పాలకులు కాదు.. పాపాలకులు

30 Mar, 2018 00:35 IST|Sakshi

విశ్లేషణ

ఫైళ్లు మాయం కావన్న నమ్మకమైన వ్యవస్థ ఉంది కనుక మాయమైతే ఏం చేయాలో ఆంగ్లేయులు రాసుకోలేదు. మనం మరీ దారుణం కదా. మాయం చేస్తాం. రికార్డుల చట్టం చేస్తాం. కాని మాయం చేస్తే ఏం చేయాలో రాసుకోం.

ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకరించేది రాజ్యాంగం. సంవిధానం అని కూడా అంటారు. సమతా సమానతా ధర్మాన్ని తీర్చిదిద్దిన ఒక గతిశీల, ప్రగతి శీల ఆచరణాత్మక మార్గదర్శిక మన సంవిధానం. పాటించవలసిన బాధ్యతలను వివిధ విభాగాల అధికారుల మీద మోపిన సూచిక భారత రాజ్యాంగం. ప్రజల హక్కులేమిటో చెబుతూ ప్రభుత్వ బాధ్యతలను నిర్ధారించింది. ప్రభుత్వానివి అపారమైన అధికారాలు. లక్షలకోట్ల ప్రజాధనం మీద శతకోటి జనప్రాణాల మీద పెత్తనం అంటే అత్యధిక అధికారాలు. 

దేశాధినేతగా ఉన్న వ్యక్తిచేతిలో ఆ అత్యున్నత అధికారం కేంద్రీకరించకుండా మంత్రి మండలి, అందులో అపారమైన శక్తివంతుడైన ప్రధాని మంత్రివర్గ సభ్యులతో చర్చించి సమిష్టిగా నిర్ణయించాలి. మంత్రి వర్గం పార్లమెంటు ఉభయసభల్లో ప్రజాప్రతినిధులకు జవాబుదారు. తన నిర్ణయాలను వారి ముందుంచి అనుమతి తీసుకోవాలి. ఆ చట్టసభ సభ్యులు దేశ ప్రజలకు తాము ఏంచేసారో చెప్పుకొమ్మని చెప్పింది రాజ్యాంగం. మంత్రివర్గం ప్రభుత్వం, పార్లమెంటు పనుల రాజ్యాంగ బద్ధతను సమీక్షించి అవి రాజ్యాంగ వ్యతిరేకమైతే కోప్పడి కొట్టివేసే అత్యున్నతాధికారాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులకు కట్టబెట్టింది. 

రాజ్యాంగమనే న్యాయపాలనా చక్రంలో ఒక్కో ఆకు ప్రజలకు గ్యారంటీ ఇచ్చిన ఒక్కో హక్కు. ఏ ఒక్క ఆకు (చక్రం పుల్ల) విరిగినా చక్రం బలహీనమవుతుంది. కాలక్రమంలో తుప్పుబట్టి కదలలేకపోతుంది. రాజ్యాంగ ధర్మచక్రాన్ని తుప్పుబట్టకుండా తప్పుబట్టమని చెప్పే కందెనే సమాచార హక్కు. తప్పుల్ని అడిగేసి నిప్పులతో కడిగేసే పౌరులు లేకపోతే, చక్రాలకు, రథాలకు తుప్పుబడుతుంది. హక్కులు దాక్కున్న ఖనిజాలు. వాటిని నిజాలు చేయగల హక్కు ఆర్టీఐ. 

అధికారంతో విర్రవీగే అధికారులకు ఇది తెలుసు, కాని వారి స్వార్థం, అవినీతి సర్పాలు పడగలెత్తి లేచి చెప్పొద్దంటాయి. వారి నిశ్చర్యలను అడిగితే తప్ప చర్యకు ఉపక్రమించరు. హంతకుడు వెంటనే సాక్ష్యాన్ని హత్య చేసినట్టు తప్పు చేసిన వాడు ఆ దస్తావేజు మాయం చేస్తాడు. సాక్ష్యం ఫైల్‌ నోట్స్‌లో ఉంటుంది. ఇవ్వక తప్పదు. కనుక మాయం చేస్తారు. ఫైళ్లను మాయం చేస్తే ఎవరు అడుగుతారు? ఎవరిని ఏమంటారు? అసలు ఏం చేస్తారు? దస్తావేజు అదృశ్యం చేస్తే నేరాలు దాగుతాయి. కుంభకోణాలు బయటపడవు. వారితో కలిసున్న నేరగాళ్ల పరంపర అంతా బతికి పోతుంది. సమాచార హక్కును ఈ రోజు మొత్తంగా కబళించే భూతం తప్పిపోయిన దస్తావేజు. లేదా దారి తప్పిన వారు తప్పించిన దస్తావేజు. 

బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఒకే ఒక గొప్ప క్రమబద్ధమైన లక్షణం ఏమంటే చేసిన ప్రతిపనికీ ఒక దస్త్రం ఉంటుంది. తేదీల వారిగా కాగితాలను భద్రపరిచే విధానం ఉంటుంది. వారు ఫైళ్లు మాయమవుతాయనే ఊహకు కూడా ఆస్కారం ఇవ్వలేదు. ఫైళ్లు చూస్తే చాలు ఏం జరిగిందో చెప్పగలిగేవారు. అవినీతి పనులకు కూడా కాగితాలు ఉండేవి. వారి మీద చర్యలు తీసుకోవడమనేది మళ్లీ వారి వారి నీతిపైన, రాజనీతిపైన ఆధారపడతుందని వేరే చెప్పనవసరం లేదు. కాని దస్తావేజుల సృష్టి, నిర్వహణ, రక్షించడంలో ఆ కచ్చితత్వం, ప్రాచీన అభిలేఖాగారాలకు తరలించే పద్ధతిని భారతీయ పాలకులు రాను రాను నీరుగార్చి చివరకు సమాచార హక్కు వచ్చే నాటికి ఫైలు పోయింది ఏం చేయమంటారు సార్‌ అనేదాకా తీసుకువచ్చారు. 

ఫైళ్లు మాయం చేసే వాడు పాలకుడు కాడు. పాపాలకుడు. దీనికి తాజా ఉదాహరణ, బాలగంగాధర్‌ తిలక్‌ సినిమా తీయడానికి 2.5 కోట్ల రూపాయలు గ్రాంట్‌ చేసిన ఫైలు లేకపోవడం, రకరకాల ఉత్సవాలు చేయడానికి ఒక విభాగాన్ని సృష్టించి వంద కోట్లు ఇచ్చారట. ఆ విభాగంలో పనిచేసేవారు పర్మినెంటు ఉద్యోగులు కాదు. వారు వెళ్లిపోయిన తరువాత చాన్నాళ్లకు మరొక విభాగాన్ని తయారుచేసి ఉద్యోగులను నియమించారు. వారికి ఒక్క కాగితం కూడా దొరకలేదట. సమాచార దరఖాస్తు ద్వారా ఈ డబ్బు మాయం, దస్త్రం మాయం సంగతి బయటపడింది, డబ్బు తీసుకున్న తిలక్‌ సినిమా దొంగ దొరికాడు. కాని డబ్బు ఇచ్చిన దొంగలు, సంతకాలు పెట్టి పంపకాలు చేసుకున్న సర్కారీనౌకర్లు దొరకలేదు. పుచ్చుకున్నవాడు నేరస్తుడే కాని వారికి అప్పళంగా జనం డబ్బు కోట్లు అప్పగించిన వాడు తక్కువ నేరస్తుడా? ఫైళ్లు మాయం కావన్న నమ్మకమైన వ్యవస్థ ఉంది కనుక మాయమైతే ఏం చేయాలో ఆంగ్లేయులు రాసుకోలేదు. కానీ, మనం మాయం చేస్తాం. రికార్డుల చట్టం చేస్తాం. మాయం చేస్తే ఏంచేయాలో రాసుకోం. 

మార్చి ఆరున కేంద్ర సమాచార కమిషన్‌ నూతన భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కమిషనర్లతో పదినిమిషాలు మాట్లాడే  అవకాశం ఇచ్చారు. కాని ఆయన పెద్దమనసుతో అరగంట మాట్లాడారు. మాయమైపోతున్న ఫైళ్లగురించి ఏమయినా చేయాలని, ఒక వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందని, ఆ వ్యవస్థ లేకపోతే ఆర్టీఐ అవస్థల పాలవుతుందని ఈ రచయిత చెప్పారు. ప్రధాని చాలా శ్రద్ధగా విన్నారు. ‘‘ఫైళ్లు మాయమైతే పట్టుకోవడంపై వెంటనే దర్యాప్తు జరిపించాలి. డిపార్ట్‌మెంట్‌లో ఫైలును మాయం చేసిందెవరో అది ఎక్కడుందో పరిశోధించే సమర్థులు పోలీసు ఉన్నతాధికారులే కదా..’’ అంటూ మరో కమిషనర్‌ ఐపీఎస్‌ అధికారి యశోవర్థన్‌ ఆజాద్‌ వైపు చూసారు ప్రధాని. తనతో ఉన్న పీఎంఓ, డీఓపీటీ శాఖల మంత్రి జితేందర్‌ సింగ్‌ వైపు చూసి ‘ఇది చాలా తీవ్రమైన సమస్య. వెంటనే విచారించే వ్యవస్థ ఏర్పాటు కావాలి’ అని సూచించారు.

- మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

 

మరిన్ని వార్తలు