రాయని డైరీ : ఇమ్రాన్‌ఖాన్‌ (పి.ఎం.ఎలక్ట్‌)

29 Jul, 2018 01:14 IST|Sakshi

ఇండియా తీసుకున్నంత సీరియస్‌గా పాకిస్తాన్‌ని మరే కంట్రీ తీసుకున్నట్లు లేదు! ఇందుకోసమైనా నేను ఇండియాను రెస్పెక్ట్‌ చెయ్యాలి. పాకిస్తాన్‌ పౌరుడిగా ఇండియాను రెస్పెక్ట్‌ చేస్తే అదేం పెద్ద విషయం అవదు. పి.ఎం. సీట్లో కూర్చున్నప్పట్నుంచీ ఇండియాను రెస్పెక్ట్‌ చెయ్యడం మొదలుపెట్టాలి. అందుకు ఆర్మీ ఒప్పుకుంటుందా అన్నది ప్రశ్నే కాదు. ‘ఇమ్రాన్, ఇండియాకు నువ్విచ్చే రెస్పెక్ట్‌ నువ్వివ్వు.  మేమిచ్చే రెస్పెక్ట్‌ మేమిస్తాం’ అంటుంది.

కౌంటింగ్‌ రోజు రాత్రి బి.బి.సి. చూస్తూ కూర్చున్నాను. బి.బి.సి. నా గురించి చెప్పిందంతా చెప్పి, ఇదిగో ఇతనే ఇమ్రాన్‌ఖాన్‌ అని, వసీమ్‌ అక్రమ్‌ ఫొటో చూపించింది! అక్రమ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌. నేను రైట్‌ హ్యాండెడ్‌ ఆల్‌రౌండర్‌. క్రికెట్‌నే కాదు, కుడి ఎడమల్ని కూడా బి.బి.సి. మర్చిపోయినట్లుంది. వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ని ఓడించిన పాక్‌  కెప్టెన్‌ని మర్చిపోయి, ఇంగ్లండ్‌పై పాక్‌ని గెలిపించిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ని మాత్రం గుర్తు పెట్టుకుంది! మిగతా చానళ్లు ఎవర్ని చూపించాయో మరి! 

ఫలితాలొచ్చి ఒక రోజు గడిచినా ఎవర్నుంచీ పుష్పగుచ్ఛాలు రాలేదు! ట్రంప్‌ చేతిలో పుష్పగుచ్ఛం ఉంది కానీ, దాన్ని పుతిన్‌కి ఇవ్వడం కోసం పట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. పుతిన్‌ చేతిలోనూ పుష్పగుచ్ఛం ఉంది. ట్రంప్‌కి ఇచ్చాకే మిగతావాళ్లకి అన్నట్లు ఆయనా పట్టుకునే తిరుగుతున్నాడు. ‘ముందు నువ్విస్తావా నేనిచ్చేదా’ అన్నదే ఇప్పుడు ఆ అగ్రదేశాల మధ్య ఉన్న కోల్డ్‌ వార్‌. 
పాకిస్తాన్‌ తప్ప, లోకంలోని దేశాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అన్నిటికన్నా ఇండియా ప్రశాంతంగా ఉంది. పక్కపక్క దేశాల్లో ఒకదాంట్లో శాంతి, ఒకదాంట్లో అశాంతి ఉన్నాయంటే.. ఈ దేశం వల్ల ఆ దేశానికి శాంతి, ఆ దేశం వల్ల ఈ దేశానికి అశాంతి అని తెలిసిపోవడం లేదా?! ఈ పరిస్థితిని చక్కదిద్దాలి.

ఎలా చక్కదిద్దాలన్న దానిపై ముషార్రఫ్‌ కొన్ని టిప్స్‌ ఇస్తానన్నాడు. ఇప్పుడున్న ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా  ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ పర్సన్‌ ఇన్‌ ది వరల్డ్‌’ అని ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ఉంది. ఆయన దగ్గరా కొన్ని టిప్స్‌ తీసుకోవాలి. ఐ.ఎస్‌.ఐ. చీఫ్‌ నవీద్‌ ముఖ్తార్‌ దగ్గర ఎలాగూ కొన్ని టిప్స్‌ ఉంటాయి. అడిగే పన్లేదు. వాట్సాప్‌లో రోజుకో టిప్పు పంపిస్తాడు. ఆల్రెడీ ఈ నాలుగు రోజులకు నాలుగు టిప్పులు వచ్చేసి ఉన్నాయి. ఇంకా టైమ్‌ ఉంది కదా అని ఓపెన్‌ చేసి చూళ్లేదు.

ఆదివారం తెల్లారే కళ్లెదురుగా పుష్పగుచ్ఛం! చైనా నుంచి వచ్చిందా? పూలు అలా లేవు. సౌదీ నుంచి వచ్చిందా? పూలు అలా లేవు. ఇరాన్‌ నుంచి వచ్చిందా? పూలు అలా లేవు. ఆఫ్ఘన్‌ నుంచి వచ్చిందా? పూలు అలా లేవు! మరెవరు? చేతుల్లోకి తీసుకుని చూశాను. ఇండియా!! 
ఇండియానే కానీ, పూలు కశ్మీర్‌విలా లేవు! 

మాధవ్‌ శింగరాజు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా