గతం వలలో చిక్కుకోవద్దు

20 Sep, 2019 01:35 IST|Sakshi

విశ్లేషణ

21వ శతాబ్దం భవిష్యద్దార్శనికులకు చెందినదే. రేపటి గురించి తపన ఉన్నవారిదే.  ఈ మాట సతీశ్‌ చంద్ర సేథ్‌ చెప్పారు. 1932–2009 మధ్య జీవించిన ఒక భవిష్యవాది. సివిల్‌ సర్వీస్‌ అధికారి, సైన్స్‌ విద్యాపాలనాధికా రిగా పనిచేసిన మేధావి సతీశ్‌ సేథ్‌. బిగ్‌ డేటా లేదా ఇన్ఫర్మేషన్‌ హైవే అని ఈనాడు మనం చూస్తున్న కొత్త సాంకేతిక ప్రక్రియ గురించి కొన్ని దశాబ్దాలకిందటే ఊహించిన భవిష్యద్దర్శకుడు. ఆయన కృత్రిమ మేధాశక్తి (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) గురించి కూడా ముందే ఊహించిన భావి స్వాప్ని కుడు.  

విరామం లేని భవిష్యమూర్తి అనే పేరున సతీశ్‌ చంద్ర జీవనయానాన్ని, ఆయన రచనలు, ప్రతిపాదించిన తత్త్వం, వ్యాఖ్యానం, భారతదేశం గురించే కాకుండా ప్రపంచ మానవాళి రేపటి ప్రపంచాన్ని గురించి నిరంతరం చింతించి వెలువరించిన సాహిత్యాన్ని సమీక్షిస్తూ ఒక పుస్తకాన్ని రచించారు. దాని పేరు ‘‘ది రెస్ట్‌ లెస్‌ ఫ్యూచరిస్ట్, సతీశ్‌ సేథ్‌ క్వెస్ట్‌ ఫర్‌ ట్రాన్స్‌ ఫార్మింగ్‌ ఇండియా’’. ఈ పుస్తకాన్ని భారతదేశ మాజీ అధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ ఈనెల 14న ఆవిష్కరించారు. ఆ తరువాత సేథ్‌ స్మారక ప్రసంగం చేశారు. ఈ పుస్తకం చదివితే గతం గురించి ఆలోచించడం కాస్సేపయినా ఆపి, రేపటి పై దృష్టి పెడతారు.  

సతీశ్‌ ఒక వ్యక్తి కాదు, ప్రేరణ నిచ్చే ఒక వ్యవస్థ. చమురు లేని శక్తి వనరుల గురించి, పునర్నవీకరణ వీలైన ఇంధనం గురించి ఆయన కలలు కన్నారు.  నేటి సమాచార విప్లవం చూస్తుంటే సతీశ్‌ ఈ విషయాన్ని ముందే ఎలా ఊహించారా అనిపిస్తున్నదని ఆర్‌.ఎ.మశేల్కర్‌ ఈ పుస్తకానికి ముందుమాటలో రాసాడు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా విస్తృతమైన సమాచారాన్ని ప్రభుత్వమే వెల్లడించవలసిన బాధ్యత వచ్చింది. రాజస్తాన్‌లో జన సూచనా పోర్టల్‌ను ఈ నెలలో ప్రారంభించారు. ఈ అంతర్జాల వేదికమీద వందల మెగా బైట్ల సమాచారం అందిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎంతమందికి  ఆహార పదార్థాలు ఎంత ఎప్పుడు ఇచ్చారు. మిగిలిందెంత. స్టాకు ఎప్పుడొస్తుంది. 

నిన్నటిదాకా ఎన్ని నిలువలు ఉన్నాయి. రేషన్‌ డీలర్‌ ఎవరు అనే వివరాలు, రేషన్‌ కార్డు నెంబర్‌తో సహా అన్ని ఒక క్లిక్‌తో ఎక్కడి నుంచైనా ఎవరైనా చూసుకోవచ్చు. ఇది ఇదివరకెవరూ ఊహించింది కాదు, ఒక్క సతీశ్‌ చంద్ర సేథ్‌ తప్ప. సెక్షన్‌ 4(1)(బి) నిర్దేశించిన విధంగా 20 సేవలపై  13 విభాగాలు ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని జనానికి చేర్చే శక్తి ఈ అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానానికి ఉందని రాజస్తాన్‌ ప్రత్యక్ష ప్రమాణాలతో రుజువు చేస్తున్నది. ఆర్టీఐ ఐటి సాధించిన అద్భుతం ఇది. చట్టం హక్కు ఇస్తే సాంకేతిక పరిజ్ఞానం ఆ హక్కుకు నిజరూపం ఇచ్చింది. ఎవరెవరికి ఎంత రేషన్‌ లభించిందో ఎంత మిగిలిందో తెలిస్తే స్టాక్‌ను చీకటి బజారుకు తరలించే అవినీతికి ఆస్కారమే ఉండదు.  

పెద్ద ఎత్తున భారీ సమాచారాన్ని శరవేగంగా ఇవ్వడంతో సరిపోదు. విలువలతో కూడిన విజ్ఞానానికి అది దారి తీయాలి అని సతీశ్‌ చంద్ర సేథ్‌ అనేవారు. మార్పుల వల్ల వచ్చే సమస్యలు భవిష్యత్తులో టెక్నాలజీకి సంబంధించినవి కావు, నీతి నియమాలకు సంబంధించినవి, నైతిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలే తీవ్రమైనవి అని సతీశ్‌ చంద్ర సేథ్‌ అనేవారు. సతీశ్‌ గారు మరో మాట అనే వారు. మనం గతం పరచిన వలలో చిక్కుకోకూడదు. రేపటి గురించి ఆలోచించడం నేర్చు కోవాలి అని. భారతీయ ప్రజానీకానికి ఒక పరి మితి ఉంది, అది కర్మసిద్ధాంతం. మనం ఈ రోజున్న పరిస్థితికి కారణం గతంలో లేదా గత జన్మలో చేసిన పనులు లేదా పాపం అని స్థిరంగా నమ్మడం వల్ల రేపటి గురించి ఆలోచించి మంచి భవిష్యత్తును నిర్మించుకోలేకపోతున్నాం అని సతీశ్‌ చంద్ర సేథ్‌ ఆవేదన చెందారు. 

ప్రతి నిన్న, మళ్లీ మళ్లీ రేపును కూడా కబళించదు. కాని మనం రేపులో నిన్నను తలుచుకుంటూ భవిష్యత్తును కోల్పోతున్నామా అని ప్రతి వ్యక్తీ ఆలోచించుకోవాలని సతీశ్‌ ప్రబోధించారు. భవిష్యత్తు ఈ రోజే అని ఆయన నినాదం. భారతదేశ రెండో స్పీకర్‌ మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ అల్లుడైన సతీశ్‌ స్మృతి సభను మాడభూషి పద్మాసేథ్‌ నిర్వహించారు. కొడుకు ఆదిత్య ప్రణబ్‌ ముఖర్జీని సన్మానించారు. సతీశ్‌ పుస్తకంపై జరిగిన చర్చలో ఎన్‌. భాస్కర్‌ రావు, రచయిత రాకేశ్‌ కపూర్, ప్రొఫెసర్‌ వీణా రామచంద్రన్, ఈ వ్యాస రచయిత పాల్గొన్నారు.


మాడభూషి శ్రీధర్‌ 

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు