బడుగులకు ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమిటి?

6 Feb, 2020 00:16 IST|Sakshi

కొత్త కోణం 

బ్రిటిష్‌వారి తోడ్పాటుతో దళితులకు, బలహీనవర్గాలకు అంబేడ్కర్‌ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్, విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు రూపొందించారు. కానీ 70 ఏళ్ల తర్వాత కూడా నేటి పాలకుల విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న వెనుకబాటుతనాన్ని ఎంత మాత్రం తొలగించే స్థితిలో లేవు. ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువులకు గత నాలుగేళ్ళుగా రెండు కోట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. 2 కోట్ల రూపాయల మొత్తంతో ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటారో ఆ బడ్జెట్‌ రూపొందించిన వారే జవాబు చెప్పాలి. ఇది ముమ్మాటికీ దళిత, బలహీన వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దళితులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను కాలరాయడమే తప్ప మరొకటి కాదు. కానీ ఇవే ప్రభుత్వాలు ధనిక రైతులకు, పారిశ్రామిక వేత్తలకు, వేలకోట్ల అధిపతులకు ఉపకరించే ఎన్నో సబ్సిడీలను అందిస్తూండటం గమనార్హం.

‘‘సామాజిక అన్యాయం, ఇతర దోపిడీ విధానాల నుంచి బలహీన వర్గాలను ప్రత్యేకించి షెడ్యూల్డ్‌ కులాలను, తెగలను రక్షించడానికీ, విద్య, ఆర్థిక రంగాల్లో వారిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అందుకుగాను ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి’’ అంటూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌–46 నిర్దేశిస్తున్నది. భారత రాజ్యాంగంలోని నాలుగో భాగమైన ఆదేశిక సూత్రాలలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలలో ఈ వర్గాల వారిని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

దీనర్థం సమాజ ప్రగతికీ, సమాజ పురోగమనానికీ వేసే ప్రతి అడుగులో అట్టడుగున పడినలిగే వర్గం ఒకటుంటుందని గమనంతో వ్యవహరించడం ప్రభుత్వాల బాధ్యత అని నొక్కి చెప్పడమే. అదే విధంగా ఆర్టికల్‌–38 కూడా మరొక రకమైన ఆదేశాలను ఇచ్చింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని సాధించడానికి అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు కృషిచేయాలని, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలని కూడా ఆర్టికల్‌ – 38 ఆదేశిస్తున్నది. అంటే ప్రాంతాల మధ్య అభివృద్ధి కార్యక్రమాల్లో నిధుల కేటాయింపుల్లో వ్యత్యాసం చూపకూడదని దాని అర్థం. ఈ అంశాల్లో ఎటువంటి వివక్షా తగదని చెప్పడమే.


అయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల మధ్య వ్యత్యాసాలను పెంచుతున్నాయ్‌ కానీ తగ్గించడం లేదు. ముఖ్యంగా బడ్జెట్‌ కేటాయింపుల్లో దీని ప్రభావం స్పష్టంగా కనపడుతున్నది. ప్రభుత్వాలకు నాయకత్వం వహించే నాయకులు మాట్లాడే మాటలకన్నా, వారు బడ్జెట్‌ కేటాయింపుల్లో చూపెడుతున్న విషయాలు అసలు అక్షరసత్యాలు. ఎన్ని రకాల మాటలు మాట్లాడినా చివరకు వారి చిత్తశుద్ధి తేలేది బడ్జెట్‌ వడ్డనలోనే అనేది సత్యం. ముందుగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికీ, వారి అభివృద్ధికీ కేటాయించిన నిధులను పరిశీలిస్తే, ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఈ రెండు వర్గాలకు కూడా విద్యాభివృద్ధిపైనే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే వాటిపైన పెడుతున్న ఖర్చును చూస్తే మనకు అసలు విషయం తెలుస్తుంది. ఇందులో పెద్ద కేటాయింపులు పోస్ట్‌–మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లే. పదవ తరగతిపైన విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరూ ఈ స్కాలర్‌షిప్‌ల వల్లనే చదువగలుగుతున్నారు. ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కేటాయింపులు చూస్తే, 2017–18లో రూ. 3,414 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20లో రూ. 2,926.82 కోట్లు కేటాయించారు.

అది 2020–21 సంవత్సరానికి వచ్చేసరికి రూ. 2,987 కోట్లు కేటాయిం చారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీల సంక్షేమం కోసం ప్రత్యేకించి కేటాయించింది ఈ ఆర్థిక సంవత్సరం రూ. 7,154 కోట్లు. ఇందులో రూ. 2,987 కోట్లు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లే. అయితే ఈ కేటాయింపులు ఇప్పుడు ఎస్సీ కుటుంబాల్లోని విద్యార్థుల విద్యావకాశాలను  ఏవిధంగానూ తీర్చలేవు. అందువల్ల రాష్ట్రప్రభుత్వాల మీద భారం పడుతున్నది. దీనితోపాటు, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయె¯Œ్స ప్రభుత్వం, రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లు ప్రవేశపెట్టడం వల్ల ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరిశోధక విద్యనభ్యసించారు.

కానీ గత కొన్నేళ్లుగా కేటాయింపులు బాగా తగ్గిపోయాయి. 2019–20లో రూ.360 కోట్లు ఉంటే, ప్రస్తుత సంవత్సరం రూ. 300 కోట్లకు తగ్గించారు. దీనివల్ల రీసెర్చ్‌ వైపు వెళ్లడానికి ఇష్టపడే విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. విదేశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా ఎటువంటి ప్రోత్సాహం లేదు. గత సంవత్సరం రూ. 20 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం అదే అంకెను యథావిధిగా  కొనసాగించారు. 2018–19లో దీనికోసం రూ. 15 కోట్లు కేటాయించి రూ. 5.97 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్సీలలోని బాల బాలికల హాస్టల్స్‌ నిర్మాణం, నిర్వహణకు అందించే మొత్తాలు కూడా ఆశ్చర్యకరంగా తగ్గిపోతున్నాయి. 2017–18 సంవత్సరంలో రూ. 74.91 కోట్లు ఖర్చు చేస్తే, 2018–19లో రూ. 160.5 కోట్లు కేటాయించి దానిని రూ. 36.56 కోట్లకు కుదించి ఖర్చు చేయడం ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమో అర్థం అవుతుంది.

 
ఈ సంవత్సరం బడ్జెట్‌ ప్రసంగంలో ఒక ముఖ్యమైన వ్యాఖ్యను మనం చూశాం. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలలో పారిశుధ్య కార్మికులను ఇక వినియోగించేది లేదని ప్రకటించారు. కానీ అందుకోసం ఆమె ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు. పదిహేనేళ్ళ క్రితం పారిశుద్ధ్య కార్మికుల వ్యవస్థను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. కానీ దాని అమలు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఇంకా ఒక లక్ష మంది వరకు మాన్యువల్‌ స్కావెంజర్స్‌ ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ ఆర్థికమంత్రి ప్రకటన నిజం కావాలనుకుంటే అందుకు వారి పునరావాసానికి తగు చర్యలు తీసుకోవాలి. తగిన కార్యక్రమాలు రూపొం దించాలి. అందుకు గాను బడ్జెట్‌ కావాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం గత కొంతకాలంగా చేస్తోన్న కేటాయింపులు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. లక్ష మందికి పునరావాసం కల్పించడానికి దాదాపు రూ. 220 కోట్లు కావాలి. కానీ ఈ సంవత్సరం కేటాయిం చింది రూ. 110 కోట్లు మాత్రమే.

ఎస్టీ విద్యార్థులు కళాశాల విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించడానికి ఇస్తున్న స్కాలర్‌షిప్‌ కింద 2019–20లో రూ. 19.5 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ.8 కోట్లకు కుదించారు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఎస్టీలకు గత సంవత్సరం రూ. 440 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత సంవత్సరం దానిని రూ. 400 కోట్లకు కుదించారు. ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు కూడా 1,826 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు కేటాయించి చేతులు దులుపుకున్నారు. మొత్తం ఆదివాసీల విద్య కోసం గత సంవత్సరం రూ. 2,266 కోట్లు ఉంటే ఈ సంవత్సరం నామమాత్రంగా రూ. 2,300 కోట్లకు కోత కోశారు. ఎస్టీ విద్యార్థుల విదేశాల చదువులకు గత నాలుగేళ్ళుగా రూ.2 కోట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. 2 కోట్ల రూపాయల మొత్తంతో ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటారో ఆ బడ్జెట్‌ రూపొందించిన వారే జవాబు చెప్పాలి. ఒక్కొక్క కోర్సుకి కనీసం 20 నుంచి 25 లక్షల ఫీజు ఉంటుందని అంచనా. ఇలా ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడంలేదు.

 ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి కేంద్రం అందించే నిధుల దగ్గర ఖాళీస్థలం కనిపించడం చూస్తే ఈ ప్రభుత్వ వనవాసి కళ్యాణం ఎంత అద్భుతంగా ఉందో అర్థం అవుతుంది. హిందువుల సెంటిమెంట్‌తో రాజకీయంగా బలపడాలని చూస్తున్న ప్రభుత్వం, వారిపట్ల చూపుతున్న శ్రద్ధ చాలా నిరాశను కలుగజేస్తున్నది. జాతీయ స్కాలర్‌షిప్‌ల కేటాయింపులు అంటే రీసెర్చ్‌ స్కాలర్స్‌ కోసం గత సంవత్సరం రూ. 70 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 52 కోట్ల 50 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ఇటీవల చేర్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాటా కూడా ఉంది. బీసీల విదేశీ చదువులకోసం గత సంవత్సరం రూ. 26 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 35 కోట్లకు పెంచారు. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావించిన పథకాలలో పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్, విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చొరవతో స్వాతంత్య్రానికి ముందే 1944లో ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లోనే అంబేడ్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంతో సంప్రదించి ఇటువంటి పథకాలను రూపొందించారు.

దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఎంత మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న వెనుకబాటుతనాన్ని తొలగించే స్థితిలో లేవు. కానీ ఇవే ప్రభుత్వాలు ధనిక రైతులకు పారిశ్రామిక వేత్తలకు, వేలకోట్ల అధిపతులకు ఉపకరించే ఎన్నో సబ్సిడీలను అందిస్తూండటం గమనార్హం. ఇప్పటికీ 40 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదంటే, హిందువుల పట్ల, హిందూ సెంటిమెంట్‌తో రాజకీయాలు నడుపుతోన్న పార్టీకీ, ప్రభుత్వానికీ ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు రాజ్యాంగంలో పేర్కొన్న ఎన్నో విషయాలను విస్మరిస్తుంటే ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాలను కనీసం పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తినికానీ, రాజ్యాంగబద్ధ పాలనను కానీ అనుసరిస్తున్నట్టుగా భావించలేం. ఇది ముమ్మాటికీ దళిత, బలహీన వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దళితులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను కాలరాయడమే తప్ప మరొకటి కాదు.


మల్లెపల్లి లక్ష్మయ్య  
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077 

మరిన్ని వార్తలు