మనిషిని మింగుతున్న ‘ఆటోమేషన్‌’

20 Jun, 2019 05:01 IST|Sakshi

కొత్త కోణం

యాంత్రీకరణ మనిషిని ఉత్పత్తికి దూరం చేస్తోంది. ఇది వ్యవసాయ రంగాన్ని మొట్టమొదటిగా కబళించింది. మట్టికీ మనిషికీ ఉన్న సంబంధాన్ని బద్దలు కొట్టింది. గత రెండు వేల ఏళ్లుగా సమాజంలో సంభవించని పరిణామాలు గత ముప్ఫై, నలభై ఏళ్లలో అనూహ్యంగా చోటు చేసుకున్నాయి. ఒకే ఒక్క ట్రాక్టరు వ్యవసాయరంగంలో కొన్ని వందలమంది జీవనోపాధిని మింగేసింది. వ్యవసాయంలో జరిగే అతి చిన్న పనులను కూడా మనిషితో సంబంధం లేని యంత్రాలు చేస్తున్నాయి. నేడు ఆటోమేషన్‌ అనేది లక్షలాదిమందికి నిజంగానే పనిలేకుండా చేస్తోంది. ప్రజలకు తమ కాళ్లమీద తాము నిలబడి బతికే పరిస్థితిని కల్పించడం, ఉపాధిని ఏర్పర్చడం.. వంద సంక్షేమ చర్యలకంటే మిన్నగా మేలు చేకూర్చుతుంది. మనిషి ప్రగతి, భద్రత, రక్షణ, సంతోషం కేంద్ర బిందువుగా సమాజం అభివృద్ధి చెందడానికి ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలవ్వాలి.

‘‘ప్రపంచంలో అనూహ్యమైన పరిణా మాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం కొనసా గుతున్న ఆర్థిక అసమానతలు మరింత పెరిగి, ఒక అసాధారణమైన ధనికవర్గం ఏర్పడబోతున్నది. రోజురోజుకు శాస్త్ర, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులవల్ల మనిషి శరీరం లోని జీన్స్‌లో కూడా మార్పులు తీసుకొచ్చి, దీర్ఘకాలం జీవించే విధానాలను కనుగొనబోతున్నారు. దాని వల్ల ధనవంతులకే పరిమితమైన ఒక అసాధారణమైన మానవజాతి ఏర్పడనుంది. సమాజంలో దారిద్య్రం అనుభవిస్తున్న వాళ్లు రక్షణ, భద్రత కరువై ప్రపంచపటం నుంచి కనుమరుగవుతారు.’’

ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ సామాజిక, ఆర్థిక అసమా నతలతో కూడిన భవిష్యత్‌ చిత్రపటాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన చిట్ట చివరి వ్యాఖ్యానమిది. ప్రపంచ పరిణామాలపై స్టీఫెన్‌ హాకింగ్‌ జరిపిన పరిశోధనలు అనన్య సామాన్యమైనవి. ‘సుదీర్ఘ ప్రశ్న, సంక్షిప్త సమాధా నాలు’ అనే పుస్తకంలో ఈ విశ్లేషణ చేశారు. ఈ పుస్తకంలో మానవ సమా జాన్ని అతలాకుతలం చేసే ఆర్థిక అసమానతలపై స్పష్టమైన, విలువైన సమాచారాన్ని వెల్లడించారు. దాని ఫలితంగా ఆవిష్కృతమయ్యే ఒక అసాధారణ మానవజాతి గురించి, అదేవిధంగా ఆకలితో, అభద్రతతో కుంగికృశించిపోయే మరొక దీనజాతి గురించి కళ్లకు కట్టినట్లు చూపారు. 

ఇది వినడానికి కొంత బాధగానే ఉన్నప్పటికీ, ప్రపంచ పరి ణామాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి చెప్పిన అక్షర సత్యాలివి. నాడు కారల్‌ మార్క్స్‌ పెట్టుబడి రూపంలో పెరుగుతున్న అసమానతల గురించి చెప్పిననాడు విమర్శించిన వారున్నారు. మార్క్సిసు ్ట మహానా యకుల సిద్ధాంతాలతో, భావజాలంతో అంతగా సంబంధంలేని ప్రపంచ మేధావి స్టీఫెన్‌ హాకింగ్‌ వ్యాఖ్యలు సమాజానికి కనువిప్పు అవుతాయి. మార్క్సిస్టు భావజాలం పనికిరాదని కొట్టిపడేస్తున్న వాళ్లు, ఇటీవల పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తొలగించే ఆలోచన చేయలేకపోతున్నారు. ఆర్థిక అసమానతలు భవిష్యత్తులో ప్రపంచాన్ని ధ్వంసం చేయగలవని చెప్పిన స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరిక మన దేశానికి కూడా వర్తిస్తుంది. ఇందుకు మనదేశంలో జరుగుతున్న పరిణామాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా ధనిక, పేదల మధ్య అంబరాల అగాధాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తొంబై శాతం ప్రజలు కటిక దారి ద్య్రాన్ని అనుభవిస్తుంటే, కేవలం పదిశాతం మంది బొక్కసాల్లో మానవ జాతి సంపద మొత్తం బందీ అయింది. సమాజంలోని అత్యధికమంది ప్రజలు నిలువనీడలేక, సెంటు భూమి లేక, సహజవనరులపై ఎలాంటి హక్కులూ లేక, కనీస ఉపాధి కరువై, నిజమైన విద్య, నిలకడ కలిగిన ఉపాధి, జీవన భద్రత, సామాజిక సంరక్షణలకు దూరంగా బతుకీడు స్తున్నారు. ఓవైపు ప్రజల జీవితం నిత్య దారిద్య్రంతో కొట్టుమిట్టాడు తుంటే, మరోవైపు మానవ ప్రమేయమే లేని, మానవజాతిని ఉత్పాదక రంగం నుంచి తరిమికొట్టే సరికొత్త అభివృద్ధి నమూనా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

గత మూడు, నాలుగు దశాబ్దాలుగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, యాంత్రీకరణ మనిషిని ఉత్పత్తికి దూరం చేస్తోంది. ఇదే వ్యవసాయ రంగాన్ని మొట్టమొదటిగా కబళించింది. మట్టికీ మనిషికీ ఉన్న సంబంధాన్ని బద్దలు కొట్టింది. గత రెండు వేల ఏళ్లుగా జరగని పరి ణామాలు గత ముప్ఫై, నలభై ఏళ్లలో జరిగాయి. మానవ జాతిని ఇంతకాలం నిలబెట్టిన వ్యవసాయం కుదేలైంది. యాంత్రీకరణ, ఆధుని కీకరణ ప్రభావంతో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది   మంది ఉపాధిని కోల్పోయారు. 1977–78లో 32వ సర్వే ప్రకారం 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే, 2017–18లో జరిపిన సర్వే ప్రకారం వీరు 55 శాతానికి పడిపోయారు.

వ్యవసాయ సంక్షోభంతో తొట్టతొలి బాధితులు మహిళలేనన్నది సత్యం. నిజానికి ఒకే ఒక్క ట్రాక్టరు కొన్ని వందలమంది జీవనోపాధిని మింగేసింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. ట్రాక్టర్‌ ద్వారా కోత కోయడం, కుప్ప చేయడం, గింజలు రాల్చడం నుంచి పంట రవాణావరకు మనిషితో సంబంధం లేని యంత్రాలు చేస్తున్నాయి. వివిధ రకాల పనులు చేసే రైతులు, కూలీలను పనినుంచి పారదోలాయి. దానిపై ఆధారపడిన మనుషులు కనీసం 2, 3 నెలలపాటు జీవనోపాధిని కోల్పోవాల్సిన దుర్భరస్థితి. మొత్తం వ్యవ   సాయ రంగం నుంచి రైతాంగం నిష్క్రమించాల్సిన స్థితి దాపురించింది.

వ్యవసాయ రంగం తర్వాత యాంత్రీకరణ చేదు ఫలితాలను చవి చూసిన రంగం నిర్మాణ రంగం. నిర్మాణ రంగంలో ఎంతోమంది పని     చేస్తున్నట్టు కనిపించినా అక్కడ మనుషుల ప్రమేయం బాగా తగ్గిపోయిన మాట వాస్తవం. గత నలభై ఏళ్లలో నిర్మాణ రంగం పెరిగిన స్థాయిలో కూలీల వినియోగం జరగలేదు. ముఖ్యంగా సిమెంటు, ఇసుక మిక్సింగ్‌ చేసే ప్రక్రియ తదితర పనులన్నింటికీ యంత్రాలనే వినియో గిస్తున్నారు. దీని ఫలితంగా జీవనోపాధిని కోల్పోతున్న వేలాదిమంది జీవితం అగమ్య గోచరంగా తయారైంది. ఉన్నచోట పని దొరకక ఊళ్లకు ఊళ్లు ఖాళీచేసి వలసబాట పడుతున్న పేద బతుకులకు అక్కడ కూడా జీవనో  పాధి దొరకక దిక్కుతోచని స్థితి. బతుకు భారమైన ప్రజలకు కనీసం ఒకపూట తిండి పెట్టగలిగే జీవన భద్రత కోసం ఉపాధి హామీ పథకం తెచ్చారు.

అయితే ఇది కూడా అవినీతికి నెలవుగా మారిపోయింది. అయితే ఇది కూడా శాశ్వత పరిష్కారం కాదు. ప్రజలకు తమ కాళ్లమీద తాము నిలబడి బతికే పరిస్థితిని కల్పించాలి. పెన్షన్లు, రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాలు, ఆకలితో అలమటించకుండా ఒక భరోసాను ఇస్తున్నాయి. ఇవి కూడా పేదలను చావకుండా బతికిస్తాయ్‌గానీ తమ కాళ్లమీద తాము నిలబడే పరిస్థితిని కల్పించవు. రెండోవైపు, ఇప్పు డిప్పుడే శ్రామిక రంగంలో అడుగుపెడుతున్న యువత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలోలాగా సాంప్రదాయకంగా వచ్చే ఆఫీసు ఉద్యోగాలు, నైపుణ్యం లేని పనుల స్థానంలో కంప్యూటర్లు, యాంత్రీ కరణ, ఆధునికీకరణ ప్రవేశించి సాధారణ డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన లక్షలాదిమంది అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నారు.

కంప్యూటర్‌ రంగం మొదటగా ఎంతోమందికి ఆశాకిరణం లాగా కనిపించింది. అది కూడా మసక బారుతున్నది. ఆటోమేషన్‌ ఈరోజు ఒక భూతంలా వెంటాడుతున్నది. ప్రతిరోజూ కొన్ని పదులకొద్దీ ఉద్యోగులు కంప్యూటర్‌ రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు. దేశంలోని ఉత్పత్తిరం గంలో వచ్చే యాంత్రీకరణ వల్ల నో వేకెన్సీ బోర్డులు పెరుగుతున్నాయి. సర్వీసు రంగం కూడా క్రమంగా స్తబ్దతకు గురవుతోంది. పైగా, దేశంలో  శ్రమించగలిగే శక్తి ఉన్న యువతలో నైపుణ్యం కలిగిన వాళ్ల సంఖ్య చాలా అత్యల్పం. మనకంటే చిన్న దేశమైన దక్షిణ కొరియాలో నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య 90, జపాన్‌ 80, జర్మనీ 75, బ్రిటన్‌ 68, అమెరికా 52 శాతంగా ఉన్నాయి. మన దేశంలో శ్రమ చేయగలిగే శక్తి ఉన్నవాళ్లు ప్రపం చంలోని అన్ని దేశాలతో పోలిస్తే 28 శాతం ఉన్నారు. కానీ నైపుణ్యం స్థాయి మాత్రం కేవలం 4 శాతం మాత్రమే. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న సమయంలో మన యువత కనీస నైపుణ్యం దరిదాపుల్లో కూడా లేదు. ఇది నిజానికి అసలు సమస్య.

యువతలో వృత్తి నైపుణ్యాలు లేకపోవడానికి మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలే కారణం. మనం విద్య అంటే, కేవలం అక్షరాస్యత అని భ్రమిస్తున్నాం. మన పూర్వీకులు కోటి విద్యలు కూటికొరకే అన్నారు. అంటే కోటి చదువులు అని అర్థం కాదు. కోటి పనులు, అంటే ఏ పనైనా తిండి కొరకే అన్న అర్థంలో వాడారు. ఈరోజు మన విద్యార్థులు ఎన్ని డిగ్రీలు పొందినా అందులో వృత్తి నైపుణ్యానికి అర్థం లేదు. అందుకే మన నైపుణ్యం శాతం నాలుగు దాటలేదు. దీనిని సరిజేసుకోకపోతే గ్రామాల్లో, పట్టణాల్లో వృత్తులకు, శ్రమకు దూరమవుతున్న తల్లిదం డ్రులు, వారి వెనుకనే నైపుణ్యంలేని డిగ్రీలు పట్టుకొని మన యువత తయారవుతూనే ఉంటారు. ఈ పరిస్థితులను ఉపయోగించుకొని కొద్ది మంది పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు మొత్తం దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి కొద్దికాలంలోనే వేలకోట్లకు అధిపతులవుతున్నారు.

వాళ్లకుగానీ వాళ్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వా లకు గానీ దేశ సంపద పెరుగుదలే గీటురాయి. కానీ కోట్లాదిమంది ప్రజలు శ్రమకు, వనరులకు, ఆస్తులకు, ఆదాయాలకు దూరమై పెన్ష న్లతో, ఇతర రీతిలో వచ్చే డబ్బులతో పరాధీనమైన బతుకులు వెళ్లదీస్తు న్నారు. ఈ పరిణామం క్రమంగా ఆస్తులు, ఆదాయాలు, వనరులు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానంలో మనుషుల ప్రమేయం లేకుండా సాగే ఒక కేంద్రీకృతమైన అభివృద్ధివైపు పయనిస్తున్నది. కోట్లాదిమంది మను షులు ఆకలేస్తే, దాహమేస్తే ప్రభుత్వాలు, కొన్ని దాతృత్వ సంస్థలవైపు నోరెళ్లబెట్టి చూసే పరిస్థితి రానున్నది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు రోజురోజుకూ ఎక్కువవుతు న్నాయి. ఈ పరిస్థితులను పెంచి పోషి స్తున్నవాళ్లు ఎలాగూ దీనిని సరి దిద్దలేరు. ప్రజలే ఈ పరిస్థితుల గురించి, ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడే పరిస్థితిని ఎదుర్కోవాలి. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, పెట్టుబడులు కాకుండా.. మనిషి ప్రగతి, భద్రత, రక్షణ, సంతోషం కేంద్ర బిందువుగా సమాజం అభివృద్ధి చెందడానికి ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలవ్వాలి.

వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు

మొబైల్‌ : 81063 22077

>
మరిన్ని వార్తలు