రఫేల్‌ ‘దొంగ’ రహస్యం!

8 Mar, 2019 03:36 IST|Sakshi

విశ్లేషణ

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు సంగతులు దర్యాప్తు చేయాలా, వద్దా అనే అంశంలో సుప్రీంకోర్టు కీలకమైన విచారణ మళ్లీ జరపవలసి వచ్చింది. రఫేల్‌ డీల్‌ అమలు, విమానాల కొనుగోలు, ధరల విషయంలో ఏ మార్పు లేకుండా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తొలుత భావించింది. కానీ ఆ నిర్ణయానికి రావడానికి ఆధారమైన పత్రాలలో అనుమానాలు ఉండడం వల్ల సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీవ్రవాదనలు ప్రతి వాదనలువిన్నారు. పునఃసమీక్షా పిటిషన్‌ కొట్టి వేయాలని అటార్నీ జనరల్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రార్థించింది. హిందూ తదితర పత్రికల్లో వచ్చిన కీలక పత్రాలను పిటిషనర్లు ఉటంకిస్తూ ఈ కేసును తిరగతోడవలసిందేనని కోరారు.

భారత అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ చేసిన వాదనల ప్రభావం ఏవిధంగా ఉంటుందో అనే చర్చ సాగుతున్నది. రెండు పత్రికలలో ప్రచురించిన పత్రాలను ఆధారం చేసుకుని ప్రశాంత్‌ భూషణ్, అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా వాదిస్తున్నారనీ, ఆ పత్రాలను ప్రస్తుత లేదా మాజీ పబ్లిక్‌ సర్వెంట్‌లు దొంగిలించి వారికి ఇచ్చి ఉంటారని, ఇవి రఫేల్‌ డీల్‌కు చెందిన రహస్య పత్రాలనీ ఏజీ వేణుగోపాల్‌ అన్నారు. ఈ రహస్యపత్రాలు దొంగిలించిన వారి మీద క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టుకు వివరించారు.

అంటే హిందూ ఎడిటర్‌ ఎన్‌ రాం మీద, ప్రశాంత్‌ భూషణ్‌ మీద అధికార రహస్యాల చట్టం కింద క్రిమినల్‌ కేసులు ఉంటాయా? ముందు ఆ పత్రాలు దొంగిలించిన వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పినా ఆ తరువాత కాసేపటికి జర్నలిస్టుల మీద, లాయర్లమీద చర్యలు ఉండబోవని అటార్నీ జనరల్‌ వివరణ ఇచ్చారు. అంటే రక్షణ శాఖ నుంచి బయటకి ఈ రహస్యాలు పొక్కడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటారేమో? ఏ దేశంలోనూ రక్షణ ఒప్పందాలమీద కోర్టుల్లో కేసులు వేయరని, కోర్టులు విచారించవని కూడా ఆయన అన్నారు. అయితే బోఫోర్స్‌ కేసుల సంగతేమిటని సుప్రీంకోర్టు అడిగింది.

డిఫెన్స్‌ డీల్‌లో సంప్రదింపులు బేరసారాలు సాగిస్తున్న ఏడుగురు సభ్యుల బృందంలో ముగ్గురి అసమ్మతి పత్రం పత్రికలలో దర్శనమిచ్చింది. ఆ అసమ్మతి అవాస్తవమని ప్రభుత్వం వాదించడం లేదు. అది దొంగ పత్రం అనడం లేదు. అది దొంగి లించిన పత్రం కనుక ముట్టుకోవద్దంటున్నది ప్రభుత్వం. అవి దొంగ పత్రాలు కావనీ, అంటే అవి నిజాలనీ, ప్రమాదకరమైన నిజాలనీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అధికార రహస్యాలన్న పదమే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా చేసిన అంశాలు రహస్యాలు ఎందుకవుతాయి? సమాచార హక్కు చట్టం వచ్చినపుడు అధికార రహస్యాల చట్టం పోయిందనుకుని ఎంపీ రాం జెఠ్మలానీ ఆ కఠిన చట్టం తీసివేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ చట్టాన్ని కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభుత్వాలు, బీజేపీతో కూడిన ఎన్డీయే ప్రభుత్వాలు కూడా వాడుకుంటున్నాయి.

సమాచార హక్కు చట్టంతో అధికార రహస్యాల చట్టం విభేదిస్తే ఆ మేరకు సమాచార హక్కు చట్టం అమలవుతుందే కానీ అధికార రహస్య చట్టం పనిచేయదని సమాచార హక్కు చట్టంలో చాలా స్పష్టంగా వివరించారు. జాతీయ భద్రత కోసం రహస్యాలు కాపాడవచ్చునని, జాతీయ భద్రతతో సంబంధం లేని భాగాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించాలని కూడా ఎన్నో సందర్భాలలో నిర్ధారిం చారు. ఒకే పత్రంలో భద్రతా రహస్యాలు, భద్రతకు సంబంధంలేని అంశాలు ఉంటే, రక్షించవలసిన అంశాలు తొలగించి, మిగిలిన సమాచారం ఇవ్వాలని కూడా చట్టంలో స్పష్టంగా ఉంది. రక్షణ రంగం సమాచార హక్కు చట్టం పరిధిలోనే ఉంది.

రఫేల్‌ డీల్‌లో భారతదేశ భద్రతకు సంబంధిం చిన అంశాలేమయినా ఉంటే ప్రశాంత్‌ భూషణ్‌కు, అరుణ్‌ శౌరీకి, యశ్వంత్‌ సిన్హాకే కాదు ఎవరికీ ఇవ్వకూడదు. కానీ బేరసారాల విషయంలో వచ్చిన తేఢాలు, భిన్నాభిప్రాయాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు అవుతాయా? పెంచిన ధరలు, చెల్లించిన డబ్బు కూడా రహస్యాలేనా? విపరీతంగా పెంచిన ధరలు, విమానాల సంఖ్యను 126 నుంచి 36కు తగ్గించడం వెనుక కారణాలు కూడా రహస్యాలేనా?  బేరసారాల బృందంలోనే ముగ్గురి తీవ్ర అసమ్మతి కూడా రహస్యమేనా? నేరం జరిగిందని ఆరోపణ రాగానే సాక్ష్యాలేవీ అంటారు. సాక్ష్యం చూపగానే నీకెలా వచ్చిందంటారు. దొంగతనం చేశావంటారు. మా ప్రైవసీని భంగపరిచి సాక్ష్యాలను సేకరిస్తావా? ముందు నీవు జైలుకు వెళ్లు అంటారు. రహస్యాలు, ప్రైవసీ తెరల చాటున నేరాలు, లంచాలు వర్థిల్లడమేనా రాజ్యాంగ పాలన?

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా