రాయని డైరీ: సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)

28 Oct, 2018 04:34 IST|Sakshi

వ్యక్తుల్ని సెలవుపై పంపించగలం. వాళ్ల నిజాయితీని సెలవుపై పంపించగలమా? అలోక్‌ వర్మని సెలవుపై పంపించినప్పుడు.. మోదీజీ అసలు దేశంలోనే ఉంటున్నారా అనే సందేహం కలిగింది నాకు. దేశాధినేతలతో కలిసి ప్రీతికరమైన ఆహారాన్ని ఆరగించడానికే నాలుగున్నరేళ్లుగా ఆయన సమయం సరిపోతోంది! 

అలోక్‌ ఎంత ఆనెస్టో నాకు తెలుసు. ఎవరి ఇంటికైనా వెళితే కనీసం మంచినీళ్లు కూడా తాగరాయన. మంచినీళ్లు తాగినందుకు ప్రతిఫలంగా.. ‘మంచిది కాని సహాయం’ ఏదైనా ఆ ఇంటì వాళ్లకు చెయ్యవలసి వస్తుందేమోనని ఆయన భయం! సీబీఐకి ఇలాంటి వాళ్లే కదా డైరెక్టర్లుగా ఉండాల్సింది? కానీ ఏం జరిగింది? నీళ్లయినా ముట్టని సీబీఐ ఆఫీసర్‌కి తన ఆఫీస్‌లోనే నీళ్ల గ్లాసు లేకుండా చేశారు. నీళ్లుంచి గ్లాసు తీసేయడమూ, పదవి ఉంచి సెలవుపై పంపించడమూ.. రెండూ ఒకటే. 

అవినీతిపరుడైన అస్థానాతో పాటు, నిజాయితీపరుడైన అలోక్‌నీ సెలవుపై పంపించగానే.. మోదీజీకి వివరంగా ఒక బహిరంగ లేఖ రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది నాకు. అలా కాకుండా ‘టు’ అడ్రస్‌ పెట్టి నేరుగా మోదీజీకే లేఖ పంపిస్తే ఒక ప్రమాదం ఉంది. అరుణ్‌ జైట్లీ ఆ లేఖను మధ్యలోనే అందుకుని ముక్కలుముక్కలుగా చింపేసి, ఆ ముక్కల్ని నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తాడు. అలాక్కూడా కాకుండా నేనే స్వయంగా పీఎంవో ఆఫీస్‌కి వెళ్లి మోదీజీతో మాట్లాడాలనుకున్నా.. అప్పుడు కూడా జైట్లీనే అడ్డు పడతాడు. ఆర్థికశాఖ నాకు రాకుండా అడ్డుకున్న మనిషికి, ఏ శాఖా లేని వట్టి రాజ్యసభ సభ్యుడిని అడ్డుకోవడం ఏమంత కష్టం! 

బహిరంగలేఖను ఎలా మొదలుపెట్టాలో తేల్చుకోలేక రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొనే ఉన్నాను. ‘డియర్‌ మోదీజీ’ అనాలా? ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనాలా? ‘రెస్పెక్టెడ్‌ మోదీజీ’ అనాలా? చివరికి ఒకటనిపించింది. దేశాధినేతలు మోదీజీకి పంపే ఆహ్వాన పత్రాలపై ఉన్నట్లు.. ‘ఆనరబుల్‌ ఇండియన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అని ప్రారంభిస్తే!! అప్పుడైతే ఆయన ఆసక్తిగా చూసే అవకాశాలుంటాయి. 

కరప్షన్‌పై పని చేస్తున్న మోదీజీ, కరప్షన్‌ పైనే పనిచేస్తున్న ఒక సీబీఐ ఆఫీసర్‌ని కరప్షన్‌పై కంప్లయింట్‌ చేసినందుకు సెలవిచ్చి పంపడం కూడా కరప్షనేనని బహిరంగ లేఖలో రాయాలి. ఈ స్టెయిల్‌ ఆఫ్‌ రైటింగ్‌ మోదీజీకి నచ్చుతుంది. లెటర్‌ మొత్తమంతా ఇలాగే రాయగలిగితే ఆయన లెటర్‌ మొత్తమంతా ఇంట్రెస్టుగా చదవగలుగుతారు. 

ఇంకో పేరాలో.. ‘‘మోదీజీ, మీరిలాగే మంచిమంచి సీబీఐ ఆఫీసర్‌లని సెలవుపై పంపించేస్తుంటే.. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోస్కీ, విజయ్‌ మాల్యాలు.. దసరా సెలవులకో, దీపావళి సెలవులకో, కోర్టు సెలవులకో వెళ్లినట్లుగా వెళ్లి, విదేశాల్లోనే ఉండిపోతారు. అప్పుడిక కరప్షన్‌ చేసినవాళ్లు దేశంలో ఉండరు. కరప్షన్‌ జరక్కుండా చూసేవాళ్లు దేశంలోని సీబీఐ ఆఫీసులలో ఉండరు’’.. అని రాయాలి. 

అలోక్‌ని చేసినట్లే, రాజేశ్వర్‌ సింగ్‌నీ టార్గెట్‌ చేయబోతున్నారని నాకు అనిపిస్తోంది. సీబీఐలో అలోక్‌ ఎలాగో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో రాజేశ్వర్‌ అలాగ. కుర్రాడు. స్మైలింగ్‌ ఫేస్‌. చిదంబరం కరప్షన్‌ కేసుల్ని డీల్‌ చేస్తున్నది అతడే. అతడిని తప్పించి, చిదంబరాన్ని కేసుల నుంచి తప్పించాలని బీజేపీలోనే కొందరు ప్లాన్‌ చేస్తున్నారు. అదే జరిగితే సోనియా మీద, రాహుల్‌ మీద, చిదంబరం మీద, శశి థరూర్‌ మీద.. ఇంకా కాంగ్రెస్‌ వాళ్ల మీద నేను పెట్టిన కేసులన్నీ వాపస్‌ తీసుకుంటానని మోదీజీకి రాసే బహిరంగ లేఖలోని చివరి పేరాలో చిన్న పంచ్‌ ఇవ్వాలి.

మాధవ్‌ శింగరాజు

>
మరిన్ని వార్తలు