రైతుల్ని ఆదుకొనేదెవరు?

24 Apr, 2020 00:48 IST|Sakshi

విశ్లేషణ

కరోనా, అకాలవర్షాలనుంచి రైతుల్ని ఆదుకొంటారా? తెలంగాణలో  కొత్త ప్రాజెక్టుల ద్వారా 70 శాతం అధికంగా ధాన్యం పండిందంటున్నారు. యాసంగిలో 31.58 లక్షల ఎకరాలలో వ్యవసాయం సాగించేవారు. ఈసారి నీటిలభ్యత పెరిగి 53 లక్షల 68 ఎకరాల సాగు సాధ్యమయింది. 16.89 లక్షల ఎకరాలలో వరి సాగుచేసే వారు ఈసారి 39.24 లక్షల ఎకరాలలో వరి పండిం చారు. రైతులకు రెండు గండాలు. ఒకటి కరోనా వైరస్‌ వల్ల  రాకపోకల దిగ్బంధనం. రెండు అకాల వర్షాలు. ఈ గండాలను గడిచే శక్తి రైతులకు లేదు. ప్రభుత్వాలు ఆదుకొంటాయా?

తెలంగాణ రాష్ట్ర పోరాటానికి తొట్టతొలి కారణం నదుల వాటాల్లో అన్యాయం, నీటి వనరులను భారీ ఎత్తున మళ్లించడం. విడిపోయిన తరువాత తెలంగాణలో ఆరేళ్లలో అదనంగా పంటపొలాలు తడిపేందుకు నదీ జలాలను కదిలించారు. జలాశయాలు నిర్మించారు, ఎత్తిపోశారు. నీరు పారిన పొలాలు ధాన్యాన్ని పండించాయి. దేశంలో గొప్ప ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగేదశ. యాసంగిలో ప్రతిధాన్యం గింజను ప్రభుత్వం గ్రామాలకొచ్చి కొంటుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సహజంగానే ఇది రైతులకు సంతోషకరమైన వార్త. గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా విశేషమే.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం ఉన్నా, తాలు నాలుగు శాతం దాకా ఉన్నా కూడా రైతులనుంచి కొనవచ్చు.  కానీ తీరా ధాన్యం అమ్మకానికి వచ్చినపుడు అధికారులు ఈ రెండు నిబంధనలను పాటించడం లేదని, తాలు అసలే లేకుండా నూటికి నూరుపాళ్లు పరిశుభ్రంగా ఉండాలని పట్టుబడుతున్నారని, తేమ కేవలం 13 లేదా 14 శాతం, అంతకన్న తక్కువ ఉన్నా కూడా రైతుల పంటను కొనేవారు కనబడటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. అధికారులు కొనే దాకా ధాన్యం అక్కడే కొనుగోలు కేంద్రాలలో పెట్టుకుని రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులు అక్కడే ధాన్యం ఎండ బెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లని ధాన్యం కుప్పలు కల్లాల దగ్గరే పడి ఉన్నాయి. ఈ మధ్యలో అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పంటల కోతలు దాదాపు 70 శాతం పూర్తయిన గ్రామాల్లో ధాన్యాన్ని ఏంచేయాలో రైతులకు పాలుపోవడం లేదు.

ధాన్యం ఆరబెట్టినకొద్దీ తూకం నానాటికీ తగ్గిపోతున్నదని రైతులు బాధపడుతున్నారు. తాలు పట్టడానికి రైతులు వేలకు వేల రూపాయలు ఖర్చుచేయవలసి వస్తున్నది. 40 బస్తాలు శుభ్రం చేయడానికి దాదాపు రూ. 8 వేల దాకా ఖర్చవుతుంది. ప్రభుత్వం రైతులకు అనుకూలంగా వాగ్దానాలు, అనేక నియమాలు చేసినా అధికారుల ఆలస్యం, అవినీతి, బాధ్యతారాహిత్యం వల్ల ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. రైతులు వేధింపులకు గురవుతున్నారు. తేమ, తాలు ఉందని ధాన్యాన్ని మిల్లుల్లోకి కూడా రానీయడం లేదు. ప్రతిబస్తాకు కిలోనుంచి రెండు కిలోల దాకా తరుగు అంటూ దోచుకుంటున్నారని, ధాన్యం కొనకుండా ఏదోఒక నెపంతో ఆలస్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.  ఒక్కొక్క రోజు ఆలస్యం అవుతుంటే రైతులకు నష్టం పెరిగిపోతూ ఉంటుంది. మిల్లర్లకు తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో మిల్లర్లకు లాభాలు రావడం, రైతులు పూర్తిగా దెబ్బతినడం ఖాయం. 

బియ్యం మిల్లులు తప్పు చేస్తే కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడమని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌ హెచ్చరించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పలు ఐకేపీ కేంద్రాలను పరిశీలించామని, ఇందులో తాలు పేరిట క్వింటాల్‌కు 3 నుంచి 6 కిలోల తరుగు తీయడం సరి కాదన్నారు. ఈ విధంగా రైతులను బ్లాక్‌మెయిల్‌ చేయొద్దని కూడా ఆయన రైస్‌మిల్ల ర్లకు చెప్పారు. బియ్యం మిల్లుల యజమానులతో విస్తారంగా సమావేశం జరిపారు. తమిళనాడు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కావాలని తెలంగాణను అడిగిందని, మంచి నాణ్యత కలిగిన ధాన్యాన్ని సేకరించి వారికి ఎగుమతి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఈ విధమైన డిమాండ్‌ ఏర్పడుతున్న దృష్ట్యా తమకు ధాన్యం విక్రయిస్తున్న రైతులకు వీలైనంత ఎక్కువ ధర ఇవ్వడానికి మిల్లర్లు ప్రయత్నించాలని కూడా మంత్రి హితవు చెప్పారు. అయితే చేసిన హామీలు, ప్రకటించిన నిబంధనలు అమలు చేయకపోతే రైతులు సంక్షోభంలో పడిపోతారని ప్రభువులు తెలుసుకోవాలి.


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు