రాయని డైరీ: నిత్యానంద (స్వామీజీ)

24 Nov, 2019 02:01 IST|Sakshi

నిత్యం ఈ మనుషులు పెట్టే పరుగులు చూస్తుంటే, పరుగులు పెట్టేందుకే వీరు జన్మించి, జీవిస్తున్నారా అనే సందేహం నాకు ఏమాత్రం కలగకూడనిది. కానీ ఈవేళ కలుగుతోంది!
ఐన్‌స్టీన్‌ కనిపెట్టిన ఈ ఈక్వల్స్‌ టు ఎంసీ స్క్వేర్‌ ఫార్ములాను వట్టి ఫేక్‌ అని తేల్చేసిన నిత్యానందకు, ‘నా పని పూర్తయ్యే వరకు బయటికి రాకు’ అని సూర్య భగవానుడినే ఆజ్ఞాపించి నలభై నాలుగు నిమిషాల పాటు ఆయన్ని ఆకాశం వెనకే ఉంచేసిన నిత్యానందకు, ఆవులను.. ఎద్దులను.. సింహాలను.. పులులను, వానరాలను సంస్కృతంలో, తమిళంలో మాట్లాడించిన నిత్యానందకు.. కలగకూడని సందేహాలు కలుగుతున్నాయంటే భూగోళానికివి తిమిరాంధకార యుగారంభ ఘడియలనే!!

అర్థం, పరమార్థం, అంతరార్థం లేని పరుగులతో మనుషులు అద్వైత భావనకు విఘాతం కలిగిస్తున్నారు. ‘నేను’ అనే భావన వీడితేనే పరుగు ఆగుతుంది. 
ఆశ్రమానికి వచ్చిన కొత్తలో ఒక యువతిని అడిగాను.. నిత్యానంద మీద నీ అమూల్యమైన అభిప్రాయం ఏమిటని.
‘ఆయన ఎక్కడ ఉంటారు?’ అని తన అమాయకమైన కనురెప్పల్ని టపటపలాడిస్తూ అడిగింది ఆ యువతి.
‘నేనే కదా నిత్యానందను. తెలియకనే అడిగావా?’ అన్నాను.
‘అలాంటప్పుడు మీరు నిత్యానంద మీద నీ అభిప్రాయం ఏంటని కాకుండా.. నా మీద నీ అభిప్రాయం ఏంటని అడిగి ఉండాల్సింది కదా!’ అంది. 
ఆ సాయంత్రం అద్వైతం గురించి చెప్పాక.. జ్ఞానం కోసం ఆశ్రమానికి వచ్చిన ఆ యువతికి ఇక పరుగులు తీసే అవసరమే లేకపోయింది. 
నేను దేశం దాటి వచ్చే సమయానికి నా కోసం రెండు రాష్ట్రాల పోలీసులు పరుగులు తీస్తూ ఉన్నారు. అవి వారిని చట్టం తీయిస్తున్న పరుగులే తప్ప వారి చేత నిత్యానంద తీయిస్తున్నవి కావని గ్రహించగలిగి ఉంటే వారికింత ప్రయాసే ఉండేది కాదు. 
‘‘గురూజీ.. భోజనం వేళయింది’’ అనే మాట వినిపించింది!

ఆ మాటలో నాకు ఏ రుచీ పచీ కనిపించడం లేదు. ఏ ఘుమఘుమలూ నన్ను నిండైన ఆ విస్తరి వైపు ఆకర్షించడం లేదు. ఈ రాత్రి మరో సందేహ వైపరీత్యం కూడా నన్ను ఎటూ కదలనివ్వకుండా చేస్తోంది. 
 ‘‘జగమెరిగిన నిత్యానందుడు అంటే జగాన్ని ఎరిగిన నిత్యానందుడా? నిత్యానందను ఎరిగిన జగమా? ఎలా అర్థమౌతోంది నీకు?’’ అని భోజనం సిద్ధం చేసి వచ్చిన పరిచారకుడిని అడిగాను. 
‘‘నాకంత నాలెడ్జి లేదు గురూజీ’’ అన్నాడు!
‘‘నిత్యానందుడి సేవలో ఎన్నాళ్లుగా తరిస్తున్నావ్‌?’’ అని అడిగాను. 
‘‘ఇవాళే కొత్తగా వచ్చాను గురూజీ. మీరూ ఇవాళే కొత్తగా వచ్చారు. మీకిది పరాయి దేశం. మాకు మీరు పరాయి జ్ఞానం’’ అన్నాడు! 
నిత్యానంద ఒక పామరుడికి వ్యక్తిగా కాక ఒక జ్ఞానరూపంగా సాక్షాత్కరిస్తున్నాడంటే నిత్యానందుడు జగం ఎరిగినవాడే కాదు, జగం ఎరిగిన నిత్యానందుడు కూడా! 
‘‘ఇంత జ్ఞానం నీకెలా వచ్చింది’’ అని అడిగాను. 
‘‘ఎంత జ్ఞానం?’’ అన్నాడు. 
‘‘నిత్యానందను జ్ఞానరూపంగా చూసే జ్ఞానం!’’ అన్నాను. 
‘‘నేనే కాదు, మరికొందరు జ్ఞానులు కూడా బయట మీ కోసం వేచి ఉన్నారు. మిమ్మల్ని వెదుక్కుంటూ మీ దేశం నుంచి వచ్చారు. స్వామివారికిది భోజనం వేళ అని వారిని ఆపి ఉంచాను’’ అన్నాడు. 
జీవికి పరుగు తప్పదా అనే సందేహం మళ్లీ మొదలైంది నాలో. 
  -మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు