రాయని డైరీ; పీయూష్‌ గోయల్‌

3 Feb, 2019 01:33 IST|Sakshi

బడ్జెట్‌ సమర్పించి ఇంటికి వస్తున్నప్పుడు అనిపించింది. మరీ సమర్పించాల్సినంత బడ్జెట్టేమీ కాదని. ప్రెస్‌ మీట్‌ పెట్టి సమర్పించినా సరిపోయేదేమో!

పార్లమెంటు హాల్లోకి వెళుతున్నప్పుడు బయట బడ్జెట్‌ కాపీల బండిల్స్‌ని తనిఖీ చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది కనిపించారు. బడ్జెట్‌లో ఏం ఉండబోతున్నదోనన్న ఆసక్తి ఏ మాత్రం లేకుండా, వాళ్లు ఆ బండిల్స్‌ని తనిఖీ చేస్తున్నారు. నవ్వొచ్చింది నాకు. నా చేతిలో ఉన్న బడ్జెట్‌ సూట్‌కేస్‌లో ఏముందోనన్న ఆసక్తి నాకే లేనప్పుడు.. వాళ్లు చెక్‌ చేస్తున్న బడ్జెట్‌ బండిల్స్‌లో ఏముందోనన్న ఆసక్తి వాళ్లకెందుకుండాలి? అయినా లోపల ఉండాల్సినవి ఉన్నాయా లేదా అని కాదు కదా వాళ్లు చెక్‌ చేయవలసింది. ఉండకూడనివి ఏమైనా ఉన్నాయా అని చెక్‌ చెయ్యాలి. వాళ్లు అదే పనిలో ఉన్నారు. 

అన్నన్ని బండిల్స్‌ వేస్ట్‌ అనిపించింది ఆ బండిల్స్‌ని దాటుకుని లోపలికి వెళ్తుంటే. పేపర్‌ వేస్ట్‌. ప్రింటింగ్‌ వేస్ట్‌. టైమ్‌ వేస్ట్‌. మనీ వేస్ట్‌. ఇకనుంచీ మెంబర్స్‌ అందరికీ సాఫ్ట్‌ కాపీ ఫార్వార్డ్‌ చేస్తే సరిపోతుంది. నెక్ట్స్‌ బడ్జెట్‌ను నేను సమర్పించినా, జైట్లీజీ యు.ఎస్‌. నుంచి తిరిగొచ్చి సమర్పించినా పేపర్‌లెస్‌గానే సమర్పించాలి. బడ్జెట్‌ సూట్‌కేస్‌ కూడా మోత బరువు. లోపల మోతేమీ లేకున్నా బరువే. ఆ సూట్‌కేస్‌ను అలా చేత్తో పట్టుకుని నడుస్తున్నప్పుడు నడుస్తున్నట్లు ఉండదు. మోస్తున్నట్లు ఉంటుంది. ఫైనాన్స్‌ మినిస్టరే బడ్జెట్‌ సూట్‌కేస్‌లా కనిపించాలి కానీ, సూట్‌కేస్‌ చేతుల్లో ఉంది కాబట్టి ఫైనాన్స్‌ మినిస్టర్‌ అనిపించకూడదు.
 
బడ్జెట్‌ సమర్పణ చాలా ఈజీగా అయిపోయింది. ఫస్ట్‌ టైమ్‌ సమర్పణ ఎలా ఉంటుందోనని నేను ఆందోళన చెందినంతగా ఏమీ లేదు! నమస్కార సమర్పణకైనా కాస్త నడుము వంచాల్సి వచ్చింది కానీ, బడ్జెట్‌ సమర్పణకు ఒక్క ఎక్సర్‌సైజ్‌తో కూడా పని పడలేదు. అసలది బడ్జెట్‌ సమర్పణలానే లేదు. పార్లమెంటులో ఎవరికో ఫేర్‌వెల్‌ పార్టీ ఇస్తున్నట్లుగా ఉంది.
 
‘‘మంచి పని చేశావ్‌ గోయల్‌’’ అన్నారు మోదీజీ, నేను ఇంటికి చేరుకోగానే. 
ఆల్రెడీ ఆయన సభలో ఒకసారి నా వెన్ను తట్టి అభినందించారు. ఇప్పుడు మళ్లీ ఫోన్‌లో వెన్ను తడుతున్నారేమిటి?!
‘‘ఏం పని చేశాను మోదీజీ’’ అన్నాను. ఆయన ‘మంచి పని చేశావు గోయల్‌’ అని అన్నారని, ‘ఏం మంచి పని చేశాను మోదీజీ’ అని నేను అడగడం బాగుండదని.
‘‘అదేనయ్యా.. బడ్జెట్‌కు ముందు పెద్దల పాదాలకు నమస్కారం చేశావు చూడూ.. అది నాకు నచ్చింది’’ అన్నారు మోదీజీ. 

‘‘కానీ మోదీజీ, నేను నా సమీపంలో ఉన్న పెద్దల పాదాలకు మాత్రమే నమస్కారం చేయగలిగాను. నా పక్క సీట్లో నితిన్‌ గడ్కరీ ఉన్నారు. ఆయన పాదాలకు నమస్కారం చేశాను. నా వెనుక సీట్లో శాంత కుమార్‌ ఉన్నారు. ఆయన పాదాలకు నమస్కారం చేశాను. పక్క వరుసలోని మొదటి సీట్లో ఉమా భారతి ఉన్నారు. ఆవిడ పాదాలకు నమస్కారం చేశాను. జైట్లీజీ పాదాలు అందుబాటులో లేవు కనుక ఆయనకు నమస్కారం చేయలేకపోయాను’’ అన్నాను. 

పెద్దగా నవ్వారు మోదీజీ. 
‘‘నాకూ, జైట్లీకీ నమస్కారం చేయలేదేమిటని నేను అడగడం లేదు గోయల్‌. గడ్కరీ పాదాలకు నమస్కారం చేసి మంచి పని చేశావు అంటున్నాను’’ అన్నారు.
‘‘జీ’’ అన్నాను. ఫోన్‌ పెట్టేశారు మోదీజీ.

మోదీజీ అంటే గడ్కరీకి పడటం లేదు, నెక్ట్స్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ గడ్కరీనే..’ అని అంతా అనుకుంటున్నప్పుడు.. మోదీజీ చూస్తుండగానే గడ్కరీ పాదాలకు నమస్కరించాను కాబట్టి.. పడకపోవడం, ప్రైమ్‌ మినిస్టర్‌ కావడం ఏమీ లేదని నా చేత చెప్పించినట్లయిందని మోదీజీ అనుకుని ఉండాలి.

-మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు