జనం సమస్యలకు ప్రచారమేదీ?

15 Mar, 2019 01:58 IST|Sakshi

విశ్లేషణ

లోక్‌సభ ఎన్నికల శంఖారావం మోగిందో లేదో, డబ్బు సంచుల రవాణా మొదలైంది. ఎన్నికలు ఏడు చరణాల్లో జరుగుతాయి. ఒక మిత్రుడు ఎన్నికల తత్వబోధ: ‘‘పోలింగ్‌కు ముందు నేతలు జనం చరణాల చెంత చేరతారు. తరువాత అయిదేళ్ల దాకా జనం నేతల చరణాల పొంతన పడి ఉండాల్సి ఉంటుంది’’. జూన్‌ 3 లోగా 17వ లోక్‌సభను నిర్మించే రాజ్యాంగ బాధ్యత. విస్తృతమైన ఏర్పాట్ల విశేష ఘట్టం ఇది. డిల్లీలో రంజాన్, (మే 12) నాడే పోలింగ్‌ నిర్ధారించారు. సప్తచరణాల్లో ఎన్నికలు మాపై కుట్ర అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి విమర్శిస్తే ఏప్రిల్‌ 11నాడే రాష్ట్రమంతా పోలింగ్‌ నిర్ణయించి నాకు అతి తక్కువ సమయం ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

అయిదుస్థానాల్లో లోక్‌సభ ఎన్నికలకు అడ్డురాని భద్రతా సమస్యలు జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రశాసనసభ ఎన్నికలను నిరోధిస్తాయా అని నేషనల్‌ కాన్ఫ రెన్స్‌ íపీడీపీ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఈ రాష్ట్రంలో విడివిడిగా జరిగితేనే మంచిది, విడివిడిగా వ్యూహాలు రచించుకోవచ్చు తీరిగ్గా ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ తెలంగాణే, నవంబర్‌లోనే ఎన్నికలు జరిపించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ అధికారం చేబట్టి ఇప్పుడు దాదాపు అన్ని లోకసభ స్థానాలను గెలుచుకోవడానికి తీరిగ్గా వ్యూహాలు పన్నుతున్నది. ఇటు దిగువ దక్షిణ దేశాన కేరళలో శబరిమలై ఉత్తరాన యూపీలో అయోధ్య రాముడు ఇప్పుడు ఎన్నికల కథానాయకులు. మధ్యలో మసూద్‌ అజర్‌ ప్రతినాయకుడు.

ఇవి రాజకీయ, న్యాయ, మత, సంక్లిష్టసమస్యలు. సోమవారం నుంచి తెరిచే అయ్యప్ప ఆలయం 45 రోజుల పాటు భక్త జనసందోహమవుతుంది. ఎన్నికల అవసరాలను బట్టి ఇక్కడ అగ్గి రాజేసుకోవడానికి పార్టీలు పెట్రోలు తెచ్చుకుంటున్నాయి. కేంద్రంలో మోదీ సర్కార్‌ ఫిబ్రవరి నెలలోనే ‘ఎంతో ఆకర్షణీయమైన’ బడ్జెట్‌ తెచ్చినా సుబ్రమణ్యంస్వామి చెప్పిందేమంటే ‘మేము ఈ ఆర్థిక కార్యక్రమాలతో ఎన్నికలు గెలవం. ఈ పథకాలతో మాకు పనిలేదు. రామమందిరం దిశగా అడుగులు వేస్తాం. మోదీ మరోసారి ప్రధాని అవుతారు’అని. ‘ఈ జనానికి తిండి లేకపోయినా ఫరవాలేదు. మతం మత్తు జల్లితే చాలు మాకే ఓట్లేస్తారన్న’దే ఆయన ధీమా. అయ్యప్ప కేరళలో, రామయ్య అయోధ్యలో ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారని కొందరంటే, మరికొందరు ఆలోచనాపరులు ‘‘భారత్‌ పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దులో విజృంభించే ఉద్రిక్తతలు మాకు చాలు ఓట్లు వచ్చిరాలడానికి’’ అంటున్నారు. 

రాహుల్‌ గాంధీ అజర్‌ను జీ అని సంబోధించాడని పెద్ద అల్లరి చేస్తున్నారు. బీజేపీ ప్రతినిధి కూడా జీ అని ఆ రాక్షసుడిని సంబోధించిన వీడియో ముందుకు తెచ్చారు. టెర్రరిజంతో అల్లకల్లోలం సృష్టించిన జైషే మహ్మద్‌ సంస్థ ముఖ్యుడు మసూద్‌ అజర్‌కు నిన్న కొండంత అండగా చైనా నిలబడింది. ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లండ్‌లను మన వాదానికి అనుకూలంగా మార్చగలిగామే కాని పొరుగున ఉన్న చైనాను పాకిస్తాన్‌కు అండగా నిలబడకుండా ఆపలేకపోయాం. పాకిస్తాన్‌ మాటలకు లొంగుతుందా? మసూద్‌ అజర్‌ కార్యక్రమాలను నిలిపివేసే చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు గట్టిగా చెప్పగలిగినా చైనా ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నది? ఈసారైనా భారత్‌ వాదాన్ని అర్థం చేసుకుని ఉంటే ఎన్నికల వేళ అది భాజపా ప్రభుత్వానికి అద్భుతమైన విజయావకాశంగా మారిపోయి ఉండేదే కదా అరెరే అని బాధపడే వారూ ఉన్నారు.

పాకిస్తాన్‌ సేనానుల అండతో ప్రధానమంత్రుల సహకారంతో తీవ్రహింసాత్మక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రార్థనాస్థలాల్లో హత్యాప్రబోధాలు చేస్తూ ఇంకా బుద్దిరాని కౌమారవయస్కుల మెదళ్లలో మత విషం చిమ్మి, హింసపిచ్చి రగిలించి ఆత్మాహుతి దళాలుగా మార్చి, పుల్వామా వంటి దాడులు చేసి చచ్చేందుకు సిద్ధపడేట్టు చేస్తున్న మసూద్‌ అజర్‌ వంటి దుర్మార్గులను చైనా రక్షించడం దారుణం. వాడవాడల్లో చైనా వస్తువులను కొని మనవాళ్లు చైనా ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తూ ఉంటే పాకిస్తాన్‌ భూభాగం నుంచి మనదేశంలో చిచ్చుపెట్టే రాక్షసుడికి చైనా చేయూతనివ్వడం అత్యంత ఘోరం. చైనాను మనం దౌత్య, ఆర్థిక లావాదేవీల ద్వారా మనవైపు మళ్లించలేకపోవడం మన అత్యంత దారుణ ఘోర వైఫల్యం. 

కాందహార్‌లో మన విమానం హైజాక్‌ చేస్తే టెర్రరిస్టులకు లొంగిపోయి, మసూద్‌ అజర్‌ను క్షేమంగా అఫ్గానిస్తాన్‌లో దిగబెట్టి వచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని కాంగ్రెస్‌ విమర్శిస్తున్నది. ఇప్పుడివన్నీ ఎన్నికల ముఖ్యాంశాలా? నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, జనంలో ద్వేషజ్వాలలు, అవినీతి వ్యతిరేక చట్టాలను నీరుగార్చడం ఇవన్నీ సమస్యలు కావా?


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌

madabhushi.sridhar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా