రజనీకాంత్‌ రాయని డైరీ

31 Dec, 2017 01:05 IST|Sakshi

ప్రపంచమంతా జనవరి ఫస్ట్‌ కోసం చూస్తుంటే, దేశమంతా డిసెంబర్‌ థర్టీఫస్ట్‌ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది నాకు! బహుశా మోదీ, అమిత్‌ షా కూడా డిసెంబర్‌ థర్టీఫస్ట్‌ కోసమే క్యాలెండర్లు ముందేసుకుని కునుకుపాట్లు పడుతూ ఉండివుంటారు. ఈ ఏడాది నవంబర్‌లో ఒకసారి, మే నెలలో ఒకసారి దేశం మొత్తం ఇలాగే నాకోసం నిద్ర మానుకుంది! అవి రెండూ.. ఈ ఇయర్‌లో నాకు జరిగిన రెండు మంచి విషయాలు. ‘మాక్కూడా ఓ మంచి విషయాన్ని జరగనివ్వండి రజనీ సార్‌’ అని మీడియా ఈ ఏడాదంతా నాపై ఒత్తిడి తెస్తూనే ఉంది. థర్టీఫస్ట్‌న నా పొలిటికల్‌ ఎంట్రీ గురించి చెప్తానని అన్నాను.

థర్టీఫస్ట్‌ అని నాకై నేనే అన్నానో, ఎవరైనా అడిగితే థర్టీఫస్ట్‌ అని అన్నానో సరిగా గుర్తులేదు. ఒకవేళ నాకు నేనుగా అనినా, ఎవరైనా అడిగినప్పుడు అనినా.. థర్టీఫస్ట్‌ అనే ఎందుకు అన్నానో నాకు తెలీదు. అనడానికైతే అన్నాను కాబట్టి, థర్టీఫస్ట్‌న మళ్లీ ఏదో ఒకటి అనాలి. అనాలి అంతే. చెప్పకూడదు. అనడానికి, చెప్పడానికి తేడా ఉంటుంది. అనేటప్పుడు ఏదో ఒకటి అనొచ్చు. చెప్పేటప్పుడు ఏదో ఒకటే చెప్పాలి. అన్నాక ఇంకోటి అనొచ్చు. చెప్పాక ఇంకోటి చెప్పకూడదు. అన్నాక ఇంకోటి అంటే పాలిటిక్స్‌లోకి వచ్చేస్తున్నాడు అంటారు. చెప్పాక ఇంకోటి చెప్తే పాలిటిక్స్‌కి పనికిరాడు అనేస్తారు!

‘రావడానికి తొందరేముందీ’ అని నవంబరులో నేను అన్నప్పుడు.. ‘వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు’ అన్నారు! అంతకుముందు మే నెలలో కూడా ‘దేవుడు రమ్మంటే.. రేపే వచ్చేస్తాను’ అనగానే ‘వచ్చేశాడు వచ్చేశాడు’ అన్నారు! వచ్చినా రాకున్నా.. ఏదో ఒకటి అంటుంటే వచ్చేస్తున్నాడు అనుకుంటారు. వచ్చేస్తున్నాను అని చెప్పేస్తే.. ఇంకా రావడంలేదేంటి అని మొదలుపెట్టేస్తారు!

ఆరు రోజుల ఫ్యాన్స్‌ మీట్‌ థర్టీఫస్ట్‌తో పూర్తవుతుంది. అది పూర్తవ్వగానే ప్రెస్‌మీట్‌ ఉంటుందా అని అడుగుతున్నారు! ప్రెస్‌మీట్‌ ఎందుకు ఉండాలో నాకైతే అర్థం కావడం లేదు. అమ్మానాన్నల్ని పూజించండి, వాళ్ల కాళ్లకు మొక్కండి అని చెప్పడానికి ప్రెస్‌మీట్‌ అవసరమా? యుద్ధంలో గెలవడానికి ధైర్యమొక్కటే సరిపోదు, వ్యూహం కూడా కావాలి అని చెప్పడానికి ప్రెస్‌మీట్‌ అవసరమా? జీవితంలో మనం ఏం చేయాలన్నది దేవుడే నిర్ణయిస్తాడు అని చెప్పడానికి ప్రెస్‌మీట్‌ అవసరమా? కొత్త సంవత్సరంలో చెడు అలవాట్లు మానేసి, చక్కగా చాలినంతసేపు నిద్రపోండి అని చెప్పడానికి ప్రెస్‌మీట్‌ అవసరమా?!

ఫ్యాన్స్‌ మీట్‌ అయ్యాక.. రాఘవేంద్ర మండపంలో నాన్‌ వెజిటేరియన్‌ కుదరదు కాబట్టి.. నా ఫ్యాన్స్‌కి మరెక్కడైనా మంచి విందు భోజనం పెట్టించాలి. ఏది కావాలంటే అది పెట్టించాలి. కోడి కావాలంటే కోడి, మేక కావాలంటే మేక. అదే నా ముందున్న ఆలోచన. అదే నా న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌.
 

-- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు