మనం పరమ భక్తులం కదా!

31 May, 2019 00:54 IST|Sakshi

విశ్లేషణ 

గాంధీని చంపిన 71 సంవత్సరాల తరువాత గాంధీని, హత్యచేసిన గాడ్సేను చిరస్మరణీయులంటున్నాం. ఓం గాంధీ దేవా యనమః అని ఒక చోట అంటుంటే  నాథూరాం గాడ్సే నమోస్తుతే అని మరో చోట అంటున్నాం.  గాంధీ వల్లనే దేశ విభజన జరిగిందనీ, చాలామంది సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ను కోరుకున్నా గాంధీ కావాలని నెహ్రూను ప్రథాని చేయడం వల్లనే దేశం అన్ని అనర్థాలకు గురైందని, నెహ్రూ వల్ల పాకిస్తాన్, చైనాలు కాశ్మీర్‌ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని నమ్మించే  ప్రచారం విపరీతం.  

రాహుల్‌ గాంధీనుంచి వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్లి, ఆయన తండ్రిని తాతను ముత్తాతను, గాంధీని కూడా నిందించడమే ఎజెండా. ఆ వీడియోలు, ఆడియోలు ఉపన్యాసాలు, సోషల్‌ మీడియాలో గుప్పించారు. ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు కాంగ్రెస్‌ అనుసరించిందని విమర్శలు కూడా పద్ధతి ప్రకారం జనంలో ప్రవేశ పెట్టారు.  

దక్షిణాదిన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు కమల్‌ హాసన్‌ స్వతంత్ర భారతదేశంలో తొలి టెర్రరిస్టు హిందువనీ, అతని పేరు నాథూరాం గాడ్సే అనీ, ఆరకంగా టెర్రరిజం ప్రారంభమైందని మే 12న తమిళనాడులో చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. బీజేపీ తరఫున భోపాల్‌ నుంచి పోటీ చేసిన, హిందూ టెర్రరిజం నిందితురాలు సా«ధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌  దీనికి నాలుగురోజుల తరువాత స్పందించారు. గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడని, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ దేశభక్తుడే అని తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆమె కమలంతో  గెలిచారు. కమల్‌ పార్టీ ఓడిపోయింది.  

చిత్రమేమంటే గాడ్సేను మొదటి టెర్రరిస్టు అని వర్ణించిన కమల్‌ హాసన్‌ తానే రచించి, నటించి, దర్శకత్వం వహించిన  హే రాం అనే సినిమాలో గాంధీని చంపడానికి సాకేత్‌ రాం అయ్యంగార్‌ అనే యువకుడు  ప్రయత్నించినట్టు చిత్రించారు. 2000 లో వచ్చిన ఈ సినిమాలో సాకేత్‌ కూడా గాడ్సే వలెనే ఆలోచిస్తుంటాడు. ఈ కాల్పనిక చారిత్రిక చిత్రాన్ని నిర్మించిన కమల్‌ హాసన్‌ కొంత వరకు గాడ్సే ఆలోచనలను సమర్థించినట్టే కదా. కనీసం గాడ్సే వలె ఇంకా మరికొందరు ఆలోచించారని చెప్పడానికి ప్రయత్నించినట్టే కదా? సినిమా వ్యాపారం కోసం గాడ్సే ఆలోచనలను సినిమా పొడుగునా సమర్థించి చివరకు మనసు మార్చుకున్నట్టు చూపిన కమల్‌ హాసన్‌కు గాడ్సే టెర్రరిస్టు అని చెప్పే నైతిక హక్కు ఉందా? సినిమా డబ్బుకోసం, ఎన్నికల ఓట్లకోసం గాడ్సేను వాడుకుంటారా?  

ఇక హత్యకేసులో నిందితురాలైన ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ దృష్టిలో గాడ్సే దేశభక్తుడు. ఇంకా కేసు ముగియకముందే ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా ఎంపిక చేసి భోపాల్‌ నుంచి గెలిపించుకున్నది. గాంధీని హత్య చేసిన తరువాత కింది కోర్టులో గాడ్సేకు ఉరిశిక్ష పడింది. ఆయన హత్య చేయలేదని బుకాయించలేదు. రుజువులు చాలవని తనను విడుదల చేయా లని లాయర్లకు చెప్పి అబద్దపు వాదనలు చేయించలేదు. ఉరిశిక్షను ధృవీకరించడం కోసం కేసు హైకోర్టుకు వచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అప్పీలు విచారించింది. వారిలో ఒక న్యాయ మూర్తి జిడి ఖోస్లా 1965లో ఒక పుస్తకం రచించారు. అందులో గాడ్సే తన చర్యకు పశ్చాత్తాప పడ్డాడనీ, తనకు బతికే అవకాశం ఉంటే శాంతి కోసం కృషి చేస్తానని దేశ సేవ చేస్తానని అనుకున్నారని న్యాయమూర్తి వివరించారు.  

గాంధీ తన దారి మార్చుకోలేదు. గాడ్సే తన నిర్ణయం మార్చుకోలేదు. 71 ఏళ్ల తరువాత దేన్నయినా మార్చుకునే సామర్థ్యం, సాహసం చేయగల ఇప్పటి ఆధునిక నాయకులతో వారిని పోల్చడానికి వీల్లేదు. కమల్‌ తన ప్రకటనను మార్చారు. నేను గాడ్సేను టెర్రరిస్టు అనలేదని, తీవ్రవాది అన్నానని కమల్‌ మాట మార్చారు. ప్రజ్ఞ తన మాట మార్చారు.  క్షమాపణలు కోరి ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. ప్రథాన మంత్రికి కోపం వచ్చింది. ప్రజ్ఞను తాను క్షమించబోనని చెప్పారు. ఈ మాట చెప్పడానికి ఎన్నడూ లేంది, డిల్లీలో అయిదేళ్లలో తొలిసారి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ప్రథాని. క్షమించడం సంగతి పక్కన బెడితే, ప్రజ్ఞ బీజేపీ ఎంపీగా కొనసాగడం, ఆమెగారు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థించడం జరిగిపోతూనే ఉంటుంది.    

మనకు గాంధీతోపాటు గాడ్సే కూడా దేవుడు. గాంధీకి గాడ్సేకు కూడా గుడులు కడతారు. సోనియా గాంధీ, ఖుష్బూ, అమితాబ్, సచిన్‌లకు కూడా గుడులు కడతారు. జనం, ఓటర్లు భక్తులు, ఒకే గాటన పోతూ ఉంటారు. వీళ్లకు ఎడమచేతితో వందమందిని పిట్టల్ని చంపినట్టు చంపే హీరోలు కావాలి. చిటికెలో మాయచేసి సమస్యలు పరిష్కరించే దైవిక శక్తులున్న నాయకులు ఉంటారని వస్తారని, వచ్చా రని వారిచేతుల్లో మంత్రదండాలు ఉంటాయని, వీర బ్రహ్మంగారు వీరిగురించే చెప్పారని, నోస్ట్రాడామస్‌ చెప్పిందీ ఇదే అని అంటారు. భక్తితో భజనలు చేస్తారు. మనం పరమభక్తులం మరి.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

 

>
మరిన్ని వార్తలు