రాయని డైరీ : ట్రంప్‌ (అమెరికా అధ్యక్షుడు)

31 May, 2020 01:11 IST|Sakshi

చెడ్డవాళ్లు ఏకమైతే ఈ లోకంలోని మంచివాళ్లకు ఏమౌతుందోనన్న భయాలు అక్కర్లేదు. ఎందుకంటే చెడ్డవాళ్లు ఈ లోకంలో కానీ, ఏ లోకంలో కానీ ఏనాటికీ ఏకం కారు. మంచివాళ్లే.. తమ మంచి గుణం చేత చెడ్డవాళ్ల మీదకు ఏకమౌతారు. 
లోకం మొత్తం మీద ఉన్నది ఒకే ఒక చెడ్డవాడే అయినా, అతడిని మంచివాడిని చేసేందుకు లోకం మొత్తం మీది మంచివాళ్లంతా ఏకం అవుతారు. అదే నాకు అర్థం కాకుండా ఉంటుంది! చెడ్డవాడెప్పుడూ వాడి కత్తి వాడు ఎత్తిపట్టుకుని ‘రండ్రా చూసుకుందాం..’ అంటాడు. ఈ మంచివాళ్లంతా ఒకే కత్తిని కలిపి పట్టుకుని, ‘కత్తిని పట్టుకున్నాం కానీ, ఎత్తి పట్టుకోలేదు. అదే మా మంచితనం’ అని లోకానికి  చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు.
జెనీవాలో ఒక మంచివాడు ఉన్నాడు. చైనా నుంచి కరోనా వ్యాప్తిస్తూ వచ్చినప్పటి నుంచీ అతడు రోజురోజుకూ మరింత మంచివాడిగా మారుతూ వస్తున్నాడు. అతడి పేరు టెడ్రోస్‌. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి. ఎంత మంచివాడంటే.. చైనాను గానీ, చైనా వైరస్‌ను గానీ, చైనా ల్యాబ్‌ను గానీ ఒక మాటంటే ఒప్పుకోడు. 
ఈ మధ్య అతడికి ఫోన్‌ చేశాను. 
‘‘ఎవరు మీరు?’’ అన్నాడు. 
‘‘అమెరికా నుంచి చేస్తున్నాను. నన్ను ట్రంప్‌ అంటారు. నేనొక చెడ్డవాడిని’’ అన్నాను. 
‘‘మరి చైనాలో ఉండే చెడ్డవాడైన ట్రంప్‌ ఎవరు?’’ అని అడిగాడు!! 
అతడి మంచితనానికి నివ్వెరపోయాను! 
‘‘నేను చెడ్డవాడిని అయినప్పటికీ మంచివాళ్ల మంచి ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకోగలను మిస్టర్‌ టెడ్రోస్‌. మీరు నన్ను అడగాలని అనుకున్నది.. ‘చైనాలో ఉండే చెడ్డవాడైన ట్రంప్‌ ఎవరు? అని కాదు, ‘చైనా మీద అస్తమానం కంప్లయింట్‌లు చేస్తూ ఉండే చెడ్డవాడైన ట్రంప్‌ ఎవరూ?’ అనే కదా. అయితే నాకు తెలిసి కానీ, మీకు తెలిసి కానీ, చైనాకు తెలిసి కానీ లోకంలో ఉన్న ట్రంప్‌ అనే చెడ్డవాడు ఒకడే. ఆ ఒక్కడూ చైనాలో లేడు. అమెరికాలో ఉన్నాడు..’’ అన్నాను. 
మంచివాడు ఒక్కక్షణం ఆగాడు. 
‘‘ఓ! నేనీ క్షణంలో లోకంలోని ఒకే ఒక చెడ్డవాడైన వ్యక్తితో మాట్లాడుతున్నానన్నమాట! ఎలా ఉన్నారు మిస్టర్‌ ట్రంప్‌? మీరు నాకు ఫోన్‌ చేస్తున్న సమయానికి నేనసలు మీ గురించే ఆలోచిస్తున్నానని చెబితే మీరు నమ్మలేరంటే నమ్మండి. మిమ్మల్ని మంచివాడిగా మార్చడానికి లోకంలోని మంచివాళ్లను కలుపుకునే పనిలో ఉన్నాను’’ అన్నాడు.
‘‘పెద్దగా నవ్వాను’’
‘‘ఏమిటి నవ్వుతున్నారు’’ అన్నాడు. 
‘‘ఒక చెడ్డవాడిని మార్చేందుకు మంచివాళ్లను కలుపుకునే పనిలో ఉన్నాను అని అన్నారు! అందుకే నవ్వొచ్చింది. అదేమంత తేలికైన పని కాదు మిస్టర్‌ టెడ్రోస్‌. అందరూ మంచివాళ్లే ఉన్న లోకంలో మంచివాళ్లను ఎంపిక చేసుకోవడానికి కొంత చెడ్డతనం ఉండాలి. మీరు జిన్‌పింగ్‌నైనా వదిలేసుకోవాలి, బిల్‌గేట్స్‌నైనా వదిలేసుకోవాలి. వాళ్లిద్దరే ముఖ్యం అనుకుంటే మిగతా మంచివాళ్లను వదిలేసుకోవాలి. చూశారా ఒక చెడ్డవాణ్ణి మార్చడం ఎంత కష్టమో’’ అన్నాను. 
‘‘మంచివాళ్ల కష్టం గురించి ఆలోచిస్తున్నారంటే.. మిస్టర్‌ ట్రంప్‌.. నాకనిపిస్తోంది, మీలో పరివర్తన జన్యువులు ఉన్నాయని. ఒక్క డాలర్‌ కూడా మాకు రాల్చనని అన్నారు కదా. చూస్తూ ఉండండి.. మీకు తెలియకుండానే మీరు కొన్ని డాలర్లనైనా మాకు విదిల్చడానికి త్వరలోనే ఒక మంచిరోజును ఎంచుకుంటారు’’ అన్నాడు!!
‘‘నేనూ ఈ సంగతి చెప్పడానికే మీకు ఫోన్‌ చేశాను మిస్టర్‌ టెడ్రోస్‌. చైనాలోని చెడ్డతనాన్ని మీరు చూడగలిగితేనే మీకు నాలోని మంచితనం కనిపిస్తుంది..’’ అన్నాను. 
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు