ఆర్టీఐ కోరలు పీకిన కేంద్రం

1 Nov, 2019 01:16 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశాధికారాన్ని ప్రకటించింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న సమా చార కమిషన్లు ఇక తమ చెప్పు చేతల్లో ఉంటాయని, ప్రభువుల అడుగులకు మడుగులొత్తే విధేయులే సమాచార కమిషనర్లుగా నియమితులవుతారని, అధికారేతరులు ఎంత గొప్ప సేవకులైనా సరే  సమాచారాన్ని ఇప్పించే కమిషనర్లుగా నియమితులు కాబోరని పరోక్షంగా స్పష్టపరిచింది.  కొద్ది నెలల కిందట సవరణ పేరుతో సమాచార కమిషన్ల స్వయం ప్రతిపత్తి మీద గొడ్డలి వేటు వేసిన విషయం తెలిసిందే.  
ఆర్టీఐని తుదముట్టించడానికి చేసిన సవరణ చట్టం అమలు కోసం అక్టోబర్‌ 24వ తేదీని నిర్ణయించి, రాజపత్రంలో ప్రచురించారు. అదే రోజు ఆర్టీఐ నియమాలు అమలులోకి వస్తాయనీ ప్రకటించారు. అక్టోబర్‌ 12న ఆర్టీఐ అవతరణ దినోత్సవంగా దేశమంతా 14 ఏళ్లనుంచి జరుపుకుంటున్నాం. ఇటీవల 14వ వార్షికోత్సవానికి అమిత్‌ షా వచ్చి తామే తెచ్చిన ఆర్టీఐ సవరణ మరణ శాసనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి వెనుకాడారు. దాన్ని బట్టి అది ఎంత చెప్పుకోకూడని సవరణో అర్థం చేసుకోవచ్చు.  

కేంద్ర ముఖ్య కమిషనర్‌కు కేబినెట్‌ సెక్రటరీకి జీతం 2 లక్షల 50 వేలు ఇస్తారు. అదే స్థాయి హోదా సౌకర్యాలు కల్పిస్తారు. కాని ఇంతకు ముందు ఎన్నికల కమిషనర్‌తో సమాన స్థాయి అంటే సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన స్థాయి ఉండేది. దాన్ని తగ్గించారన్న మాట. అంటే కేబినెట్‌ సెక్రెటరీకి మించిన స్థాయి కమిషనర్లకు ఉండకూడదనే కొందరి ఈర్ష్య అసూయలకు ఆర్టీఐ కమిషన్‌ బలైపోయింది. ఇది వరకు కేంద్ర కమిషనర్లు అందరూ అంటే చీఫ్‌తో సహా సుప్రీంకోర్టు జడ్జి స్థాయి కలిగి ఉండేవారు. ఇప్పుడు చీఫ్‌ గారికి 2 లక్షల 50 వేల జీతమైతే, కమిషనర్లకు పాతిక వేలు తక్కువ అంటే 2 లక్షల 25 వేల రూపాయలు నిర్ణయించారు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. చీఫ్‌ను బాస్‌గా భావించకుండా అందరిలో ప్రథముడిగా గౌర వించి స్వతంత్రంగా వ్యవహరించే కమిషనర్లు ఇక ఈ దేశంలో ఉండరు. వారి బదులు, చీఫ్‌ గారి కింది స్థాయి అధికారులుగా అస్వతంత్ర కమిషనర్లు నియమితులవుతూ ఉంటారు. ఇదివరకు ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వ విభాగాల వారు సమాచారం ఇచ్చితీరాలని ఆదేశాలు జారీ చేస్తే, చీఫ్‌ నుంచి ఏ ఇబ్బందీ ఉండేది కాదు. చీఫ్‌కు ఇబ్బందులు వస్తే వచ్చి ఉండవచ్చు. ఇబ్బందులు వచ్చి ఉంటే ఛీఫ్‌లే చెప్పాలి. చెప్పగలిగే స్వతంత్రం, ధైర్యం కూడా ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. తక్కువ జీతం, తక్కువ స్థాయితో కమిషనర్లు చీఫ్‌కు అణగి మణగి వ్యవహరించాలన్న సందేశం చట్ట పరంగా జారీ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ సమాచార కమిషన్‌కు మరణ శాసనాన్ని జారీ చేసింది.   

కమిషనర్లకు అయిదేళ్ల పదవీ కాలాన్ని అసలు చట్టం నిర్ధారించింది. ఎవరైనా 5 ఏళ్లు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకూ పదవిలో ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు మూడేళ్లే. దీంతో నష్టం ఏమిటి అని వాదించే వారున్నారు. అయిదేళ్ల పాటు స్వతంత్రంగా ఉండగలిగే వ్యక్తిత్వం ఉన్న కమిషనర్‌ సమాచారాన్ని ఇప్పించడానికి ఎవరికీ భయపడడు. పదవీ కాలం తగ్గిందంటే ఆ వెసులుబాటు అంతమేరకు తగ్గుతుంది.  

ఇంకో మూడు నియమాలు కేంద్రం చేతిలో అధికారాలను కేంద్రీకరిస్తున్నాయి. ఏ నియమాన్నయినా సరే సడలించి నీరుకార్చే అధికారాన్ని కేంద్రం రూల్‌ 22 ద్వారా ఇచ్చుకున్నది. ఇంకా ఏ అలవెన్సులు ఇవ్వాలో,  ఏ విలాస సౌకర్యాలు కల్పించాలో నిర్ధారించే అధికారాన్ని 21 వ నియమం ద్వారా కేంద్రం తనకు మిగుల్చుకున్నది. ఇవి చాలవన్నట్టు ఈ నియమాల అర్థాలు ఇంకా ఎవరికైనా  తెలియకపోతే, కేంద్రం వివరిస్తుంది. ఆ విధంగా కేంద్రం ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉన్నా సరైనదనే భావించి తీరాలని రూల్‌ 23 చెప్పేసింది.  

శాసనం ద్వారా ఆర్బీఐకి స్థిరమైన హోదాను, పదవీకాలాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని కలి్పంచింది పార్లమెంటు. ఆవిధంగా స్థాయి ఇచ్చే అధికారాన్ని ఈ సవరణ ద్వారా పార్లమెంటు నుంచి లాగేసుకున్నది కేంద్ర ప్రభుత్వం. దాంతో పాటు ఇప్పుడు చేసిన నియమాలు కూడా ఇష్టం వచి్చనట్టు మారుస్తానని, సడలిస్తానని, వాటి అర్థాలు తానే చెబుతానని కేంద్రం చాలా స్పష్టంగా వివరించింది. ఏలిన వారికి అనుకూలంగా తీర్పులివ్వాలని ఇదొక ఆదేశం. ఇవ్వకపోతే నియమాలు మారుస్తాం అని చెప్పే హెచ్చరిక ఈ రూల్స్‌.  

కొందరు మిత్రులు ఆర్టీఐలో రెండు సెక్షన్లే కదా సార్‌ మార్చింది. ఇంత మాత్రానికి ఇల్లెక్కి అరుస్తారెందుకండీ అనే వారూ ఉన్నారు. రెండే సెక్షన్లు మార్చారనడం కరెక్ట్‌. కాని దాంతో కమిషన్‌ అనే పులికి కోరలు పీకారని, తిండి పెట్టక మల మల మాడ్చి పులిని జింకగా మార్చారని వారు అర్థం చేసుకోవలసి ఉంటుంది. కేంద్ర కమిషన్‌ పరిస్థితి ఇది అని ఊరుకోవడానికి వీల్లేకుండా రాష్ట్రాల కమిషన్లకు కూడా ఇదే గతి పట్టించారు. వారి స్థాయి మరీ తక్కువ. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లకు కేంద్రం జీతం నిర్ణయించడం ఏమిటి? ఇటువంటి మార్పును ఒప్పుకున్న దివాలాకోరు రాష్ట్రాలనేమనాలి? సిగ్గు చేటు.

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
ఝ్చఛ్చీbజిuటజిజీ.టటజీఛీజ్చిటఃజఝ్చజీ .ఛిౌఝ
విశ్లేషణ
మాడభూషి శ్రీధర్‌ 

మరిన్ని వార్తలు