పాత్రికేయులు పనికిరారా?

30 Aug, 2019 01:28 IST|Sakshi

విశ్లేషణ

పత్రికా స్వేచ్ఛ అపరిమితమైందేమీ కాదు. పాత్రికేయవృత్తి ప్రమాణాలను రక్షించడానికి, మర్యాదలు కాపాడడానికి నీతి నియమావళులు ఉండాలి.  పత్రికా స్వేచ్ఛను విచ్చలవిడిగా వాడుకోకూడదన్నట్టే, ప్రభుత్వాధికారులు తమ విపరీతమైన అధికారాలను కూడా విచ్చలవిడిగా వాడుకోకూడదు. మన సంవిధానమే కాదు ప్రజాస్వామ్య సంవిధానమేదైనా పాలకుల విపరీత అధికారాలను కట్టడి చేయడానికే. ప్రభువులకు అధికారాలు మత్తు కలిగిస్తాయి. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన కోట్లాది రూపాయలపైన పెత్తనం మొదటి మత్తు. సైనికదళాలమీద అదుపు మరొక మత్తు. జనం మెదళ్ల మీద పెంపుడు మీడియాను ప్రయోగించే బ్లాక్‌ మెయిల్‌ పాలన ఇంకొక మత్తు. జాతి భద్రత, సమైక్యత అనే అందమైన జంటపదాల చాటున అధికార దాహంతో కరాళ నృత్యం చేస్తుంటారు. స్వతంత్రమైన మాధ్యమాలు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. ఆ స్వతంత్రులు ఈ దుర్మార్గుల దాడులకు బలికాకుండా కాపాడుకోవడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది ప్రెస్‌ కౌన్సిల్‌. ఇది పాత్రికేయుల వృత్తి రక్షణ సంస్థగా పనిచేయాలనే లక్ష్యం నిర్దేశిస్తూ చట్టం చేశారు. 

ప్రభుత్వం ఒక్కోసారి అన్ని మాధ్యమాల మీద విరుచుకుపడినప్పుడు ప్రెస్‌ కౌన్సిల్‌ ప్రజలకోసం, పత్రికల స్వేచ్ఛ కోసం నిలబడవలసి ఉంటుంది. నీతినియమావళి ద్వారా పాత్రికేయులను కొంతవరకు, మందలింపుల ద్వారా అధికారులను కొంతమేరకు పగ్గాలు వేసి ఆపవచ్చు. అదే ప్రెస్‌ కౌన్సిల్‌ బాధ్యత. జమ్మూకశ్మీర్లో వాక్‌ స్వాతంత్య్రం పైన ఆగస్టు నెల మొదటి నుంచి ప్రతిబంధకాలు మొదలైనాయి. ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, మొబైల్‌ ఫోన్లు పనిచేయడం లేదు. పత్రికా కార్యాలయాలకు, కలాలకు, నోళ్లకు, మెద ళ్లకు కూడా తాళాలు వేశారు. ఎంత మహానాయకుడైనా సరే కశ్మీర్‌లో అడుగుపెట్టాలంటే సుప్రీం కోర్టు అనుమతి తీసుకునే పరిస్థితి ఉంది. ఇదేమి అరాచకం అన్నవాడు పాకిస్తాన్‌ స్నేహితుడో లేదా ఇమ్రాన్‌ ఖాన్‌ అల్లుడో అవుతాడు.  

‘కనీసం మా పత్రికా కార్యాలయాలనైనా తెరవనివ్వండి. ఏం జరుగుతున్నదో రిపోర్ట్‌ చేయనీయండి. అక్షరాల వెలుగులపైన ఈ కటిక చీకటి ఆంక్షలు ఇంకెన్నాళ్లో చెప్పండి. కొంచెమన్నా సడలించడానికి వీలుంటుందేమో ఆలోచించి కేంద్ర ప్రభుత్వానికి తగిన రిట్లు జారీ చేయండి’ అని ఒక పత్రికా సంపాదకురాలు సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ముందున్న అనేకానేక అత్యంత ప్రధానమైన వివాదాల మూటలు విప్పి, ఈ వివాదం వినాలో లేదో నిర్ణయించుకునే సర్వస్వతంత్ర వ్యవస్థ మన న్యాయవ్యవస్థ. తీరిక ఉన్నపుడు ఈ వివాదాన్ని కూడా  పరిశీలిస్తుందనే ఆశాభావంతో బతకడం మనమే నేర్చుకోవాలి.   

ఇక్కడ ప్రమాదకరమైన కొత్త విచిత్రమేమంటే, ప్రెస్‌ కౌన్సిల్‌ సంస్థాగతంగా పాత్రికేయు రాలి అభ్యర్థనను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకోవడం. ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం ప్రకారం పత్రికా స్వాతంత్య్రం పైన పరిమితుల సమంజసత్వాన్ని పరిశీలించి, పునఃసమీక్షించి, అన్యాయమైన పరిమితులను సడలించాలని, న్యాయమైన పరిమితులు పాటించాలి. కానీ ఈ ఆంక్షలను రక్షించడానికే ప్రెస్‌ కౌన్సిల్‌ పూనుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది స్వయానా ప్రెస్‌ కౌన్సిల్‌ అధ్యక్షమహాశయుడైన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగారే. కనీసం వారు ప్రెస్‌ కౌన్సిల్‌లో ఈ విషయం చర్చించలేదని, ఎవరినీ సంప్రదించలేదని అంటున్నారు. తనకు తానే ప్రెస్‌ కౌన్సిల్‌ను హోం మంత్రిత్వశాఖ అనుబంధ సంస్థగా మార్చి కలాలకు అండగా కాకుండా తుపాకులకు అండగా పత్రికా కార్యాలయాల తాళాలకు అనుకూలంగా భజన తాళం వేయాలనుకోవడం మన వ్యవస్థల పతనానికి తాజా ఉదాహరణ.  

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన నిపుణుడూ గౌరవనీయమైన పెద్దమనిషే ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, ఇక రాజ్యాంగానికి దిక్కెవరు? కలాలకు మొక్కెవరు? అసలు ప్రెస్‌ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించడానికి జర్నలిస్టులకు అర్హత లేకపోవడమేమిటనే మౌలికమైన ప్రశ్న ఉదయిస్తున్నది. మెడికల్‌ కౌన్సిల్‌కు డాక్టర్లు, బార్‌ కౌన్సిల్‌కు లాయర్లు అధ్యక్షులుగా ఉంటారు. కానీ మరొక వృత్తిపరమైన ప్రమాణ రక్షణ సంస్థకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగారు ఎందుకు అధ్యక్షు డుగా ఉండాలి? పాత్రికేయులలో సమర్థులు, పరి పక్వత కలిగినవారులేరా? ఈ ప్రశ్నలు జర్నలిస్టులు వేయకపోవడం బాధాకరమైన దుష్పరిణామం.


వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌
బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా