‘రూల్‌ ఆఫ్‌ లా’ను కాటేస్తున్న కరోనా

3 Apr, 2020 01:06 IST|Sakshi

విశ్లేషణ

అసలే మందులేని రోగం. కావలసినన్ని ఐసీయూ గదులు, డాక్టర్ల మాస్క్‌లు కూడా లేవు.  లాక్‌డౌన్‌ తప్ప ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేని దీన దశ. నోరుమూసుకుని ఇంట్లో ఉండటం తప్ప పౌరులు చేయగలిగిన పనేదీ కనిపిం చడం లేదు. చస్తామేమో అనే భయం వల్లే వారాల తరబడి దిగ్బంధనాలకు అంత అవసరం, ప్రాణాం తక ప్రాధాన్యం వచ్చి పడింది. కర్ఫ్యూలో బయటకు వచ్చిన వాడిని తంతున్నారు. వంగబెట్టి లాఠీ లతో ఎడాపెడా కొడుతున్నారు. కానీ పెద్ద మీటిం గ్‌లు, సమావేశాలు పెట్టిన వారు, మతబోధలు చేసేవారు, కావాలని తుమ్మిన వారు, ఉమ్మిన వారు, దగ్గి తుంపరలు పంచి రోగాలు పెంచేవారు.. లాఠీ లతో ఎవరు కొడతారు వీళ్లను?

 ఏమైనా కానీ ఈసారి అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిపి తీరతానంటాడు ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌. కరోనా వైరస్‌ అల్లా పంపిన సైనికుడు అంటాడు ఒక ఇమాం. లాకౌట్‌లో బయటకు వస్తే పిర్రల మీద లాఠీ దెబ్బలు తినాలి. కాని ఉత్సవాలు, ప్రబోధాలు చేసుకుంటే ఫరవాలేదా? ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లీఘీ అమిర్‌ సాడ్, దేశ విదేశీ ప్రతినిధులతో మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ పైన, కరోనా వైరస్‌ పైన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఒక జాతీయ టీవీ చానల్‌ వీడియోలో చూపింది. కరోనా విషానికి మతం, రాజకీయ రంగులు పులమడం, చివరకు జీహాద్‌ ఆయుధంగా కూడా వాడుకోదలచుకుంటే, ఈ రోగానికి ఎందరు ఆహుతి అవుతారు?

 మొదటి కరోనా మరణం మనదేశంలో జనవరి 30న చూసాం. మార్చి 19 దాకా ప్రభువులు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. యంత్రాంగాలు నిద్రలో ఉన్నాయి. హఠాత్తుగా జనతా కర్ఫ్యూ ప్రకటించారు. అది ముగిసిందో లేదో లాక్‌డౌన్‌ మొదలైంది. ఎయిర్‌ పోర్టులు, రైళ్లు, బస్సులు, మెట్రోలు నిలిచిపోయాయి. అయినా రకరకాల సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. నిజాముద్దీన్‌ నుంచి మత ప్రచారాలకై మారుమూల గ్రామాలకు వెళ్తూనే ఉన్నారు. ఇండోనేషియా వారు తెలంగాణకువచ్చి కరోనా కరచాలనాలు, వైరస్‌ మతప్రబోధాలు చేసారు. ఆరుగురు చనిపోయారు. తబ్లిఘీ సమావేశాల్లో హాజరైన వేలాది మంది దేశంలో ఏ మూలకు వెళ్లి ఎందరిని కలిశారో ఆరా తీయడానికి వారిని వెంటాడి వేటాడి పట్టుకుని ఒంటరి చేసి, బస్సుల్లో దవాఖానలకు తీసుకుపోవడానికి ఒక కేంద్ర ప్రభుత్వం, అనేకానేక రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలో వారిని దవాఖానకు తరలిస్తుంటే సిబ్బందిమీద తుమ్ముతూ రోడ్ల మీద ఉమ్ముతున్న ఈ ప్రబోధకులను ఏం చేయాలి?

 తెలంగాణలో కరోనాను పారద్రోలుతున్నాం అని భావిస్తున్న దశలో నిజాముద్దీన్‌ తబ్లిఘీ మతప్రచారకుల ప్రవేశం కథ మళ్లీ మొదటికి తెచ్చింది. అంతగా దెబ్బతినలేదనుకున్న ఏపీలో, తమిళనాడులో వైరస్‌ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. విదేశీ టూరిస్టు వీసాల మీద వచ్చి, మత ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటే, వీసా గడువు దాటి ఇక్కడే ఉంటే, లాకౌట్‌ తరువాత కూడా వీరు ఢిల్లీ మధ్యలో నివసిస్తూ ఉంటే, అక్కడనుంచి వేలాది మంది విదేశీయులు, స్వదేశీయులు గ్రామాలకు తరలిపోతూ ఉంటే, తెలియని నిఘా వ్యవస్థ, విదేశీ మంత్రిత్వశాఖ, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు?

తబ్లీఘీ ఏం చేస్తుందో నిఘా వాళ్లకు తెలి యదా? కౌలాలంపూర్‌లోని శ్రీ పెటాలింగ్‌ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 దాకా జరిపిన తబ్లీఘీ సమావేశాలలో పదహారు వేలమంది పాల్గొనడం,ఆగ్నేయాసియాలో కరోనా వైరస్‌ను భయానకంగా వ్యాప్తి చేసిన మహాసభగా దీనికి అపకీర్తి రావడం నిఘావారికి తెలియదా? వారి కదలికల మీద కన్నేసి ఉంచాల్సిన బాధ్యత లేదా? 500 మందికి వీరు వైరస్‌ అంటించారని వార్తలు వచ్చాయి. ఇండోనేసియా వణికిపోయింది. ‘ఈ ప్రపంచంలో జీవనసౌఖ్యం కొంతే, మరణించిన తరువాత ఆనందంతో పోలికే లేదు’ అని మలేసియాలో తబ్లీఘీ ప్రచార నినాదం. పాక్‌లో కూడా వీరు లాక్‌డౌన్‌ లను, కర్ఫ్యూలను ధిక్కరించి మసీదుల్లో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఒకరికి అంటిస్తే నేరం. కాని వందలాది మందికి కరోనా కావాలని తగిలిస్తే జనహనన ఘోరం కాదా? ఈ కరోనా వైరస్‌ మన రూల్‌ ఆఫ్‌ లాను కబళిస్తే ప్రజాస్వామ్యాన్ని ఐసీయూలో పెట్టి డాక్టర్లు బతికిస్తారా బ్రదర్‌?


మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు