‘మద్యే మద్యే’ న్యాయం సమర్పయామి

8 May, 2020 00:12 IST|Sakshi

విశ్లేషణ

కోవిడ్‌ 19 అంటురోగపు రోజుల్లో నిత్యావసరాలంటే తిండి, వైద్యం. మరి మందు (ఔషధం కాదండోయ్‌) సంగతేమిటి? ఉద్యోగం లేకపోయినా ఉపద్రవకాలంలో మద్యం అత్యవసర ద్రవమని అర్థం కాలేదా? జనం తాగకుండా 45 రోజులు బతికి ఉండగలరని నిరూపించుకుంటే ప్రభుత్వాలు 45 రోజు లకన్నా అమ్మకుండా ఉండలేమని చాటుకున్నాయి. పాఠాలు లేని పంతుళ్లకు బ్రాందీ షాపుల కాపలా డ్యూటీ. మగా, ఆడా, చిన్నా పెద్ద తేడా లేకుండా జనం బారులు తీరి ఎంతో ఓపికగా భౌతిక దూరాలలో నిలబడి ఉవ్విళ్లూరుతూ కొనడం మహోన్నత భారతీయ జనతా నాగరికత. దేశాన్ని ఆర్థికమాంద్యం నుంచి కాపాడే దేశభక్తులు ఒక్కరోజులోనే ఒక్కో చోట  వందల కోట్ల రూపాయల మద్యం తాగేశారు. 
లాక్‌ డవున్‌ కాలంలో వేరే రోగాలు రాకపోవడానికి కారణాలు అమ్మచేతి వంట తినడం, మందు కొట్టకుండా ఉండడం అని కొందరు అమాయకులు సూత్రీకరించారు.

కానీ వెంటనే మద్యప్రవాహం మొదలైంది. సరిగ్గా సాగని చదువులను వానాకాలపు చదువులు అనేవారు. ఇప్పుడు కరోనా కాలపు చదువులనాలి. విమానాలు, రైళ్లు, బస్సులు, హోటళ్లు, సినిమాలు తెరిచే రోజులు వచ్చిన తరువాత చివరకు, విద్యాలయాలు తెరవడం గురించి ఆలోచిస్తారు. ముందు తెరిచింది మద్యం సీసామూతలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే డబ్బు దక్కదు. వలస కూలీలను సొంతూర్లకు పంపడానికి రైళ్లు నడపాలనే చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని కేవలం 45 రోజుల ఆలస్యంగా తీసుకున్నారు.  వందలాది మైళ్లు వేలాది జతల కాళ్లు నడిచిన తరువాత, కొన్ని ప్రాణాలు పోయిన తరువాత, అది అత్యవసర సేవ అని,  ప్రజల చావుబతుకులకు సంబంధించిన సమస్య అనీ తెలుసుకున్నారు. 

మద్యం కన్నా అత్యవసర వస్తువు న్యాయం అని గుర్తురాకపోవడం ఒక విషాదం. మద్యం బార్‌ తెరిచినా న్యాయం బార్‌ మూసే ఉంది. తాలూకా, మండలం, జిల్లా స్థాయిల్లో న్యాయ వితరణ, న్యాయ విచారణ, వివాద పరిష్కారాలు లాక్‌ డవునైనాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టు చాలా సీరియస్‌ అంశాలను పరిశీలించడానికి వీడియో సమావేశాల ద్వారా న్యాయాన్యాయ విచారణ సాగిస్తున్నాయి. హైకోర్టు మనసు గెలుచుకున్నవారికీ, సుప్రీంకోర్టు కంటికి కనపడిన వారికి న్యాయం అందుబాటులో ఉంటుంది. మిగతావారికి న్యాయం అరుదైన సరుకు, అందని ద్రాక్ష. మద్యం ముందు న్యాయం చివరకు. ఎంత సామాజిక న్యాయం ఇది? లాయర్లు ఈ విషయం ఆలోచించరు. వేసవికి వచ్చే సెలవులు కరోనా పుణ్యాన రావడంతో సంతోషించేవారు కొందరైతే, రెక్కాడితే తప్ప డొక్కాడదన్న రీతిలో బెయిల్‌ కోసం ఎవడైనా వస్తే తప్ప రెయిల్‌ నడవని లాయర్‌కే చాలా కష్టం. 

40 కోట్ల మంది కూలీలు వలసవచ్చిన చోట పనిలేక, మరో రాష్ట్రంలో ఉన్న సొంతూరికి పోలేక, బతక లేక చావలేక ఉంటే వారికి న్యాయం అడిగే అవకాశం లేదు. సుప్రీంకోర్టులో పిల్‌ వేస్తే, ధర్మాత్ములు ఆశావిశ్వాస సిద్ధాంతమనే ఒక వినూత్న విధానాన్ని కనిపెట్టారు. ఇదేమిటని అడిగాడో మిత్రుడు. హోప్‌ అండ్‌ ట్రస్ట్‌ ఫిలాసఫీ అని ఇంగ్లిష్‌ మీడియంలో చెప్పాను. వెంటనే ఆ మిత్రుడు అర్థం అయిందన్నాడు. దాని అర్థం ఏమంటే ప్రభుత్వం వారు చేస్తానన్న పని చేస్తారని ఆశించడం, చేశారని విశ్వసించడం అని సుప్రీంకోర్టు న్యాయవాది వివరించారు. వలస కార్మికులకు ప్రభుత్వం ఆహారం ఇస్తున్నామని చెప్పితే నమ్మాలి. ఉన్నచోట ఉండక నడవడమెందుకు అని న్యాయం చెప్పారు. పిల్‌ కొట్టేశారు. పోలీసులు తన్నినా, లాకప్‌లో వేసినా, రాజద్రోహం కేసులతో విమర్శల గొంతు నులిమినా, తప్పుడు కేసులుపెట్టినా అడుక్కోవడానికి మన ఊళ్లో న్యాయస్థానం గేట్లు తెరవరు. 

అక్కడ సర్వోన్నత న్యాయస్థానాధీశులు కరోనా సంక్షోభ కాలంలో పాలక, శాసన, న్యాయవ్యవస్థలు సమన్వయంతో దేశసేవ చేయాలని సెలవిచ్చారు. పాలకుల ఘోర నిర్ణయాలు తీసుకున్నా న్యాయవ్యవస్థ సమన్వయంతో సర్దుకు పోవాలని రాజ్యాంగంలో అంతర్లీనంగా వారికి కనిపించింది. కరోనా అత్యయిక పరిస్థితుల కాలంలో ప్రాథమిక హక్కుల గురించి తపన పడడం ముఖ్యం కాదనీ సర్వోన్నతులు ప్రవచించారు. పాపం జస్టిస్‌ హెచ్‌ ఆర్‌ ఖన్నాకు ఈ టెక్నిక్‌ తెలియక, ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులు ముఖ్యమని, వాటిని సస్పెండ్‌ చేయడానికి వీల్లేదనీ తీర్పుచెప్పి తను ప్రధాన న్యాయమూర్తి కాకుండా పోయారు. మొదట్లో ఈ న్యాయాన్ని అన్యాయంగా భావించినా ఇప్పుడు ఖన్నాదే న్యాయమని చాలామంది ఆమోదించారు. హోప్‌ అండ్‌ ట్రస్ట్‌ సిద్ధాంతం ఏమిటని బుర్ర బద్దలు కొట్టుకోకుండా వీధిలో ప్రభుత్వమే బ్లాక్‌ రేట్‌లో దగ్గరుండి మద్యాన్ని అమ్మిస్తుంటే మందుకొట్టి మత్తుగా పడిపో, లేకపోతే ఇప్పటికిదే న్యాయం అనే ప్రవచనాలు మాత్రమే మననం చేసుకో.

మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు