పీఎఫ్‌ సమాచారం వ్యక్తిగతమా?

2 Mar, 2018 01:11 IST|Sakshi

సందర్భం
కార్మికుల జీతంనుంచి కోత విధించి దాన్ని వారి పీఎఫ్‌ ఖాతాలో వేయకపోవడం పెద్ద అవినీతి. అలాంటి యాజమాన్యాలపైన చర్యతీసుకోకుండా కార్మికులకు నష్టం కలిగించే అధికారులపైన చట్టపరమైన చర్య తీసుకోవలసి ఉంటుంది.

ప్రయివేటు రంగంలో, కాంట్రాక్టు లేదా ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్లకు ఒకే ఒక సంక్షేమ ప్రయోజనం భవిష్యనిధి. వేతనంలో 12శాతం భవిష్యనిధికి కార్మికుడి వాటాను చెల్లింపు సమయంలోనే తీసి, భవిష్యనిధి ఖాతాకు జమచేయాలి. యాజమాన్యం వారి వాటాను కూడా కలిపి కార్మికుడి ఖాతాలో వేయాలి. భవిష్యత్తులో కార్మికుడి ఆరోగ్య సంక్షేమాలకు ఆ డబ్బునుంచి సాయం లభిస్తుంది. చాలామంది కార్మికులు పీఎఫ్‌ వాటాను చెల్లించినా యాజమాన్యాలు వారి ఖాతాలో వాటిని జమచేయడం లేదు. వారిపైన చర్యతీసుకోవలసిన పీఎఫ్‌ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తారు.

వారికి జవాబుదారీ ఎవరు? సమాచార హక్కు చట్టం వల్ల కార్మికులకి, వారి నాయకులకు, సంఘాలకు మరొక చేయూత దొరికింది. మా వాటా డబ్బు చెల్లించారా? యాజమాన్యం వాటా కలిపారా? చెల్లించని యాజమాన్యంపై ఏ చర్యతీసుకున్నారు? ఏ చర్యా తీసుకోని అధికారుల బాధ్యత ఏమిటి అని ఆర్టీఐ కింద అడుగుతున్నారు. కానీ ఇవ్వడం కుదరదని ప్రజాసమాచార అధికారులు నిరాకరిస్తున్నారు.

వేతనం నుంచి పీఎఫ్‌ వాటాను తీసి అతని ఖాతాలో జమచేశారా లేదా, యాజమాన్యం వాటా చెల్లించారా అని జనార్దన్‌ పాటిల్‌ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరారు. ఈ సమాచారం ఇస్తే ఏం నష్టం? ఇవ్వకపోతే తమకు వచ్చే లాభం ఏమిటి? అని ఎవరూ ఆలోచించడం లేదు అధికారులు. మూడో వ్యక్తి సమాచారం అనీ వ్యక్తిగత సమాచారం అనీ నిరాకరించారు. మొదటి అప్పీలు అధికారి కూడా ఆ నిరాకరణను సమర్థించారు.

ఈ సమాచారం ఇవ్వవలసిందే అని ఈపీఎఫ్‌ఓను కమిషన్‌ ఆదేశించింది. సమాచారం ఇవ్వనందుకు గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో తెలియజేయాలని ప్రజాసమాచార అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఆర్టీఐ దరఖాస్తు వేసినప్పుడు తాను సీపీఐఓను కాదని, ప్రస్తుత సీపీఐఓ ఏసీ పగారే వివరణ ఇచ్చారు. అప్పటి అధికారితోపాటు, సమాచారం ఇవ్వని ఇప్పటి సీపీఐఓ కూడా అందుకు బాధ్యత వహించాలని ఇద్దరికీ కమిషన్‌ జరిమానా నోటీసులు జారీ చేసింది.

సీఐసీ ఆదేశించిన తరువాత సమాచారం ఇచ్చామని, కనుక తనపై జరిమానా విధించరాదని ప్రస్తుత అధికారి పగారే వివరణ ఇచ్చారు. 2016 ఫిబ్రవరి 2న వచ్చిన దరఖాస్తును వెంటనే ఫిబ్రవరి 23న సంబంధిత శాఖకు పంపానని, దానికి సమాధానం ఆ అధికారే ఇవ్వాల్సి ఉందని ఆ నిర్ణయం సరైనదే అని మొదటి అప్పీలు అధికారి కూడా ఒప్పుకున్నారని, తనకు సమాచారం ఇవ్వకూడదనే దురుద్దేశం లేనేలేదని అప్పటి సీపీఐఓ జగదీష్‌ టాంబే వివరణ ఇచ్చారు. కార్మికుడి భవిష్యనిధి అతడి వ్యక్తిగత సమాచారం కనుక ఇవ్వరాదని ఆయన వివరించారు.  

రికార్డులు పరిశీలిస్తే తేలిందేమంటే మొత్తం 15 నెలల తరువాత కార్మికుడికి చెందిన పీఎఫ్‌ సమాచారం ఇచ్చారు. అందాకా సమాచారం ఇవ్వకుండా వేధించారు.  ఆ తరువాత కూడా రెండు అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని దరఖాస్తుదారుడు వివరించారు. ఇవ్వకుండా వదిలేసిన సమాచారాన్ని కూడా ఇవ్వాలని కమిషన్‌ మళ్లీ ఆదేశించింది.

కార్మికుల వేతన సమాచారం వ్యక్తిగత సమాచారం కాదు. ఎందుకంటే అందరు కార్మికులకు ఒక లెక్క ప్రకారం, వేతన బోర్డు నిర్ణయం ప్రకారం ఒక స్కేలు పద్ధతిన వేతనం ఇస్తారు. అది అందరికీ తెలిసిన సమాచారమే. అందులో 12 శాతం భాగాన్ని భవిష్యనిధికి కార్మికుడి వాటాగా కేటాయించాలని. అంతే సొమ్మును  యాజమాన్యం వాటాగా చెల్లించాలని చట్టం ఆదేశించింది.

వేతనం వలెనే వేతనంలో భాగమైన పీఎఫ్‌ సొమ్ము వ్యక్తిగత రహస్యం అయ్యే అవకాశమే లేదు. పీఎఫ్‌ ఖాతాలో కార్మికుడి వాటా, యాజమాన్యం వాటా తప్ప మరేదీ ఉండదు. అందులో కార్మికుడు ఎక్కువ సొమ్ము జమచేయడం, మరో విధంగా ఖర్చుచేయడం జరగదు. అలాంటప్పుడు పీఎఫ్‌ ఖాతాను బ్యాంకు ఖాతాతోనూ, ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలతోనూ పోల్చి సమాచారాన్ని నిరాకరించడం సమంజసం కాదు.

పీఎఫ్‌ వాటా చెల్లింపులు చేసినా అతని ఖాతాలో ఆ డబ్బును తన వాటాతో కలిపి యాజమాన్యం జమ చేయకపోతే, అది చట్టవిరుద్ధమైన పని అవుతుంది. దానివెనుక మోసం ఉంటుంది. కార్మికుడికి ద్రోహం జరుగుతుంది. అతని జీతంనుంచి కోత విధించి అతని ఖాతాలో వేయకపోవడం పెద్ద అవినీతి కూడా అవుతుంది. ఈ పనిచేసిన యాజమాన్యాలపైన చర్యతీసుకునే అధికారం పీఎఫ్‌ అధికారులకు ఉంది.

ఆ అధికారాన్ని వినియోగించకుండా కార్మికులకు నష్టం కలిగించే అధికారులపైన చట్టపరమైన చర్యతీసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ తప్పించుకోవడానికి అధికారులు పీఎఫ్‌ సమాచారాన్ని వ్యక్తిగత సమాచారం అంటూ ఇవ్వకుండా దాస్తున్నారు. ఇందుకు సమాచార అధికారిపై కమిషన్‌ 25 వేల రూపాయల జరిమానా విధించింది. (నాగరాజ్‌ జనార్దన్‌ వర్సెస్‌ ఈపీఎఫ్‌ఓ నంబరు  EPFOG/ A/2016/294053, కేసులో 20.2.2018 నాడు కమిషన్‌ ఇచ్చిన తీర్పు ఆధారంగా)

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా