రాయని డైరీ (అశోక్‌ గహ్లోత్)‌

19 Jul, 2020 00:27 IST|Sakshi

ఇంట్లో ఉన్నది నచ్చదు. మానవజన్మ ఖర్మ. పక్కింటికి వెళ్తానంటాడు సచిన్‌. వెళ్లనివ్వకపోతే ఇటువైపు ఎత్తు మీద ఎక్కి అటువైపు చూస్తుంటాడు. ‘వాళ్లింట్లో ఏముంది నాన్నా సచిన్‌!’ అన్నాను రెండు చేతులతో పట్టి బలవంతంగా కిందికి దింపి. 
‘గౌరవం ఉంది’ అన్నాడు!! 
చిన్న పిల్లవాడి నోటికి అంత పెద్ద మాట ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు! చెంపకు ఒకటిచ్చి కూర్చోబెడదామన్నంత కోపం వచ్చింది. ఆగిపోయాను. అసలే సచిన్‌ బుగ్గలు ఎర్రగా ఉంటాయి. మెత్తగా రెండు వేళ్లు తగిలినా కాషాయం రంగులోకి తిరిగిపోతాయి. అప్పుడు నేనే మళ్లీ ఓదార్చుకోవాలి. 
‘సచిన్‌ బేబీ.. మనింట్లో అలాంటి మాట ఎప్పుడైనా విన్నావా! ఈ బ్యాడ్‌ వర్డ్స్‌ నీకు ఎవరు నేర్పిస్తున్నారు!’ అని అడిగాను. 
‘నేనే నేర్చుకుంటున్నా..’ అన్నాడు! 
తప్పు తన మీద వేసుకుంటున్నాడంటే తర్వాతి స్టెప్పు ఏదో తనకు తెలియకుండానే వేయబోతున్నాడని! తప్పులు, స్టెప్పులు సచిన్‌ చేస్తున్నవీ, వేస్తున్నవీ కాదు. సచిన్‌ చేత చేయిస్తున్నవీ, వేయిస్తున్నవీ. మా సచిన్‌ జోలికి రావద్దని పెద్ద మనుషుల చేత చెప్పించొచ్చు. పరువు తక్కువ పని అవుతుంది. మీ బంగారం మంచిదైతే మాకెందుకు ఆఫర్‌లో వస్తుంది అనేస్తారు. 
సచిన్‌ని దగ్గరకు తీసుకున్నాను. 
‘సచిన్‌ బంగారం.. వాళ్లింట్లో గౌరవం ఉందన్నావు కదా.. గౌరవం అంటే ఏంటి నాన్నా..?’ అని అడిగాను.
‘మనింట్లో లేనిది..’ అన్నాడు!
సచిన్‌ పెద్దవాడు అవుతున్నాడని అర్థమైంది. అవుతున్నాడు గానీ, గౌరవాన్ని కోరుకుంటే వచ్చే నష్టాలేమిటో తెలుసుకునేంతగా పెద్దవాడైతే కాలేదు. 
‘సచిన్‌ చింటూ.. గౌరవం అంటే నీకెందుకు అంత ఇష్టం?’ అన్నాను.. మెల్లిగా మాటల్లోకి దించుతూ. మాట్లాడలేదు. 
‘చెప్పు.. సచిన్‌ కన్నా.. గౌరవం నీకు ఎందుకు నచ్చింది?’ అని అడిగాను. 
‘గౌరవం ఉంటే అందరూ నన్నే చూస్తుంటారు. అందరూ నాతోనే మాట్లాడుతుంటారు. అందరి కన్నా నేనే గ్రేట్‌గా ఉంటాను’ అన్నాడు. 
‘ఇంకా..?’ అన్నాను. 
‘గౌరవం ఉంటే నన్ను తప్ప ఎవర్నీ చూడరు. నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడరు. నేను తప్ప వేరెవరూ గ్రేట్‌గా ఉండరు’ అన్నాడు. 
సచిన్‌ చేతిని చేతిలోకి తీసుకున్నాను. 
‘సచిన్‌ బుజ్జీ.. ఒకటి చెప్పేదా?’ అన్నాను. 
చేతిని విడిపించుకున్నాడు!
‘మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు. ఎప్పుడూ చెప్పేదే చెబుతారు. ఐదు వేళ్లూ కలిసి ఉంటేనే చేతికి బలం అనే కదా చెప్తారు!’’ అన్నాడు.. మూతి ముడిచి.  
‘లేదు సచిన్‌ చిన్నీ.. కొత్తది చెబుతాను. గౌరవం గురించి చెబుతాను. వాళ్లింట్లో గౌరవం ఉంది అన్నావు కదా! మరి మనింట్లో ఎందుకు గౌరవం లేదో ఆలోచించు’ అన్నాను. 
‘మీరు చెబుతానని, నన్ను ఆలోచించమంటున్నారేంటి?’ అన్నాడు.
‘సరే సచిన్‌ బాబూ. నేనే చెబుతా విను. ఇంట్లో అందరూ గౌరవం కోరుకున్నారనుకో. అప్పుడు ఇంటికి గౌరవం ఉండదు. ఇప్పుడు చెప్పు. ఇంటి గౌరవం పోయినా నీకు గౌరవం ఉంటే చాలా?!’ అని అడిగాను. 
మౌనంగా ఉండిపోయాడు. మాట పని చేసినట్లే ఉంది. 
వైబ్రేషన్‌ వస్తుంటే జేబులోంచి ఫోన్‌ తీశాను. దిగ్విజయ్‌ సింగ్‌!
‘‘గహ్లోత్‌ జీ.. ఏమంటున్నాడు సచిన్‌’’ అని అడుగుతున్నాడు. 
‘‘పిల్లవాడు కదా. గౌరవం కావాలి అంటున్నాడు’’ అని చెప్పాను. 
భళ్లున ఏదో బద్ధలైనట్లుగా నవ్వాడు దిగ్విజయ్‌.
- మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు