ఓ గొప్ప మజిలీ

12 Apr, 2018 01:43 IST|Sakshi

జీవన కాలమ్‌

జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్‌. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్‌ టికెట్టు లేని ప్రయాణం.

రెండు రోజుల్లో నేను 80. చాలా కారణాలకి ఇది చాలా గొప్ప మజిలీ. ఈ దేశంలో గొప్పతనా నికి మన్నిక లేకపోవచ్చుకానీ వయస్సుకి ఉంది. అది సుఖ వంతమైన జీవితానికి పెట్టు బడి. ఈ వయస్సులో శషబి షలు చెల్లిపోతాయి. ఇచ్చకా లకు కొత్త అర్థం వస్తుంది. ఎవరినయినా, ఎప్పుడైనా నిరంతరాయంగా విమర్శించవచ్చు. నచ్చితే మెచ్చుకుం టారు. నచ్చకపోతే ‘పాపం, ఆయనకి వయస్సు మీద పడిందయ్యా’ అని పక్కకి తిరిగి నవ్వుకుంటారు. నడకలో హుందాతనం పెరుగుతుంది. కుర్చీ లోంచి చక్రవర్తిలాగా ఠీవిగా లేవవచ్చు. అవి కీళ్ల నొప్పు లని మనకి తెలుస్తాయి. హుందాతనమని చూసినవారు సరిపెట్టుకుంటారు. తెలిసి తెలిసి తప్పులు చెయ్య వచ్చు. వయస్సు కనుక అందరూ అర్థం చేసుకుం టారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్ప వచ్చు. చాలామంది ముఖాలు గుర్తున్నా మరిచిపోయి నట్టు నటించవచ్చు.

‘నువ్వు వెంకటరావు కొడుకువి కదా?’ అని తెలిసి తెలిసి పలకరిస్తే– ‘కాదండీ. నేను చిన్నారావు మనుమడినని’ ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం వస్తుంది. కుర్రకారుని ‘మీకేం తెలీద’ని అదిలించ వచ్చు. ఇదివరకులాగా ఆ మనిషి కోపం తెచ్చుకోడు. మనసులో ‘పిచ్చి ముండాకొడుకు’ అనుకున్నా బయ టికి చిరునవ్వు నవ్వుతాడు. వాడు అలా అనుకుంటు న్నాడని నీకు తెలుసు. అనుకున్నా వాడిని తిట్టగలిగినం దుకు నీకు ఆనందంగా ఉంటుంది. ఎన్నాళ్ల కోరిక అదో! ఇది పాత ‘మచ్చ’ని తడువుకునే పిచ్చి సుఖం. పచ్చి సుఖం. ముసలివాడులెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థ మవుతూ ఉంటుంది. ఏ సమస్యమీదయినా నీ అభి ప్రాయాలను గుప్పించవచ్చు. చెల్లితే అనుభవం. చెల్లక పోతే ముసలితనం దిగజారుడు.వయస్సు మీద పడింది లెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థమ వుతూ ఉంటుంది. నీ ఆలోచనల అవసరం లేకుండా నీ అభిప్రాయాలను విరివిగా గుప్పించవచ్చు.  అవి నీ ‘అమోఘమైన’ ఆలోచనతో చెప్పే హితవులాగా అందరూ వింటారు. కానీ వాళ్లు తలలూపుతున్న గొర్రె లని నీ మనస్సు చెప్తూంటుంది. నీ మనస్సు నవ్వు కుంటుంది. వాళ్ల మనస్సూ ఆ పనే చేస్తోందని నీకు తెలుస్తూంటుంది. రెండురకాల ‘ఆత్మవంచన’ వ్యాయామానికి ఈ దశ ప్రారంభం.

ఇష్టంలేని వాళ్ల ముఖంమీద చెడామడా తిట్ట వచ్చు. నీ పెద్దరికం కారణంగా కడుపులో రగులు తున్నా ‘పోండి సార్‌! మీరు మరీనూ!’ అని పిచ్చి నవ్వు నవ్వుతారు. ఆ పిచ్చి నీకు కిర్రెక్కిస్తుంది.
వయస్సులో నువ్వు చేసిన తప్పిదాలను నీ భార్య సరిపెట్టుకుంటుంది. ఇప్పుడిక చేసేది లేదు కనుక. అది కేవలం సరిపెట్టుకోవడమేనన్న నీ ‘వంకర’ బుద్ధి నిన్ను ‘చక్కిలిగింత’ పెడుతుంది. పాత జ్ఞాపకం– గుర్తొచ్చిన ‘దురద’ లాంటిది. మరోసారి గోకినా ‘సుఖం’గానే ఉంటుంది. ‘ఈ కుర్రకారు తగలబడి పోతోందని’ తరచుగా పెదవులు విరవొచ్చు. ఆ కుర్ర కారు చస్తే మారదని నీకూ తెలుసు. ఇది పాత ‘దురద’ని లేకపోయినా గోక్కోవడం లాంటిది. రాసిన ప్రతీ విషయాన్నీ– ఇప్పుడు– ఎవరూ సీరి యస్‌గా తీసుకోరు. బాగులేని కథని చదివి ‘ముస లాడిలో సరుకయిపోయిందనుకుంటూ’ ‘ఆహాహా! మీరు కాకపోతే ఎవరు రాస్తారు సార్‌ ఇది!’ అని లుంగలు చుట్టుకుపోతాడు. ఇంకాస్త జుత్తుంటే ‘గండ పెండేర మంటారు. సగమయినా ఊడితే రెండు యూని వర్సిటీల ‘డాక్టరేట్లు’ంటాయి. మరీ జుత్తు పండి– ఇంకా బతికుంటే ఓ ‘పద్మా..’ అవార్డ్‌ మొహంమీద పారేస్తారు.

ఎనభయ్యో పడిలో కదలలేకపోయినా మోసుకెళ్లి రెండు మూడు సన్మానాలు– మీ కోసం కాదు– ఆయా సంస్థల గొప్పతనం కోసం– చేస్తారు. రచనలన్నీ వెదికి వెదికి పునర్ముద్రణలు చేస్తారు. నువ్వే మరిచిపోయిన గతాన్ని తవ్వి అలనాడు బట్టలు ఎండేసే తాడుమీద వాలిన కాకి నీలో ఎలా మొదటి కవితా వైభవాన్ని మేలుకొలిపిందో ఓ కవి గానం చేస్తాడు– ఆవేశంగా కన్నీటి పర్యంతం అవుతూ. ఇంతకూ ఏం జరిగింది? ఇంక నువ్వు ఎక్కువ కాలం బతకవని వాళ్లకి నమ్మకం కుదిరింది. ‘నువ్వు పోయే కాలం వచ్చిందని వాళ్లకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నిన్ను మెచ్చుకోవడం ‘వారి’ అభిరుచిగా తర్జుమా చేసుకుంటారు. ఇది ‘సాహిత్య పరిణామ కంపు’. గతాన్ని అటకెక్కించే గౌరవ వందనం. అయ్యో! ఈ 80 ఏళ్ల వయస్సు ఏ 40 ఏళ్లకిందటో వచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. కానీ జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్‌. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్‌ టికెట్టు లేని ప్రయాణం. ముందుకు వెళ్తున్న ప్రతీ క్షణమూ మళ్లీ తెరుచుకోని తలుపుల్ని ఒక్కొక్కటే మూసుకుంటూ ముందుకు సాగిపోయే ప్రస్థానంలో గంభీరమైన మజిలీ–80.


గొల్లపూడి మారుతీరావు

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు