ఆ ఆగ్రహం సమర్థనీయం!

9 Jan, 2018 02:09 IST|Sakshi

చీలికలు పేలికలుగా ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని దళితులు కొత్త సంవత్సరం తొలిరోజున తమ శక్తి ఏమిటో చూపించారు. కోరెగాంలో జరిగిన ఘటనపై వారి అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చడం అంత సులభం కాదు.

రెండు వందల ఏళ్ల క్రితం, ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాలు కోరెగాం వద్ద ఒక యుద్ధాన్ని గెలుచుకున్నాయి. దాంతో మూడో ఆంగ్లో– మరాఠా యుద్ధం ముగిసింది. ఈ విజయంతో భారత ఉపఖండ యజమానులుగా బ్రిటి ష్‌వారు తమ స్థానాన్ని స్థిరపర్చుకున్నారు. పైగా, ఈ యుద్ధంతో పీష్వాల పాలనను సైనిక కమ్యూనిటీకి చెందిన మహర్‌లు ఖతం చేసినట్లుగా వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి.

శివాజీ అనంతరం మరాఠా సామ్రాజ్యాన్ని పీష్వాలు నడిపారు. సమతకు పట్టం కట్టిన శివాజీ పాలనకు భిన్నంగా పీష్వాలు బ్రాహ్మణిజం సంప్రదాయాలతో కులతత్వం అద్దారు. బ్రిటిష్‌ సైన్యం స్థానికులు, ఇంగ్లిష్‌ వాళ్లు రెండింటితో కూడి ఉండేది. ఎక్కువమంది భారతీయులే. రెండు జాతులకు సంబంధించిన సైనికులను కలిపి రూపొందించిన బెటాలియన్లు లేదా ప్లటూన్‌లు చాలా తక్కువ. కానీ ఇరు జాతుల సైనికులను కలిపి విశాల ప్రాతిపదికన బ్రిటిష్‌ సైన్యం అనేవారు. బ్రిటిష్‌ సైన్యంలో స్థానికులు ఎందుకు చేరారంటే ఇక్కడి పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటులో భాగమై ఉండవచ్చు లేదా జీవిక కోసం అయినా అయి ఉండవచ్చు.

మెహర్లను సైన్యంలో చేర్చుకోవడానికి పీష్వా యంత్రాంగం తిరస్కరించడంతో, మరాఠాలను అణచివేయాలని చూస్తున్న బ్రిటిష్‌ వారితో చేతులు కలపాలని మెహర్లు నిర్ణయించుకున్నట్లు ప్రస్తుతం కథనాలు చెబుతున్నాయి. కోరెగాం స్థూపంలో పేర్కొన్న మృత సైనికులలో 22 మంది మెహర్లే అన్న వాస్తవం దీనికి సమర్థనగా కనిపిస్తోంది. ఆనాడు కోరెగాంకు వెళ్లిన  సైనిక దళాల్లో ఎక్కువమంది మెహర్లే. బ్రిటిష్‌ వారు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యూహం పన్నారా? దీనిని చరిత్రకారులు అధ్యయనం చేయాల్సి ఉంది.

బీఆర్‌ అంబేడ్కర్‌ 1927 జనవరి 1న కోరెగాం స్మారకస్థూపాన్ని సందర్శించినప్పటి నుంచి, ఆ తర్వాత జరిగిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సులలో కూడా.. బ్రిటిష్‌ వారి తరఫున జరిగిన యుద్ధాల్లో అస్పృశ్యులే గెలిచారని ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ అంబేడ్కర్‌ కన్నా ముందు నుంచే దళితులు ఆ స్థూపాన్ని సందర్శించేవారు. కానీ దళితులు వీధుల్లోకి వచ్చి హింసాత్మక చర్యలకు పాల్పడటంతో కొత్త సంవత్సరం మరాఠాలు కొత్త యుద్ధం ప్రారంభించినట్లయింది. జేమ్స్‌ లియన్‌ శివాజీపై రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు మొదలెత్తినప్పటి నుంచి, దళిత ప్రజా సంఘాలు మహారాష్ట్రలో ప్రాధాన్యత సంతరించుకుంటూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో దళితులను కొట్టిన సంఘటన వారికి మరాఠాలపై అమిత ఆగ్రహం కలిగించింది. పైగా ఒక దళితుడి స్మారక స్థూపాన్ని ధ్వంసం చేయడంతో మహారాష్ట్రలో దళితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాను వధించిన మరాఠా పాలకుడు శంభాజీ దేహాన్ని ఎవరైనా తాకితే తీవ్రపరిణామాలు ఉంటాయని ఔరంగజేబ్‌ చేసిన హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా శంభాజీ అంత్యక్రియలను ఆ దళితుడు నిర్వహించాడు. దళితులు ఈ రెండు సంఘటనలలో తమ పాత్రకుగాను గర్వపడుతుంటారు. ఒకటి– మరాఠా పాలకుడి తరపున పాలించే పీష్వాలను ఓడించడం. రెండు– మరాఠాల పనుపున మొఘల్‌ రాజునే ధిక్కరించిన ఘటన. కాబట్టి ఇప్పుడు సమస్య సంక్లిష్టంగా తయారైంది.

దీని మొత్తం సారాంశం ఏమిటంటే, మహారాష్ట్ర ఇప్పుడు కులతత్వంతో ఉడికిపోతోంది. అస్పృశ్యతా నిరోధక చట్టాన్ని పలుచబారేలా చేసి, భూమిపై యాజ మాన్యం కలిగి ఉన్నప్పటికీ తమకు కూడా కోటా వర్తింపు చేయాలని మరాఠాలు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాల కోటాలో తమకూ వాటా కావాలంటున్న మరాఠాల డిమాండ్లతో దళితులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పుడు మరాఠాలు, దళితులు ఇద్దరూ కూడా ప్రస్తుత బీజేపీ పాలనను పీష్వా పాలనగానే చూస్తున్నారు. పైగా ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణుడు కూడా. వీటి మధ్య ఇతర వెనుకబడిన కులాలు నిరాశకు గురవుతున్నాయి.

మహారాష్ట్రలో దళితులు ఒక రాజకీయ బృందంగా రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు చెందిన పలు చీలిక బృందాలుగా చెల్లాచెదురైపోయారు. దళితులు సంఘటితమైతే అది రాష్ట్ర సామాజిక, ఆర్థిక వేదికపై నిస్సందేహంగా కొత్త రేఖను ఏర్పరుస్తుంది. దళితుల్లోని ఒక వర్గం ప్రయోజనాలను ఇది తటస్థపరుస్తుంది. ఉదా. హిందూత్వ వాదులతో పొత్తు కుదుర్చుకుని మొదట శివసేనతో కలిసిన దళితనేత రామ్‌దాస్‌ అథవాలే తరువాత బీజేపీతో చేతులు కలపడానికి దాన్ని వదిలిపెట్టేశారు.

తమ సంఖ్యాపరమైన బలాన్ని సంఘటితం చేసుకోవాలంటే దళితులు తమదైన రాజకీయ వేదికను ఏర్పర్చుకోవాలి. కానీ ఇది సాధ్యం కాకపోవడంతో అథవాలే మాత్రమే దళిత రాజకీయాలనుంచి లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త పరిణామం బీజేపీయేతర, శివసేనేతర కూటములను ఇంకా బలపరుస్తుంది. ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ తదుపరి ఎన్నికలకు ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం గురించి చర్చించింది కూడా.అయితే ఈ సానుకూల ఫలితాలు ఎలా ఉన్నా, చీలి కలు పేలికలుగా ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని దళితులు కొత్త సంవత్సరం తొలి రోజున మొదటిసారిగా తమ శక్తి ఏమిటో చూపించారు. ఈ విషయమై దళితుల అసంతృప్తిని చల్లార్చడం అంత సులభం కాదు.

కోరెగాంకు 3 కిలోమీటర్ల దూరంలోని వధుబద్ర క్‌లో గోవింద్‌ మెహర్‌ సమాధిని ధ్వంసం చేసి అగౌరవపర్చిన ఘటన పట్ల మీడియా మొదట్లో పరమ నిర్లక్ష్యం ప్రదర్శించింది. చివరకు కోరెగాంలో దళితులపై దాడులను కూడా పట్టించుకోకపోగా, ముంబై వంటి నగరాల్లో బంద్‌లు అనేవి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తాయని మీడియా చెప్పడంతో దళితులు కుపితులైపోయారు. మహారాష్ట్రలోని కుల నిర్మాణాల్లో భూకంపం వంటి పెను కదలిక చోటు చేసుకుంటోది కానీ దాని రాజకీయ ప్రభావాలను మాత్రం ఎవరూ సరిగా అర్థం చేసుకోవడం లేదు. దీని పట్లే దళితులు అయిష్టత ప్రకటిస్తున్నారు. వారి ఆగ్రహ ప్రదర్శన అర్థం చేసుకోదగినదే.


మహేశ్‌ విజాపుర్కర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు