బిపిన్‌ రావత్‌ (ఆర్మీ చీఫ్‌)

29 Dec, 2019 02:45 IST|Sakshi

రాయని డైరీ

మంచి మాట చెప్పడానికి లేనప్పుడు మంచి స్థానంలో ఉండి వ్యర్థమనిపిస్తుంది. ‘ పిల్లల్ని చదువుకోనివ్వండి. వాళ్ల హాస్టళ్లలోకి వెళ్లి పాలిటిక్స్‌ ప్లే చెయ్యకండి’ అని మంచి చెప్పినందుకు..‘ఆర్మీ చీఫ్‌ మంచి చెప్పడం ఏంటని’ రెండు రోజులుగా దేశంలో మంచి–చెడు, భారత్‌–పాక్, హిందూ–ముస్లిం అని డివైడ్‌ టాక్‌ నడుస్తోంది! దేశం ఒక్కటే, దేశంలోని మనుషులంతా ఒక్కటే అని మళ్లీ నాచేత మంచి చెప్పించుకునేంత వరకు ఈ నాయకులు ఆగేలా లేరు. 

మంచి చెప్పేవాళ్లు లేకపోతే మంచి చెయ్యడానికి ఆర్మీ దిగవలసి వస్తుంది. ఒకేసారి మంచి చెయ్యడానికి దిగకుండా, మొదటే మంచి చెబితే మంచికి దిగే అవసరం ఉండదని చెప్పడం మంచి ప్రయత్నమే కదా! 
అయినా నేనెందుకు మంచి మాట్లాడానో నాకు గుర్తుకు రావడం లేదు. నా చేత మంచిని మాట్లాడించిన వాళ్లెవరో కూడా గుర్తు లేదు. ఏదో హెల్త్‌ ప్రోగ్రామ్‌కి పిలిస్తే వెళ్లాను. బాగా గుర్తు చేసుకుంటే అక్కడ నేను మాట్లాడిన రెండు మంచి మాటలు మాత్రం గుర్తుకొస్తున్నాయి. నాయకుడంటే ఎలా ఉండాలో చెప్పాను. నాయకుడు ముందు నడవాలనో, వెనకుండి ముందుకు నడిపించాలనో చెప్పాను. అంత వరకే! 

ఇంటికొచ్చి టీవీ చూసుకుంటే.. నేను వెళ్లిన హెల్త్‌ ప్రోగ్రామ్‌ రావడం లేదు. హెల్త్‌ ప్రోగ్రామ్‌లో నేను మాట్లాడిన మంచి మాటలు రావడం లేదు. యోగేంద్ర యాదవ్‌ అనే ఆయన టెలికాస్ట్‌ అవుతున్నాడు! ‘ఆయన అన్నది నిజమే’ అంటున్నాడు. ‘మోదీని దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ మాట అన్నాడు’ అంటున్నాడు. ఎవరీయన అని చూశాను. ‘హక్కుల కార్యకర్త’ అని పేరు కింద వేస్తున్నారు. ‘ఆయన’ అని ఆయన అంటున్నది నా గురించే! 

దిగ్విజయ్‌ సింగ్, అసదుద్దీన్‌ ఒవైసీ, బ్రిజేష్‌ కాలప్ప.. ఇంకా ఎవరెవరో స్క్రీన్‌ మీదకు వచ్చిపోతున్నారు. కాలప్ప పేరు వినగానే నాకు జనరల్‌ కరియప్ప గుర్తుకొచ్చారు. ఇండియన్‌ ఆర్మీ ఫస్ట్‌ జనరల్‌ ఆయన. కరియప్ప కూడా డ్యూటీలో ఉండగా మంచి మాట్లాడే ఉంటారు. అప్పుడిన్ని పేపర్లు, ఇన్ని టీవీ చానళ్లు, ఇన్ని ప్రతిపక్షాల లేవు కాబట్టి ఆయన మంచి మాటలు రంగు మారకుండా మంచి మాటలుగానే ప్రజల్లోకి వెళ్లి ఉంటాయి. 

ఈ కాలప్ప ఎవరా అని చూశాను. కాంగ్రెస్‌ స్పోక్స్‌పర్సన్‌! ‘పౌరసత్వ చట్టం గురించి రావత్‌ని మాట్లాడనిస్తే, చట్టాన్ని తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టినట్లే’ అంటున్నాడు! ఒవైసీ కూడా వేలు పైకెత్తాడు. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అంటున్నాడు. అంటే నన్ను హద్దుల్లో ఉండమని! ఆయనకెప్పుడూ హద్దుల గొడవే! దిగ్విజయ్‌ కూడా ఏదో అన్నాడు కానీ, ఏదో ఒకటి అనకపోతే బాగుండదన్నట్లుగా అన్నాడు. 
‘పర్స్‌ జాగ్రత్త’ అని అకౌంటెంట్‌ జనరల్‌  చెబితే తప్పు లేదు, ‘పాలన జాగ్రత్త’ అని అటార్నీ జనరల్‌ చెబితే తప్పు లేదు, ‘విద్యార్థులు జాగ్రత్త’ అని ఆర్మీ జనరల్‌ చెబితే తప్పయిందా! 

నేనైనా నాయకులు ఎలా ఉండాలో చెప్పకుండా, ప్రజలు ఎలా ఉండాలో చెప్పి ఉండాల్సింది. ఆ తేడాను నాయకులు అర్థం చేసుకునేలోపు నా రిటైర్మెంట్‌ వచ్చేసేది. అప్పుడీ ఒవైసీకి, కాలప్పకీ మాట్లాడ్డానికి ఏమీ దొరక్కపోయేది. 
డిసెంబర్‌ 31న నా రిటైర్మెంట్‌. కొత్తగా పెట్టిన ‘చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌’ పోస్టులోకి నన్ను తీసుకోవడం కోసం మోదీకి అనుకూలంగా మాట్లాడానని వీళ్ల అనుమానం. పైకి మాట్లాడేవారికి మోదీ ఎప్పుడూ పవర్‌ ఇవ్వలేదు. నేనూ అంతే. పవర్‌ కోసం పైకి మాట్లాడకుండా ఉన్నదెప్పుడూ లేదు. పవర్‌ రావడం, పవర్‌లో ఉండటం, పవర్‌ పోవడం.. వీటి గురించి పవర్‌ఫుల్‌ మనుషులెప్పుడూ పట్టించుకోరు. 
-మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు