ఆ పదహారు కూలీల పదహారణాల ఆత్మనిర్భరత

15 May, 2020 04:34 IST|Sakshi

విశ్లేషణ

హరిశ్చంద్రుడికి కరోనా రోగం సోకింది. వరుణుడిని ప్రార్థిస్తాడు. నీ కొడుకును బలి ఇస్తానంటే నీ రోగం కుదురుస్తానంటాడు వరుణుడు. సరేనంటాడు రాజు. రాజభవనం నుంచి కరోనా పోయింది. రాజు పుత్రవ్యామోహంలో పడి బలిమాట వాయిదా వేస్తుంటాడు. బలి ఇవ్వక తప్పని దశ వస్తుంది. రాజుగారి సలహాదారుడు మీరు పుత్రుడిని దత్తత తీసుకుని లేదా కొనుక్కుని కూడా బలి ఇవ్వవచ్చునని ఉపాయం చెబుతాడు. రాజు దండోరా వేస్తాడు. బలిచేసే వాడికి ఎవరైనా కొడుకిని దత్తత ఇస్తారా, అమ్ముతారా? కానీ, అజిగర్తుడనే పేదవాడు నాకు నూరు ఆవులిస్తే కొడుకునిస్తానంటాడు.

అయితే పెద్దవాడంటే నాకు ప్రేమ అని తండ్రి, చిన్నవాడిని నేనివ్వను అని తల్లి అంటారు. మధ్య వాడు సునఃశ్యేపుడు. తల్లిదండ్రులకు అక్కరలేకపోయిన తరువాత బతకడమెందుకని బలిపశువైపోతాడు. అయితే యజ్ఞంచేసే ముని, బలిని నిర్వహించే ఉద్యోగి మనిషిని నరకలేమంటారు. మళ్లీ అజిగర్తుడు ముందుకొచ్చి ఇంకో వంద ఆవులిస్తే నేనే బలి ఇస్తానంటాడు. నాకెవరూ లేరు, నేనెవరిమీదా ఆధారపడలేను, ప్రేమించే తల్లిదండ్రులే వద్దనుకున్నారు, కాపాడే రాజే బలి కోరుతున్నాడు అని కుములుతున్న సమయంలో అప్పుడే అద్భుతమైన ఉపదేశం ఆకాశవాణిలో విన్నాడు సునఃశ్యేపుడు.

ఎవ్వరిమీద ఆధారపడనప్పుడే కావలసింది ఆత్మనిర్భరత అన్న మాట మనసులో నాటుకుపోయింది. వలసకూలీల వలె పట్టాల మీద బలిపశువు కాకూడదనుకున్నాడు. కనీస బాధ్యత లేని తల్లిదండ్రులనుంచి, నియంతృత్వపు రాజు నుంచి, మాయమాటలు నమ్మి చప్పట్లు కొట్టే ప్రజల అజ్ఞానపు చీకట్ల నుంచి కాపాడే చైతన్య ఉషోదయాన్ని ప్రార్థిస్తూ గురువు విశ్వామిత్రుడు చెప్పినట్టు తానే వరుణుడిని ప్రార్థించాడు. వెంటనే వెలుగు విస్తరించింది. వరుణుడు రాజుతో నీవంటి వారి బలి నాకక్కరలేదన్నాడు.

సునఃశ్యేపుడు తండ్రిని ఒక చూపు చూసి విశ్వామిత్రుడి వెంట ఎంతో ఆత్మనిర్భరతతో వెళ్లిపోతాడు. దిక్కులేకుండా సునఃశ్యేపుడి వంటి దుర్దశలో ఉన్నపుడు ఆత్మనిర్భరత అవసరం అన్నది ఈనాటి పాఠం. కరోనాను పట్టించుకోకుండా ముందుగా ట్రంప్‌ జిందాబాద్‌ అన్నాం, తరువాత పారాసిటమాల్‌ చాలదా అనుకున్నాం. తరువాత భయపడ్డాం, తాళాలు వేశాం. తాళాలు తప్రాలు వాయిస్తూ భజ  నలు చేశాం. భౌతిక దూరం అంటూ కవితలు రాశాం.  

పై కథ చెప్పిన ఒక పురాణ నిపుణ రచయిత కవితాత్మకంగా ఇంకో మాట చెప్పాడు. 500 కరోనా కేసులున్నపుడు లాక్‌డౌన్,  5 వేల కేసులున్నపుడు చప్పట్లు, 10 వేల కేసుల సంబరానికి కరెంటు దీపాలు మలిపి, ఆ చీకటిలో కొవ్వొత్తులు వెలిగించడం, 40 వేల కేసుల సందర్భంలో ఆకాశం నుంచి పూలు కురిపించడం. 50 వేల కేసులుం డగా మద్యం దుకాణాలు బార్లా తెరిపించడం. 60 వేల కేసులకు చేరుకుంటుంటే రైళ్లు నడవడం చేసుకుంటున్నాం. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మనిర్భరత ప్రబోధించారు. కనిపించని కరోనా, కనిపించినా కదలలేని సామాన్యులు గందరగోళంలో పడిపోయారు. 

కేవలం నాలుగ్గంటల నోటీసిచ్చి అంతా 21 రోజుల దాకా బంద్‌ అంటే నలభై కోట్ల వలస కూలీలు తప్ప అంతా సంతోషించారు. రకరకాల వలస కూలీలకు ఇప్పుడు పని లేదు. పనిలేక తిండి లేదు. పోదామంటే రైలు లేదు, కోట్లాదిమంది నడక మొదలుపెట్టారు. ఎంత దూరం అని పట్టించుకోలేదు. ఒక తల్లి దారిలో ప్రసవించింది, వెంటనే నడకకు సిద్ధమైంది. ఒక తండ్రి పాపను భుజాన మోసుకుని బయలుదేరాడు.

ఓ భర్త, చిన్న చక్రాల చట్రం మీద భార్యను, పసిపాపను ఓ మూటను పెట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టాడు. చక్రాల సూట్‌కేస్‌ మీద సతిని కూచోబెట్టి మరో పతిదేవుడు తోసుకుపోతున్నాడు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఊరికి 30 కి.మీ. దూరంలో అలసిపోయి చనిపోయాడొకాయన. రైలు ఎక్కనీయకపోతే పట్టాల వెంట నడక ప్రారంభించి నడిచీ నడిచీ అలసిపోయి తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో అక్కడికక్కడే పట్టాల మీద పడి నిద్రపోయారు. ప్యాసింజర్‌ రైళ్లు లేకపోయినా రైల్వే అధికారులు ఎంతో దేశభక్తితో గూడ్సు రైళ్లు నడుపుతారని వారు ఊహించలేకపోయారు.

ఇంజిన్‌ డ్రైవర్‌ కర్తవ్య నిర్వహణ పరాయణుడై రైలు నడిపే డ్యూటీ చేశాడు. తీరా లక్షలాది కూలీలు ఊళ్లు చేరిన తరువాత, అన్ని పనుల లాక్‌ తెరిచారు. రెక్కాడించడానికి మళ్లీ వెళ్లాలా? ఎవ్వరిమీదా ఆధార పడకుండా సొంతంగా బతుకో చావో అనుకునే ఆ పదహారుమంది పదహార ణాల ఆత్మనిర్భరత అలవర్చుకోవాలా? నెత్తురుతో తడిసిన ఆ పట్టాలమీద ప్రగతి రైళ్లు పరుగెత్తి మన దేశాన్ని విశ్వాగ్రరాజ్యంగా మార్చేస్తాయా? స్క్రూలనుంచి ఇంజిన్‌ దాకా అంతా జపాన్‌ వారే చేసి మనకు అమ్మే బుల్లెట్‌ రైళ్లు ఈ పట్టాలమీదే నడుస్తాయా? నడిస్తే లోకల్‌ అనకండి, అది గ్లోకల్‌ అని తెలుసుకోండి.
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌

madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు