రాజ్యాంగమా... ఉన్నావా?

2 Aug, 2019 02:01 IST|Sakshi

యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండునెలల తరువాత  2017 జూలై 11న ఒక అమ్మాయి అదృశ్యమైంది. జూలై 17న ఉన్నావ్‌ బాలికకు ఉద్యోగం ఆశ చూపి గ్యాంగ్‌ రేప్‌ చేశారని తేలింది. ఎమ్మెల్యే కుల్‌ దీప్‌ సింగ్‌ సెంగార్, సోదరుడు అతుల్‌ సింగ్, మరికొందరు ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణ. జూలై 20, 2017న ఆ అమ్మాయి కనిపించింది. ఉన్నావ్‌ తీసుకువచ్చారు. ఎంతో అల్లరి తరువాత ఫిబ్రవరి 24, 2018న ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేశారు.

బాధితురాలి కుటుంబ సభ్యు లను బెదిరించే కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆమె తండ్రి సురేంద్రను ఇంటివాళ్లు చూస్తుండగా చెట్టుకు కట్టివేసి కర్రలు, బెల్ట్, రాడ్లతో అతుల్‌ సింగ్, అనుచరులు దారుణంగా కొట్టారు. గాయపడిన సురేంద్రను ఏ దవాఖానా చేర్చుకోలేదు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ సురేంద్రను ఏప్రిల్‌ 4, 2018న అరెస్టు చేశారు.  నన్నురేప్‌ చేశారని ఎంత మొత్తుకున్నా ఒక్కడూ వినడం లేదు. పైగా నన్ను బెదిరిస్తున్నారు, వాళ్లను అరెస్టు చేయండి, లేకపోతే మీ కళ్లముందే చస్తానని బాధితురాలు ఏప్రిల్‌ 8, 2018న ముఖ్యమంత్రి ఇంటిముందు ఆత్మహత్యాప్రయత్నం చేసింది. అప్పుడు దేశం మొత్తానికి ఈ ఘోరం గురించి తెలిసింది.  

ఏప్రిల్‌ 10న అతుల్‌ సింగ్‌ సహా నలుగురిని సురేంద్రను కొట్టిన కేసులో అరెస్టు చేశారు.  మూడు రోజుల తరువాత ఏప్రిల్‌ 12న సురేంద్ర గాయాలతో చనిపోయాడు. యూపీ ప్రభుత్వం కేసును సీబీఐకి ఇచ్చింది. సెంగార్‌ ను ఎందుకు ఇంకా అరెస్టుచేయలే దని అలహాబాద్‌ హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌ ఐ ఆర్‌ లో ఆయన పేరుంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. మేం ఎందుకు అరెస్టు చేయాలి అని పోలీసు ఉన్నతాధికారి ఓ.పి. సింగ్‌ అమాయకంగా ప్రశ్నించారు. ఏప్రిల్‌ 13న సెంగార్‌ను ప్రశ్నించడానికి తీసుకువెళ్లి మరు నాడు అరెస్టు చేశారు. స్వయంగా బాలికను సెంగార్‌ దగ్గరకు తీసుకువెళ్లి, లోపల రేప్‌ చేస్తుంటే తలుపు దగ్గర కాపలా కాసిన ఆరోపణపై శశిసింగ్‌ అనే మహిళామణిని సీబీఐ ఏప్రిల్‌ 15న అరెస్టు చేసింది.  

ఈలోగా ఎమ్మెల్యేగారి భక్త బృందం మా ఎమ్మెల్యే నిర్దోషి అని ఏప్రిల్‌ 23న ఒక ర్యాలీ తీసారు. 2018 జూలై 7న సురేంద్ర హత్యకేసులో అయిదుగురిపైన సీబీఐ నేరాలు మోపింది. 11న సెంగార్, శశిసింగ్‌ల పైన సీబీఐ అత్యాచార ఆరోపణలను నమోదు చేసింది. తండ్రిపైన దొంగ కేసుల కుట్ర చేసినందుకు  ముగ్గురు పోలీసు అధికారుల మీద మరో ఇద్దరి మీద 13న కేసులు పెట్టారు.  జూలై 31, 2018న రేపిస్టులకు మరణశిక్ష విధించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఆగస్టు 18న సురేంద్ర హత్యకేసులో కీలకమైన సాక్షి యూనుస్‌ అనుమానాస్పదంగా మరణించాడు. డిసెంబర్‌ 17న రేప్‌ బాధితురాలి బంధువులపైన దొంగ పత్రాలు ఇచ్చారనే ఆరోపణపై శశిసింగ్‌ భర్త కేసు పెట్టారు. జూన్‌ 6, 2019న ఉన్నావ్‌ ఎంపీ సాక్షి మహారాజ్‌ సెంగార్‌ ను సీతాపూర్‌ జైల్లో కలిసి తనను జైలు నుంచే గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 20 ఏళ్ల కిందట హత్యా ప్రయత్నం చేసాడన్న పాత కేసు తవ్వి జూలై 4న బాధితురాలి బాబాయికి పదేళ్ల జైలు శిక్షవేసారు.

జూలై 28న బాధితురాలి బంధువులు లాయర్‌ మహేంద్ర సింగ్‌ కలిసి ప్రయాణిస్తున్న వాహనానికి యాదృచ్ఛికంగా ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు చనిపోయారు. జూలై 29న రాజ్యసభలో సెంగార్‌ నేరచరిత్రపైన గందరగోళం జరిగింది. 30న ఇండియాగేట్‌ దగ్గర నిరసనలు చేశారు. బీజేపీ అతన్ని పార్టీనుంచి బహిష్కరించినట్టు తాజా వార్త. బాధితురాలు, ఆమెలో ధైర్యం బతకాలి. లాయర్ల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను తట్టుకుని తనను బలాత్కరించాడని నమ్మించేట్టు చెప్పగలిగితేనే ఈ ఎమ్మెల్యేగారు అసెంబ్లీకి కాకుండా జైలుకు వెళ్లగలుగుతాడు. నిర్దోషిగా విడుదలైతే, మంత్రులంతా వెళ్లి పూల మాలలతో స్వాగతం చెప్పి వీలైతే మంత్రిని చేసి రాజ్యాంగాన్ని రక్షిస్తామని ఆయనచే ప్రమాణం కూడా చేయిస్తారేమో, ఎవరికి తెలుసు?  

యూపీలో శాంతిభద్రతలు దేశానికే ఆదర్శం అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఎంత యోగి అయితే అంత ఆత్మవిశ్వాసం అన్నమాట. యోగులు కాని మనవంటి వారికి అది అర్థం కాదు. ఆయనకు మించిన ఆత్మవిశ్వాసం కలిగిన యోధుడు సెంగార్‌. ఎందుకంటే ఆయన గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సీబీఐ పోలీసు కస్టడీలోనే ఉన్నా, అత్యంత యాదృచ్ఛికంగా ఇక్కడ ప్రమాదం జరిగిపోయింది.  

రాయ్‌బరేలీ దగ్గర జరిగిన ప్రమాదంలో బాధితురాలు, ఆమె లాయర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కుటుంబ సభ్యులు చనిపోయారు. బాధితురాలు తమపై ఇది హత్యాకుట్ర అని ఫిర్యాదు చేసిన తరువాత జూలై 29న  యూపీ పోలీసులు సెంగార్‌ మరో తొమ్మిది మంది పైన హత్యకేసు నమోదు చేశారు. తెలుగు సినిమా కథ కాదిది. యోగి, మహా రాజ్‌ అని పేర్లుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లో ఎంఎల్యేలు, ఎంపీలు మంత్రులు సాగి స్తున్న దురన్యాయాలు. కీచక రాజకీయ వేదిక ఉన్నావ్‌ రాజ్యాంగాన్ని ఉన్నావా అని అడుగుతున్నది.

వ్యాసకర్త :మాడభూషి శ్రీధర్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు