ఆయువును పెంచేది ప్రేమానురాగాలే.!

31 Mar, 2018 01:48 IST|Sakshi

‘ఈమె మరో రెండు వారాలు మహా ఆయితే మరో వారం రోజులు మాత్రమే బతుకుతుంది’ అని ఐసీయూ వైద్యులు పేషెంట్‌ కుమార్తె, కుమారుడికి చెప్పారు. ఆ పేషెంట్‌ వయస్సు 60 ఏళ్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితురాలు. చివరిదశలో ఐసీయూలో పెట్టగా వైద్యులు చెప్పిన ఆమె అంత్యదశకు చెందిన సమాచారమిది. ఆమెకు వైద్యం లేదని గంటలు, రోజులు మాత్రమే లెక్కపెట్టుకోవాలని వైద్యులు చెప్పారు. ఇవేవీ ఆమెకు తెలీవు. ‘నన్ను ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంచొద్దు. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లండి. నాకు ఇక వైద్యం వద్దు’ అని ఆమె తన కన్నవారిని కోరుకుంటోంది. ఏం చేయాలో తోచని ఆమె కూతురు, కొడుకులకు ఎవరో ‘స్పర్శ్‌ హాస్పీస్‌’ గురించి తెలిపారు. 

‘ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉన్నట్లే గౌరవప్రదమైన మరణం కూడా ఒక హక్కుగా ఉంటుంది’ అని ప్రగాఢంగా నమ్మిన సంస్థ స్పర్శ్‌ హాస్పీస్‌. మనిషి పుట్టినప్పుడు ఆ కుటుంబం ఎలా సంబరాలు జరుపుకుంటుందో, అదేవిధంగా చావుని కూడా పేషెంట్‌ సంతోషంగా ఆహ్వానించే ధైర్యాన్ని కలిగించి ‘బాధరహిత’ అనుభవంగా అంత్య దశను కల్పించడం ఆ కుటుంబం బాధ్యత. స్పర్శ్‌ సంస్థ ఆ ఉద్దేశంతోటే అంత్యదశలో ఉన్న క్యాన్సర్‌ బాధితులకు తన వంతు తోడ్పాటు అందిస్తోంది. 

ఈ నేపథ్యంలో తమ తల్లి రిపోర్టులు తీసుకుని వారు స్పర్శ్‌ సాయం కోసం వచ్చారు. అలా స్పర్శ్‌కి వచ్చేటప్పటికి ఆమె అపస్మారక దశలో, ముక్కులో ట్యూబ్‌తో, ఆక్సిజన్‌ సిలిండర్‌తో ఉన్నారు. ఆమె బాధలకు తగిన మందులు ఇవ్వడమైంది. క్రమంగా అపస్మారక స్థితి నుంచి కోలుకుని, ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం లేకుండా స్వయంగా గాలి పీలుస్తూ, ట్యూబ్‌ల అవసరం లేకుండా నోటితో ఆహారం తీసుకునే స్థితికి వచ్చారు. తన దగ్గరి బంధువులతో కబుర్లు చెబుతూ మూడున్నర నెలలు స్పర్శ్‌లో ఉన్నారు. 

రోజుల్లో చనిపోతుందని వైద్యులు చెప్పిన ఆమె..  కుటుంబ సభ్యుల ప్రేమ, ఇంటి వాతావరణం ఉన్న నవీన వైద్యశాల వలన నెలలపాటు బతికారు. ఆమె మరణం కూడా కుటుంబ సభ్యుల మధ్యే సుఖంగా జరిగింది. నిజానికి అంత్యదశ పేషెంట్ల జీవితకాలం పెంచడానికి స్పర్శ్‌ ఎలాంటి చికిత్స చేయదు. వారి మిగిలిన జీవిత కాలంలో ప్రేమ అనురాగం, ఆత్మీయతలను నింపుతుంది. అదే వారికి నవీన శక్తినిచ్చి నాణ్యమైన అంత్యదశను అనుభవిస్తారు. అంత్యదశలో సుఖమరణాన్ని అందరికీ అందుబాటులో డబ్బులతో సంబంధం లేకుండా అందించడమే స్పర్శ్‌ ముఖ్య లక్ష్యం.

– శారద, స్పర్శ్‌ హాస్పీస్‌ సంస్థ వలంటీర్‌ ‘ 040–23384039

మరిన్ని వార్తలు