ఒకే దఫా రుణమాఫీ అవశ్యం

25 Nov, 2017 01:56 IST|Sakshi

విశ్లేషణ

భారతీయ రైతుల ఆత్మహత్యలకు, దుస్థితికి తక్షణ కారణం రుణగ్రస్తతే. దేశ వ్యాప్తంగా 2016లో రుణగ్రస్తత 53 శాతానికి చేరుకోగా, కొన్ని రాష్ట్రాలలో ఇది 89 నుంచి 93 శాతానికి చేరుకుంది. సగటు రైతు రుణాలను చెల్లించే స్థితిలో లేడు. అందుకే రైతు రుణాలన్నింటినీ ఒకే దఫాలో మాఫీ చేయాలి.

నవంబర్‌ 20, 21 తేదీల్లో దేశ రాజధాని రైతుల చారిత్రక సమావేశానికి సాక్షీభూతంగా నిలిచింది. ఢిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌ వద్ద వేలాదిమంది రైతులు కిసాన్‌ ముక్తి సంసద్‌ ఆధ్వర్యంలో హాజరయ్యారు. ఈ సంస్థ భారతీయ రైతులను శృంఖలాలనుంచి విముక్తి చేసే మార్గాలను వెతికే రైతు పార్లమెంట్‌. ఈ పార్లమెంట్‌లో రెండు చారిత్రక చట్టాలను ప్రతిపాదించి వాటిని బహిరంగ చర్చకు విడుదల చేశారు. వీటి వివరాలను  www.aikscc.comలో చూడవచ్చు. ఈ మహా సంఘటన నూతన యుగపు రైతుల ఉద్యమానికి నాంది పలికింది.

ఈ రైతు సమావేశం అనేక రకాలుగా చారిత్రకమైనది. మొదటగా, ఇది దేశంలోని రైతాంగ సంస్థలతో కూడిన అతి పెద్ద సంకీర్ణ కూటమికి ప్రాతినిధ్యం వహించింది. అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) రాజకీయ, సైద్ధాంతిక విభజనలకు అతీతంగా 184 సంస్థలతో కూడుకున్నది. రెండు, ఇది రైతాంగ ఉద్యమ చరిత్రలోనే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులను ఏకం చేసి తీసుకొచ్చిన అరుదైన సందర్భం. మూడోది, ఇటీవలి చరిత్రలో భారతీయ రైతులకు చెందిన వివిధ విభాగాలు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. దీంట్లో రైతులు, కౌలుదార్లు, భూమి లేని కూలీలకు సంబంధించిన సంఘాలను ఒకటిగా చేయడంలో ఏఐకేఎస్‌సీసీ అత్యంత జాగరూకతతో వ్యవహరించింది. నాలుగు, ఈ సదస్సులో తొలి సెషన్‌ కేవలం మహిళా రైతులతోనే నిర్వహించడమైనది. మన వ్యవసాయానికి మహిళా రైతులే కేంద్రబిందువులుగా గుర్తించడం జాతీయ రైతు సంఘాల చరిత్రలో ఇదే మొదటిసారి.  దేశంలో దాదాపు 70 శాతం వ్యవసాయ పనులను మహిళలే చేస్తున్నారు కానీ, రైతు ఉద్యమాల నాయకత్వం నుంచి వారిని పూర్తిగా మినహాయించారు. చివరిగా, ఇంత పెద్ద రైతాంగ కూటమి అతి క్లుప్తమైన, ముఖ్యమైన, ఆచరణీయమైన డిమాండ్లను ప్రతిపాదించడానికి అంగీకరించడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం.

ప్రభుత్వం నుంచి కొత్త ఒప్పందాన్ని డిమాండ్‌ చేయడానికి గాను, రైతులు ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిపెట్టారు. తమ పంటలకు న్యాయబద్ధమైన, తగిన ప్రతిఫలమివ్వగల ధరలను అందించడం, రుణాలనుంచి పూర్తిగా విముక్తి చేయడం.. ఇవే వారి డిమాండ్లు. ఒకరకంగా చూస్తే వీటిలో కొత్త విశేషం ఏమీలేదు. రుణమాఫీ, మెరుగైన కనిష్ట మద్ధతు ధర (ఎమ్‌ఎస్‌పి) రైతు సంఘాలు చిరకాలంగా చేస్తున్న డిమాండ్లు. కానీ తొలిసారిగా రైతులు ఇతర అంశాలను పక్కనబెట్టి పూర్తిగా ఈ రెండు డిమాండ్లపైనే దృష్టి పెట్టారు. పైగా, అతి స్పష్టమైన సమర్థనతో, నిశిత విధాన రూపకల్పనతో రైతులు ఈ రెండు డిమాం డ్లను ఒక కొత్త భాషలో తీసుకురావడం మరీ విశేషం. నూతన యుగ రైతుల ఉద్యమం నూతన భాషలో మాట్లాడటం నేర్చుకుంది మరి.

‘వ్యవసాయ ఉత్పత్తులకు హామీ ఇచ్చే ధరలు రైతు హక్కు’ అనేది రైతుల తొలి డిమాండ్‌. వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయబద్ధమైన, తగిన ప్రతిఫలమివ్వగల ధరలను వీరు డిమాండ్‌ చేశారు. భారతీయ రైతులకు ఇదే నేడు అత్యంత ముఖ్యమైన అవసరం. వ్యవసాయ పంటల ఉత్పత్తిదారులు మొత్తంగా ఒక అన్యాయ వ్యవస్థ పాలబడ్డారు వ్యవసాయ ఉత్పత్తుల ధరలను సంవత్సరాల తరబడి ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ వచ్చారు. అదే సమయంలో వ్యవసాయ పెట్టుబడుల ఖర్చు ఊర్ధ్వ దశలో పెరుగుతూ పోయింది. 24 రకాల పంటలకు కనిష్ట మద్దతు ధరను ప్రభుత్వం లాంఛనప్రాయంగా ప్రకటిస్తున్నప్పటికీ, 10 శాతం రైతులు మాత్రమే ఈ హామీ నుంచి లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత మార్కెటింగ్‌ సీజన్‌లో దేశంలోని వంద అగ్రశ్రేణి మండీలలోని ధరలను విశ్లేషించగా, ఖరీఫ్‌ సీజన్‌లో పండే ఎనిమిది ప్రధాన పంటల మార్కెట్‌ ధర కనీస మద్దతు ధరకంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల ఈ ఒక్క సీజన్‌లోనే దేశ రైతులు రూ. 36 వేల కోట్ల మేరకు నష్టపోయారు.

పైగా, ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా అన్నిరకాల పంటలకు చాలా తక్కువగా ఉంటోంది. అందుకే వ్యవసాయ ఉత్పత్తి కోసం పెట్టే ఖర్చులో 50 శాతంకంటే అధికంగా తమకు దక్కేలా మద్దతు ధరపై హామీ ఇవ్వాలని రైతులు డిమాండు చేస్తున్నారు. బీజీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా జాతీయ రైతుల కమిషన్‌ సిఫార్సు చేసిన కనీస మద్దతు ధరను తమ చట్టబద్దమైన హక్కుగా అమలు చేయాలన్నది వీరి డిమాండ్‌.

ఇది సాధ్యం కావాలంటే మొదటగా ప్రభుత్వం ధాన్య సేకరణ పరిమాణాన్ని పెంచాలి. రెండు. మార్క్‌ఫెడ్, నాఫెడ్, పౌర సరఫరాల శాఖలు సకాలంలో, సమర్థవంతంగా మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. మూడు, ప్రకటిత మద్దతు ధర కంటే మార్కెట్‌ ధరలు తగ్గిపోయినప్పుడు, ఆ వ్యత్యాసంతో కూడిన ధరను, లోటు ధర చెల్లింపు వ్యవస్థ ద్వారా రైతులకు చెల్లించాలి. నాలుగు, ప్రకటించిన ఏ సరుకునైనా కనీస మద్దతు ధరకంటే తక్కువ రేటుకు కొనుగోలు చేయడం నేరంగా ప్రకటించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

రైతుల ఆత్మహత్యలకు, రైతుల దుస్తితికి తక్షణ కారణం రుణగ్రస్తత. రైతుల రుణగ్రస్తత నిష్పత్తి 1992లో 25 శాతం ఉండగా, 2016 నాటికి 52 శాతానికి పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇది 89 నుంచి 93 శాతానికి చేరుకుంది. సగటు రైతు తాను తీసుకున్న రుణాలను చెల్లించే స్థితిలో లేడు. దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో 68 శాతం మంది ప్రతికూల ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ రుణగ్రస్తతకు పంటల వైఫల్యం, ధరల పతనం, అధిక ఉత్పత్తి ఖర్చులు, నీటి కొరత, ప్రకృతి వైపరీత్యాలు వంటి రైతుల చేతుల్లో లేని అంశాలే కారణాలు.

అందుకే దేశంలోని రైతులందరి మీద భారం మోపుతున్న వ్యవసాయ రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలి. జాతీయ, సహకార, ప్రైవేట్‌ బ్యాంకుల రుణాలన్నింటికీ ఈ ఏకకాలపు మాఫీని అమలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి మద్దతివ్వాలి. రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కూలీలు, ఆదివాసీ, మహిళా రైతులందరినీ తమ రుణమాఫీ నుంచి విముక్తి చేయాలి. చివరగా కేరళలో లాగా జాతీయ రుణ ఉపశమన కమిషన్‌ని తక్షణం ఏర్పర్చాలి.

రైతులు చేస్తున్న ఈ రెండు డిమాండ్లు దేనికదే విడిగా లేవు. హామీ ఇచ్చినమేరకు ఆదాయాలు లేకుంటే రైతులపై రుణభారం తొలగదు. రుణాలను ప్రతి ఏటా పోగు చేస్తూపోతే తగిన ప్రతిఫలంతో కూడిన ధరలు లభించవు. ఈ రెండింటినీ పరిష్కరించినప్పుడే భారతీయ వ్యవసాయం, రైతుకు భవిష్యత్తు ఉంటుంది. మన రైతులు ఇప్పుడు ఫిర్యాదు చేసి ఊరుకోవడంతో సరిపెట్టుకోవడం లేదు. రైతుల ప్రతిపాదనలకు స్పందించిన బాధ్యత దేశం మీదే ఉంది.


- యోగేంద్ర యాదవ్‌

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
మొబైల్‌ : 98688 88986
Twitter: @_YogendraYadav

మరిన్ని వార్తలు