రాయని డైరీ: జిన్‌పింగ్‌ (చైనా అధ్యక్షుడు)

5 Jul, 2020 00:59 IST|Sakshi

సియాన్షా మోదీ వాస్తవాధీన రేఖ దగ్గరికి వచ్చి కూడా చైనా లోపలికి రాలేదు! ఇంటి వరకు వచ్చి, ఇంట్లోకి రాకుండా వెళ్లిపోయాడంటే చైనా సంప్రదాయాలేవో దారి మధ్యలో వారిని బాధించి ఉండాలి. 
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌కి ఫోన్‌ చేసి, ‘‘నేనిప్పుడు సియాన్షా మోదీతో మాట్లాడేందుకు వీలవుతుందా?’’ అని అడిగాను. ‘‘మాట్లాడేందుకు వీలవుతుంది మిస్టర్‌ ప్రెసిడెంట్‌. అయితే మోదీని  మాట్లాడించడం వీలుకాకపోవచ్చు’’ అన్నాడు లిజియన్‌. 
‘సియాన్షా మోదీ మనతో మాట్లాడగలిగే లోపు, మనం ఇంకెవరితోనైనా మాట్లాడగలమేమో చూడు’’ అన్నాను. 
‘‘మాట్లాడలేమేమో మిస్టర్‌ ప్రెసిడెంట్‌. అమెరికాతో మనకు ట్రేడ్‌వార్‌ నడుస్తోంది. తైవాన్‌తో మెయిన్‌ల్యాండ్‌ వార్‌ నడుస్తోంది. హాంకాంగ్‌తో కల్చరల్‌ వార్‌ నడుస్తోంది. బ్రిటన్‌తో హాంకాంగ్‌ వార్‌ నడుస్తోంది. జపాన్‌తో డిప్లమసీ వార్‌ నడుస్తోంది. ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం.. ఆ బెల్టు మొత్తంతో  సౌత్‌ సీ వార్‌ నడుస్తోంది’’ అన్నాడు లిజియన్‌.
నేను అన్నది అతడికి అర్థమైనట్లు లేదు. 
‘‘మనతో మాట్లాడేందుకు ఇంకెవరైనా ఉంటే చూడమని అన్నది వేరే దేశాల్లో కాదు లిజియన్, ఇండియాలోనే ఎవరైనా ఉన్నారా అని..’’ అన్నాను. 
‘‘ఇండియాతో మనకు బోర్డర్‌ వార్‌ నడుస్తోంది కదా మిస్టర్‌ ప్రెసిడెంట్‌’’ అన్నాడు!
అతడి వైపు చూశాను. ఇతణ్ని మార్చేస్తే బెటరా అనిపించింది. 
‘‘దేశాల మధ్య వార్‌ నడుస్తున్నప్పుడు దేశంలోని వారి మధ్య ఇంకో వార్‌ నడుస్తుంటుంది. సియాన్షా మోదీతో అలా యుద్ధం చేస్తున్న వారెవరైనా ఉంటారు. వారిని నాకు కలుపు’’ అని ఫోన్‌ పెట్టేశాను. 
 వెంటనే ఫోన్‌ రింగ్‌ అయింది. ‘‘దొరికారు’’ అన్నాడు లిజియన్‌. 
‘‘ఎవరు? సియాన్షా మోదీనేనా?’’ అన్నాను. 
‘‘ఆయన కాదు. ఆయన కోసం ఇంకోసారి ట్రయ్‌ చెయ్యడం ఎందుకని, ట్రయ్‌ చేస్తే ఒకసారికే దొరికే మనిషిని పట్టుకున్నాను’’ అన్నాడు!
‘‘కష్టమైన పనులు చెయ్యడం నేర్చుకో లిజియన్‌. ఎన్నాళ్లిలా విదేశాంగ శాఖ ప్రతినిధిగా ఉండిపోతావ్‌? చైనా చాలా పెద్దది. ముందు ముందు ఇంకా పెద్దది అవుతుంది’’ అన్నాను. 
‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. ఈయన ఒకసారికే  దొరికాడు కానీ, మాట్లాడ్డానికైతే ఒకసారికే ఒప్పుకోలేదు. ఒప్పించడానికి అనేకసార్లు కష్టపడవలసి వచ్చింది. లైన్‌లో ఉన్నారు కనెక్ట్‌ చెయ్యమంటారా?’’ అని అడిగాడు. 
‘‘ఊ..’’ అన్నాను. కనెక్ట్‌ చేశాడు.
‘‘నమస్తే జిన్‌పింగ్‌జీ.. ఏదో మాట్లాడాలని అన్నారట’’ అన్నారెవరో అట్నుంచి! ‘ఎవరూ.. మాట్లాడుతోందీ’ అని అడగబోయి ఆగాను. మాట్లాడ్డానికి దొరికింది ఎవరని లిజియన్‌ని నేనూ అడగలేదు, మాట్లాడ్డానికి దొరికిందెవరో లిజియనూ నాకూ చెప్పలేదు. 
‘‘నమస్తేజీ నమస్తే.. సియాన్షా మోదీ మీకు తెలుసా?’’ అన్నాను. 
‘‘మోదీ తెలుసు. సియాన్షా ఎవరు?’’ అన్నాడు! 
‘‘సియాన్షా అనేది రెస్పెక్ట్‌. సియాన్షా మోదీ అంటే మోదీకి రెస్పెక్ట్‌ ఇవ్వడం’’ అని చెప్పాను. 
‘‘అలాగైతే నాకు సియాన్షా మోదీ ఎవరో తెలీదు’’ అన్నాడు. 
‘‘మీరెవరో మరొకసారి నేను తెలుసుకోవచ్చా..’’ అన్నాను. 
‘‘ఎన్నిసార్లయినా తెలుసుకోవచ్చు. నేను సియాన్షా రాహుల్‌’’ అన్నాడు!
మనుషులకే ఇంత సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉంటే దేశాలకు లేకుండా ఉంటుందా?!

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు