ప్రభువుల రహస్యాలపై ప్రజావిజయం

12 Apr, 2019 02:00 IST|Sakshi

విశ్లేషణ

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోల్‌మాల్‌ ఆరోపణలపైన సమరం ఇది. ఈ ఒప్పందం గందరగోళంపై దర్యాప్తుకు ఆదేశించాలని బీజేపీ  సీనియర్‌ నాయ కులు, మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టును కోరారు. అందుకు కారణాలేమీ లేవని సుప్రీంకోర్టు డిసెంబర్‌ 2018లో కొట్టేసింది. రఫేల్‌ కొనుగోలు కోసం బేరసారాలు దారి తప్పాయని తెలిపే మూడు కీలకమైన పత్రాలు పత్రికల్లో బయటపడ్డాయి. వెల్లడయిన రక్షణ కొనుగోలు దస్తావేజులు చూపుతూ పిటిషనర్లు సుప్రీం  కోర్టు తీర్పును మరోసారి పరిశీలించాలని రివ్యూ పిటి షన్‌ వేశారు. సుప్రీంకోర్టు ముందుకు కొన్ని కీలకమైన పత్రాలను ప్రభుత్వం తీసుకురాలేదని వాదించారు. అందుకు ఆధారాలుగా ఈ పత్రాలను చూపారు.  

కీలకమైన ఒప్పందంలో అత్యంత కీలకమైన రహస్య పత్రాలను దొంగిలించడం నేరమని, ఆ పత్రాలను ప్రచురించిన పాత్రికేయులను, ఆ పత్రాల ఆధారంగా పిటిషన్‌ వేసిన లాయర్లను క్రిమినల్‌ కోర్టులో ప్రాసిక్యూట్‌ చేస్తామని అటార్నీ జనరల్‌ కె. వేణుగోపాల్‌ కోర్టులో చెప్పడం సంచలనం కలిగించింది. తరువాత పాత్రికేయులను, న్యాయవాదులను ప్రాసిక్యూట్‌ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అటార్నీ జనరల్‌ ప్రకటించారు. మరికొన్నాళ్లకు తమ రహస్య దస్తావేజులన్నీ భద్రంగా ఉన్నాయని వాటినెవరూ దొంగిలించలేదని మరో వివరణ ఇచ్చారాయన. కానీ అత్యంత రహస్య పత్రాలను కాపీ చేయడం, లీక్‌ చేయడం నేరాలే అని అందుకు కారణమైన వారిపై దర్యాప్తు జరిపిస్తామని హెచ్చరించారు.  

మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వ పక్షాన వాదిస్తూ అధికార రహస్యాల చట్టం, సాక్ష్య చట్టం ప్రకారం అక్రమ రహస్య పత్రాలు సాక్ష్యాలే కాబోవని, ఈ రహస్య పత్రాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని, అక్రమంగా సంపాదించిన ఈ పత్రా లను పరిశీలించే అధికారం కోర్టులకు కూడా లేదని అటార్నీ జనరల్‌ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్, సంజయ్‌ కిషన్‌ కౌల్, కెం.ఎం. జోసెఫ్‌ వాటిని కొట్టివేస్తూ, పత్రికా స్వాతంత్య్రాన్ని, సమాచార హక్కును నిలబెడుతూ ఏప్రిల్‌ 10న ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం.

పత్రికలు ఇటువంటి పత్రాలు ప్రచురించకుండా నిషేధించాలని ప్రభుత్వం కోరింది. కానీ, ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం పత్రికాస్వాతంత్య్రాన్ని అరికట్టే విధానమని, అది సంవిధానానికి విరుద్ధమని కొట్టివేసింది. సాక్ష్య చట్టం సెక్షన్‌ 123 ప్రకారం ప్రభుత్వం ప్రచురించని పత్రాలను ఆ శాఖ అధినేత అనుమతి లేకుండా సాక్ష్యంగా కోర్టులు పరిశీలించడానికి వీల్లే దని అటార్నీ జనరల్‌ మరో లా పాయింట్‌ లేవదీసారు. ఈ పత్రాలు ఇదివరకే హిందూ తదితర పత్రికల్లో ప్రచురితమైన తరువాత వీటిని అప్రచురిత పత్రాలని ఏవిధంగా అంటారు? మొత్తం ప్రజానీకానికి తెలిసిన పత్రాలను రహస్యాలని ఎలా అంటా రని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రివిలేజ్‌ కింద ఈ పత్రాలను దాచుకోవాలనుకోవడం కూడా చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. 

సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత ఇంకా ఈ రహస్యాలకు ఏ విలువ ఉందనేది ప్రశ్న. ప్రభుత్వ పాలనకు కొన్ని రహస్యాలు అవసరమని, వాటిని వెల్లడిస్తే ప్రభుత్వాలను ప్రజలు అనవసరంగా విమర్శిస్తూ ఉంటారని అందువల్ల పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయని ప్రభుత్వ వాదన. ప్రభుత్వపాలనకు కొన్ని రహస్యాలను కాపాడడం అవసరమైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునే ప్రజల హక్కు కూడా ముఖ్యమే. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యాన్ని సాధించడానికే సమాచార హక్కు చట్టం ఉపయోగించాలని ఆ చట్టం పీఠిక వివరిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సెక‌్షన్‌ 8(1)ఎ ప్రకారం సమాచారం వెల్లడిస్తే భారత భద్రతకు, సమగ్రతకు, విదేశీ స్నేహసంబంధాలకు హాని కలుగుతుందని భావిస్తే సమాచారం ఇవ్వాల్సిన పని లేదు.  

కానీ సెక‌్షన్‌ 8(2) ప్రకారం ప్రజాప్రయోజనాన్ని పరిశీ లించి, సమాచారం వెల్లడిస్తే వచ్చే ప్రయోజనం, దాచడంవల్ల కలిగే హానికన్నా అధికమైతే వెల్లడించాల్సి ఉంటుంది. సెక‌్షన్‌ 22 ప్రకారం రహస్యాల చట్టంగానీ, మరే ఇతర చట్టంగానీ సమాచార హక్కు చట్ట నియమాలకు విరుద్ధమయితే ఆ మేరకు సమాచార హక్కు చట్టమే చెల్లుతుందని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఐబి, రా వంటి కొన్ని సంస్థలను సమాచార హక్కు చట్టం కిందనుంచి పూర్తిగా తప్పించిన సెక‌్షన్‌ 24లో కూడా రెండు మినహాయింపు లున్నాయి. అవినీతికి సంబంధించిన సమాచారాన్ని, మానవహక్కుల ఉల్లంఘన సమాచారాన్ని ఆ సంస్థలు కూడా ఇవ్వాల్సి ఉంటుందని కనుక వెల్లడిపై ఆంక్షలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రభువుల రహస్యాల మీద ప్రజా విజయం.

వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌

madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు