దాపరికంపైనా దాడేనా?

28 Dec, 2018 02:10 IST|Sakshi

విశ్లేషణ

నీ సమాచారం మేం తీసుకుంటాం, నువ్వే సమాచారం అడిగినా ఇవ్వం. ఇదీ ప్రభువుల ఉవాచ. తస్మాత్‌ జాగ్రత్త. పది పోలీసు నిఘా విభాగాలు ప్రజల కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని పర్యవేక్షించి, జోక్యం చేసుకుని డీక్రిప్ట్‌ చేయవచ్చునని కేంద్ర ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్‌ 69(1) కింద, 2009 నియమాల్లో నాలుగో నియమం ప్రకారం, ఇంటెలిజెన్స్‌బ్యూరో, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలి జెన్స్, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, కేబినెట్‌ సెక్రటేరియట్‌ (రా), జమ్మూకశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల డైరెక్టరేట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసులు పౌరుల కంప్యూటర్లలోకి తొంగి చూడవచ్చు. జోక్యం చేసుకోవచ్చు. దోచేయవచ్చు. 

పాలకుల దుర్మార్గ లక్షణాలలో ముఖ్యమైంది పౌరుల సమాచారాన్ని సేకరించడం. తన దగ్గరున్న సమాచారాన్ని ప్రజలకు ఏం చేసినా ఇవ్వకపోవడం. ఒకవైపు ఆర్టీఐని బలహీనం చేస్తూ, మరోవైపు పౌరుల ప్రైవసీని హరించే ప్రకటనలు చేస్తున్నది. మనం  ఉత్తరాలు రాసుకుంటే కవర్లు తెరిచి చూసే అధికారం తనకు తాను ఇచ్చుకున్నది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఆ అధికారాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాలకులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడుకుంటూ వస్తున్నారు. టెలిగ్రాఫ్‌ చట్టంలో కూడా పౌర సమాచార తస్కరణ అధికారాలను రాసుకున్నది బ్రిటిష్‌ సర్కార్‌. ఇప్పుడు కంప్యూటర్లలో జనం సమాచారాన్ని కైవసం చేసే అధికారదాహంతో ఉంది.

ఇప్పుడు ఉత్తరాలు రాసుకునేవారు తక్కువ. టెలిగ్రాముల కథ ఏనాడో ముగిసిపోయింది. ఈమెయిల్స్‌ ఇచ్చుకోవడం, సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసుకోవడం జరుగుతూ ఉన్నది. బ్లాగుల ద్వారా ప్రతిపౌరుడూ ఒక స్వయం జర్నలిస్టుగా మారాడు. సెల్‌ఫోన్‌ పట్టుకున్న ప్రతివాడూ ఇన్‌స్టాగ్రామ్‌లో పౌర పత్రికా ఫొటోగ్రాఫర్‌గా మారాడు. ఇప్పుడు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ పుణ్యమా అని ఆలోచనలను వాక్యాలుగా మలచగల ప్రతి పౌరుడూ తన వాక్‌ స్వాతంత్య్రాన్ని వినియోగించుకుంటున్నాడు. ప్రింట్‌ చేయాల్సిన పని లేకుండానే వేలాది మంది ప్రజలకు చేరువయ్యే టెక్నాలజీ సామాన్య మానవుడిని పక్కవాడి భావజాలాన్ని ప్రభావితం చేసే ప్రభావశాలిగా మార్చేసింది. కంప్యూటర్‌ మాధ్యమాన్ని విరివిగా వాడుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో నిశితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా కోపతాపాలు బయటపెట్టుకుంటూ హద్దులు మీరి తీవ్ర పదజాలాన్ని కూడా వాడుతున్నారు.

టెలిగ్రాములు, ఉత్తరాలు తెరచి తరచి చూసే అధికారం సొంతం చేసుకున్న ప్రభుత్వం రహస్యంగా టెలిఫోన్‌ భాషణలను కూడా వింటున్నది.  వ్యక్తుల ఆలోచనా విధానాలను, వారి వ్యక్తీకరణను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఇంకా అధికారం కావాలంటున్నది. జనం స్వేచ్ఛను ఎంత తాగేసినా ప్రభువుల అధికార దాహం తీరడం లేదు. ఇప్పుడు మన సెల్‌ఫోన్లో సిల్లీ కబుర్లు వింటారట, చూస్తారట. బ్లాగ్లు, వెబ్‌సైట్లు వెతుకుతారట.  పౌరులు వాడుకునే ఆధునిక సంచారఫోన్లు కూడా కంప్యూటర్లే. ఫేస్‌బుక్‌ అందరికీ కనిపించేదే.  వాట్సాప్‌ సమాచారం గ్రూప్‌  సభ్యులకే పరిమితం. ఇప్పుడీ పది సంస్థలు వాటిని కూడా చూడవచ్చు.  
జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో జరిగే జాతి వ్యతిరేక కార్యక్రమాలను పసిగట్టడానికి ఈ అధికారం అవసరమట. కానీ టోకున పౌరులందరి కంప్యూటర్లు చూస్తాననటం. సమాచారం తీస్తాను అనడమంటే అపారమైన అధికారాన్ని సొంతం చేసుకోవడమే. వేల కేసుల్లో రహస్యంగా టెలిఫోన్లు వింటూనే ఉన్నారని కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అధికార వర్గాల్లో వినబడుతూంటాయి. పై స్థాయిలో ఉన్న అధికారులు కూడా ట్యాపింగ్‌ జరుగుతుందని భయపడుతూ ఉంటారు. అందుకే ఎన్‌క్రిప్టెడ్‌ (అంటే తొంగి చూడడానికి వీల్లేని) సేవలందించే వాట్సాప్‌ వంటి వాటి ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరూ వినలేరనే నమ్మకంతో.  

ఈ ఉత్తర్వుతో వాట్సాప్‌ మాత్రమే కాదు మరే ఇతర ఎన్‌క్రిప్టెడ్‌ సమాచార ప్రసారాలనయినా డీక్రిప్ట్‌ చేసి తెలుసుకోవచ్చు. ప్రజల మెదళ్లమీద నియంత్రణకు అధికారం వాడడం, వారి ఆలోచనలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. పౌరుల స్వేచ్ఛకు భంగకరమైన అధికార దుర్వినియోగానికి ఇవి దారి తీస్తాయి. ఇది ఏకపక్ష నియంతృత్వ చర్య.

2017 ఆగస్టు 24న సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో ప్రైవసీని ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ, వెంటనే దానికి సంబంధించిన చట్టం చేయాలని సూచించింది. కానీ ప్రైవసీని నిర్వచించి చట్టం చేయవలసిన ప్రభుత్వానికి పార్లమెంటుకు తీరికే లేదు. ప్రైవసీ పేరుమీద ప్రజలకు ప్రభుత్వాధికారుల సమాచారాన్ని ఇవ్వకుండా తీవ్రంగా ప్రతిఘటించే ప్రభు త్వం, ప్రజల ప్రైవసీ మీద చేయదలచుకున్న మూకుమ్మడి దాడికి ఈ ప్రకటన నాంది.

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌, కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌ professorsridhar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు