ఫిరాయింపులపై ఓటరు తీర్పు? 

15 Nov, 2019 01:17 IST|Sakshi

విశ్లేషణ

కర్ణాటక స్పీకర్‌ ఆదేశాల్ని సుప్రీంకోర్టు కేవలం పాక్షికంగా మాత్రమే సమర్థించింది. కర్ణాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేయడం కోసం అనుసరించిన ఫిరాయింపు రాజకీయాలు రాజ్యాంగ పాలనకు ప్రతికూలమైనవి. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆదేశాలు చెల్లవని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సుప్రీంకోర్టు నవంబర్‌ 13న ఈ వివాదంపైన తీర్పు చెప్పింది. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అనర్హత నిర్ణయాన్ని సమర్థించింది. కానీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత మొత్తం శాసనసభ కాలం కొనసాగదు. ఇప్పుడు వారికోసం వాయిదా వేసిన ఉప ఎన్నికలు డిసెంబర్‌ 5న జరుగుతున్నాయి. ఆ ఎన్నికలలో పోటీచేసే అవకాశం వారికి కలిగింది.

న్యాయమూర్తులు ఎన్‌. వి. రమణ, సంజీవ్‌ ఖన్నా, కృష్ణమురారితో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పు ఇస్తూ చట్టాలు చేసే శాసనసభ్యులను ఆ విధంగా అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు లేదని స్పష్టం చేశారు. 2023 దాకా కర్ణాటక శాసనసభ పదవీ కాలం కొనసాగుతుందని వారు మళ్ళీ పోటీ చేసి గెలిస్తే శాసనసభలో ప్రవేశించే అవకాశాన్ని తొలగించడానికి వీల్లేదని న్యాయమూర్తులు వివరించారు. స్పీకర్‌ ఎమ్మెల్యేల అర్హతను నిర్ణయించే దశలో కాలాన్ని నిర్ణయించే అధికారం లేదని న్యాయమూర్తులు నిర్ధారించారు. పదో షెడ్యూలులో ఫిరాయింపులు అనర్హతల శాసనం అన్వయంలో స్పీకర్‌ అధికారాలు సక్రమంగా వినియోగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  ఈ తీర్పు యడ్యూరప్పకు పెద్ద ఊరట కలిగిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. 14 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నుంచి, ముగ్గురు ఎమ్మెల్యేలను జనతాదళ్‌ ఎస్‌ నుంచి బీజేపీ వారు లాక్కుపోయిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తరువాత వీరికే టికెట్లు ఇవ్వడానికి బీజేపీకి వీలు కలిగింది.

జేడీఎస్, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎంతగానో సహకరించిన 17 మంది మళ్లీ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగానే మంత్రిపదవులు ఇవ్వడం బీజేపీ కర్తవ్యం. అందుకు అన్ని పరిస్థితులూ అనుకూలించాల్సిందే. ఎన్నికల్లో గెలవడం ఒక్కటే వారి చేతిలో లేకపోవచ్చు. మరో పార్టీ టికెట్‌ పైన ఎన్నికై మంత్రి పదవులు అనుభవించే నాయకులు కూడా ఈ 17 మందిలో ఉన్నారు. మంత్రి పదవిలో ఉన్న వారు కూడా బీజేపీకి ఫిరాయిస్తే ఏమనుకోవాలి. ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తే ఏదో పైపదవికోసం వెళ్లిపోయారనుకోవచ్చు. మంత్రిగా అప్పటికే పదవుల్లో వెలి గిపోతున్నవారు దాన్ని వదులుకుని, ఎమ్మెల్యే పదవినీ వదులుకుని, ఎన్నికల్లో పోటీచేసేంత కష్టాలు ఎందుకు తెచ్చుకున్నట్టు? అని కర్ణాటక రాజకీయాలు పరిశీలించిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే పదవీ ప్రలోభం కన్నా మరేవో బలవత్తరమైన కారణాలు వారి అనైతిక ఫిరాయింపుల వెనక ఉండవచ్చునని భావించవలసి వస్తుంది. కాంగ్రెస్, జేడీఎస్‌ నాయకులు కూడా తమకు ద్రోహంచేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుకోవడం మామూలే. సహజంగా కాంగ్రెస్‌కి చెందిన నాయకుడు కావడం వల్ల, స్పీకర్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా నిర్ణయాలు చేస్తారనే నింద ఉండనే ఉంటుంది.  సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న దశలో న్యాయంగా వ్యవహరించకుండా చట్టానికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా భూతద్దంలో చూపడానికి మీడియా  సిద్ధంగానే ఉంటుంది. స్పీకర్‌ జాగ్రత్తగా తీర్పు లివ్వాలి. నిజానికి కర్ణాటక స్పీకర్‌ను తప్పుబట్టడానికి అక్కడ ఏ లోపమూ కనిపించలేదు. అనర్హత అంటే రాజ్యాంగంలోనే సభలో కొనసాగడానికి అర్హత అనే వివరం ఇచ్చే నిబంధనలు ఉన్నాయి. వెంటనే ఉప ఎన్నికలలో పోటీ చేయడానికే అయితే అనర్హతకు అర్థం ఏముంది.? సభ అంటే భవనం కాదు, అయిదేళ్ల పదవీ కాలం. అనర్హత అంటే అయిదేళ్లపాటు ఎమ్మెల్యే కావద్దనే అర్థం. స్పీకర్‌ తీర్పు, దానిమీద సుప్రీంకోర్టు తీర్పు ముగిసింది. ఇక ప్రజల తీర్పు రావలసి ఉంది. ఫిరాయింపు రాజకీయాలపైన కర్ణాటక ఓటర్లు నిర్ణయించాల్సి ఉంది.


మాడభూషి శ్రీధర్‌ 

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com   
 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా