రహస్యమే అనర్థాలకు మూలం

27 Apr, 2018 00:55 IST|Sakshi

విశ్లేషణ

ఒక్కో రోగి లోపలికి వస్తుంటే ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లింపు అయిపోతున్నట్టు వైద్య పెట్టుబడిదారుడికి కనిపిస్తూ ఉంటుంది. మనుషుల రోగాలే వీరి లాభాలు. ఈ బందిపోటు దోపిడీని ఎవరు ఆపుతారు?

వైద్య వివరాలను రహస్యంగా దాచే విషయంలో డాక్టర్లు వైద్య కంపెనీల విధానాన్ని అమలు చేయడమే అన్ని సమస్యలకు కారణం. లక్షల రూపాయలు తీసుకుని ఆస్పత్రిలో ఏం చికిత్స చేస్తున్నారో ఎప్పటికప్పుడు రాస్తున్నప్పుడు, ఆ కాగితాలను అప్పటికప్పుడే ఎందుకు ఇవ్వరు? ఆ రికార్డు ఎవరిది? రోగం తనది, డబ్బు తనది, వైద్యశాలను ఎంచుకుని కోరి చికిత్సకోసం వచ్చినపుడు, చికిత్స వల్ల కలిగే బాధ, నిర్లక్ష్యం ఒక వేళ ఉంటే, అందుకు పడే బాధ తనది, ఒకవేళ ఆరోగ్యం బాగైతే బాగుపడేది తను. మరి రికార్డులు తనవి కాదా? అవి వైద్యశాల యజమానుల సొమ్మా? 
వైద్యశాల సొంతదారుల పొగరంతా బిల్లుగుమస్తా ప్రదర్శిస్తుంటాడు. డాక్టర్‌ మర్యాదగా మాట్లాడతాడు. 

రోగిని, బంధువులను గౌరవిస్తాడు. బిల్లింగ్‌ గుమస్తా మాత్రం పెత్తనం చలాయిస్తుంటాడు. అతని దగ్గర పడిగాపులు కాయాలి. ఈ వైద్య కంపినీలకు బిల్లింగ్‌ గుమ స్తాలను సంస్కరించాలన్న ధ్యాస ఉండదు. బాకీలన్నీ అడిగినట్టేనా అని విచారిస్తూ డిశ్చార్జి చేయడంలో విపరీతమైన ఆలస్యం చేస్తుంటాడు. డాక్టరు కరుణించినా గుమస్తా వరమివ్వడు. బిల్లింగ్‌ దగ్గర ఉన్నపుడు యాజ మాన్యపు డబ్బు జబ్బు గుమస్తాకు అంటుకుంటుంది.

వైద్యవిద్య ఖరీదు లక్షలు దాటి కోట్లకు పడగెత్తింది. ప్రతిభ లేకపోయినా సీట్లు కొనుక్కునే వారు, ప్రతిభ ఉన్నా భారీ ఫీజు చెల్లించడానికి అప్పులు చేసేవారూ కూడా ఎంత త్వరగా లాభాలు సంపాదించి వడ్డీ చెల్లించాలనే లక్ష్యంతో ఏమైనా చేస్తూనే ఉంటారు. ఒక్కో రోగి లోపలికి వస్తుంటే ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లింపు అయిపోతున్నట్టు వైద్య పెట్టుబడిదారుడికి  కనిపిస్తూ ఉంటుంది. మనుషుల రోగాలే వీరి లాభాలు. ఉచి తంగా వైద్యం చేయనవసరం లేదు.  అడ్డూ అదుపూ, నిజం న్యాయం లేని తప్పుడు చికిత్సలు, అన్యాయపు బిల్లులను ఏం చేయాలి? ఈ బందిపోటు దోపిడీని ఎవరు ఆపుతారు? 

పట్టుదల ఉన్న రోగి గానీ, వారి బంధువులు గానీ కోర్టుకు వెళ్లాలంటే ఈ వైద్య వ్యాపారి అవసరమైన కాగి తాలేవీ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే ఒక్కో కాగితం వారి తప్పుడు చికిత్సలకు తప్పుడు బిల్లులకు సాక్ష్యాలు కనుక. దొంగతనాన్ని బయటపెట్టే సీసీ టీవీ కెమెరాల్లాంటివి ఆ కాగితాలు. కనుకనే రోగికి ఎప్పటికప్పుడు ఇవ్వాలి. ఈ వైద్య దుకాణాల బహిరంగ బందిపోటు దోపిడీని అరికట్టే మొట్టమొదటి చర్య రికార్డులు ఇచ్చే బాధ్యతను వారి మీద మోపడమే. 

ఒక్కరోజు చికిత్స కాగితం ఇవ్వకపోయినా 50 వేలు ప్రభుత్వానికి, 50 వేలు రోగికి చెల్లించాలనే కఠిన నిబంధనలతో కూడిన చట్టం రావాలి. ఇటువంటి నేరాలు వారంలో అయిదు జరిగితే ఆ వైద్యశాల ఎండీకి నెలరోజుల జైలుశిక్ష విధించాలి. చికిత్స చేసి డాక్టర్ల చికిత్సానుమతి రద్దు చేయాలి. అప్పుడు కాని రోగికి రికార్డులు ఇవ్వాలనే బుద్ధి, రికార్డులు ఇస్తున్నాం గనుక దొంగతనం చేయరాదన్న ఆలోచన వైద్యవ్యాపారులకు కలుగుతుంది. అది చాలా అవసరం.

వైద్య సేవలు చేస్తామనే ప్రతిపాదనను రోగి అంగీకరించడంతో ఏర్పాటయిన ఒప్పందం నుంచి రికార్డులు పుట్టాయి కనుక రోగ నిర్ధారణ పరీక్ష నివేదికలు, స్కాన్‌ నివేదికలు, చికిత్సా పత్రాలు ఆ రోగికి చెందుతాయి. ఎప్పటికప్పుడు ఆ పత్రాలన్నీ రోగికి లేదా అతని బంధువులకు ఇవ్వాల్సిందే. వినియోగదారుల రక్షణ చట్టం 1986 సెక్షన్‌ 2(1) కింద వినియోగదారుడు అంటే ఎవరైతే నిర్ధారిత, చెల్లిస్తానన్న, చెల్లించిన, పాక్షికంగా చెల్లించిన, వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పిన ప్రతిఫలానికి బదులుగా సేవలను  స్వీకరించిన వ్యక్తి అని అర్థం. సెక్షన్‌ 2(1)(ఓ)లో సేవలను నిర్వచించారు. డాక్టర్లు వైద్యశాలల సేవలను ఈ చట్టం పరిధిలోకి తేవడం సరికాదని, తాము బాధ్యులం కాదని డాక్టర్లు వాదించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ వి.పి. శాంత(1995) అనే కేసులో సుప్రీంకోర్టు ఈ వాదనను తిరస్కరించి మెడికల్‌ ప్రాక్టీషనర్ల సేవలు ఈ చట్టం కిందకు వస్తాయని తీర్పు చెప్పింది. 

వినియోగదారుల చట్టం సెక్షన్‌ 2(ఎఫ్‌) లోపం అంటే ఏమిటో నిర్వచించింది. వస్తువులలో అసంపూర్ణత, లోటు, తగినంత లేకపోవడం, నాణ్యత క్షీణిం చడం, పనిచేసే తీరులో తేడా రావడం, చట్టంలో లేదా ఒప్పందంలో నిర్ణయించినంతమేరకు పనిచేయకపోవడం. ఇదే తరహాలో సెక్షన్‌ 2(జి) సేవలలో లోపాన్ని నిర్వచించింది. చట్టం నిర్దేశించినంత మేరకు లేదా ఒప్పుకున్నంత మేరకు సేవలను నిర్వహించకపోవడం, సేవలు అసంపూర్ణంగా ఉండడం, లోపాలు ఉండడం, నాణ్యత లోపించడం వంటివి జరిగితే నష్టపరిహారాన్ని కోరవచ్చు. 

ఈ లెక్కన రోగికి రికార్డులు ఇవ్వకపోవడం సేవాలోపం లేదా నిర్లక్ష్యం కూడా కావచ్చు. ఫోర్స్‌ వర్సెస్‌ ఎం జ్ఞానేశ్వరరావు కేసులో కేసుషీట్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం, ఇంతకుమునుపు చేసిన నిర్ధారణ పరీక్షల వివరాలు కేస్‌షీట్‌లో చేర్చకపోవడం, రోగి అంగీకారం పత్రాలను పారవేయడం నిర్లక్ష్యం కిందకు వస్తాయని ఆంధ్రప్రదేశ్‌ వినియోగదారుల మిషన్‌ తీర్పు చెప్పింది.  ఎక్స్‌ రే ఫిల్మ్‌ సరైన సమయంలో ఇవ్వకపోవడం సేవాలోపమే అని వి.పి. శాంత వర్సెస్‌ కాస్మొపాలిటన్‌ హాస్పటల్‌ కేసులో నిర్ణయించారు.

- మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

మరిన్ని వార్తలు