు, కంప్యూటర్లు ఉపయోగించడం, సమావేశాల తీరును ప్రసారం చేయడం లాంటి చర్యలను తీసుకుంది. జీతాలు, భత్యాలకు సంబంధించి ఏప్రిల్‌లో సమావేశం జరిపి పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీ కూడా ఒక ఉదాహరణగా నిలిచింది. ఎంపీల వేతనాల్లో 30 శాతం కోతను సిఫారసు చేయడానికి ఈ ఆన్‌లైన్‌ సమావేశం జరిగింది. అయినప్పటికీ, ఇంకా స్టాండింగ్‌ కమిటీల ఆన్‌లైన్‌ సమావేశాల సాధ్యాసాధ్యాలను లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులు అంచనావేస్తున్నారు. చాలా శాసనసభలు జూలై తర్వాత మాత్రమే సమావేశం కావాలని నిర్ణయించివున్నందున, ఆన్‌లైన్‌ సమావేశాలు జరపడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు. అప్పుడు, ప్రభుత్వ పరంగా జరిగే పొరపాట్లను శాసనసభ పరిశీలించడం ఈ సంక్షోభ సమయంలో కూడా ఆగకుండా కొనసాగించినట్టు అవుతుంది.


– అనూప్‌ రామకృష్ణన్, ఎన్‌.ఆర్‌.అఖిల్‌

(వ్యాసకర్తలు న్యూఢిల్లీ కేంద్రగా పనిచేసే పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్థలో ప్రోగ్రామ్‌ ఆఫీసర్స్‌)

మరిన్ని వార్తలు