సార్వత్రిక వైద్యసేవలే విరుగుడు

9 Apr, 2020 00:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొత్త కోణం

మనిషికి శారీరక శక్తి ఎలాగో, సమాజానికి ఒక శక్తి అవసరం. ఆ సామాజిక సమైక్య శక్తి లోపమే ఈ రోజు సామూహిక భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. కరోనాతో అగ్రరాజ్యమైన అమెరికా తల్లడిల్లిపోతుంటే ప్రపంచ చిత్రపటంలో అతి చిన్న దేశమైన క్యూబా మాత్రం అమెరికా పక్కనే ఉండి కూడా తట్టుకొని నిలబడింది. ఉత్పత్తితో ముడిపడి ఉన్న లాభంకన్నా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడటం తన బాధ్యతగా క్యూబా ప్రభుత్వం చేపట్టి గత కొన్ని దశాబ్దాలుగా అద్భుతాలు చేస్తోంది. క్యూబాలాగా ఆలోచించే అవకాశం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉంది. వైద్య రంగం మీద శ్రద్ధ పెడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ క్యూబా లాంటి ఒక కార్యాచరణ పథకం ఆలోచిస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తారనడంలో సందేహం లేదు.

ఒక అరవై ఏళ్ల ముసలి తల్లి గత పది సంవత్సరాలుగా కోల్‌కతాలోని ఒక వీధిలో నడవలేని స్థితిలో వీల్‌ చెయిర్‌లో కూర్చుని, అక్కడ పనిచేసే రిక్షా కార్మికులు, ఇతర పనివాళ్లు వేసే డబ్బులతో, ఎవరైనా తినగా మిగిలిన తిండి పెడితే తిని జీవనం కొనసాగిస్తోంది. కానీ ఒక్కసారిగా ఆమె నెత్తిన పిడుగుపడినట్టు, ఈ ప్రపంచం మొత్తాన్ని కారుచీకటి ఆవహిం చినట్టు రోజూ తనకై మహమ్మారి కరోనా ఆ వృద్ధురాలు నివసించే వీధినీ నిర్మానుష్యంగా మార్చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆ వృద్ధు రాలు సైతం ఇప్పుడు అక్కడ ఎవరికీ కనిపించడం లేదు. ఎక్కడి కెళ్లిందో తెలియదు. కూలీ చేసుకునే వ్యక్తి ఉన్న ఉపాధి కోల్పోయి, వందలమైళ్ల దూరంలోని సొంతూరు చేరుకునేందుకు రవాణా సదు పాయం లేక కాలినడకన పయనమయ్యాడు. ఒంటరిగా కాదు, నడవ లేని తన తల్లిని చక్రాల బండిలో కూర్చోబెట్టుకుని రోజుకి పాతిక కిలో మీటర్ల దూరం తోసుకుంటూ 600 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు.

ఉత్తర భారతంలోని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను వెంట బెట్టుకుని వందల మైళ్లు నడుస్తూ వెళుతుంటే పసిబిడ్డలు నడవలేక నడవలేక కుంటుతూ ఎక్కడికెళుతున్నామో, ఎందుకెళుతున్నామో తెలియక ఏడు స్తూనే అమ్మని అనుసరిస్తోన్న హృదయవిదారక వీడియో అంతా చూసే ఉంటారు. ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి కోట్లాదిమంది కూలీ నాలీ బతుకులు చెల్లాచెదురైపోయాయి. కరోనాని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలకు లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదు. దీనిని ఎవరైనా సమర్థించాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం ప్రభుత్వాధినేతలను, రాజకీయ పార్టీ లను విమర్శించాల్సిన సమయం కాదు. జాతి మొత్తం కలిసి కట్టుగా మహమ్మారి కరోనాను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలి. అందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు కూడా సహకరిస్తు న్నారు. అయితే కరోనా తెచ్చిన ఈ ఘోర సంకటం ప్రస్తుతం కొన్ని సమస్యలను మనముందు పెట్టింది. వాటిని మనం ఇప్పటికే అధిగ మించి ఉన్నట్లయితే, ఈరోజు జాతి ఇంతగా కలవర పడాల్సి ఉండేది కాదు. గుండెధైర్యంతో కరోనాను ఎదుర్కోగలిగే వాళ్లం. కానీ, ప్రస్తుతం ఇప్పుడు దేశం ఆ స్థితిలో లేదు. 

మనిషికి రోగ నిరోధక శక్తి కోసం మనం మాట్లాడుతున్నాం. కానీ, మనిషి సంఘజీవి. వేలాదిమంది, కోట్లాదిమంది కలిస్తే అది ఒక సమాజం. అది ఒక దేశం. ఈరోజు మనిషికి రోగ నిరోధక శక్తి కావాల్సి నట్టే సమాజానికి కూడా రోగ నిరోధక శక్తి కావాలి. సమాజానికి కావాల్సింది శారీరక రోగ నిరోధక శక్తి కాదు. సమాజం ఏ విపత్తుల నైనా, ప్రమాదాలనైనా ఎదుర్కోవడానికి కావాల్సిన సామాజిక శక్తి కావాలి. అది ఇప్పుడు మన దేశానికి లేదు. ఆ సామాజిక సమైక్య శక్తి లోపమే ఈరోజు ప్రభుత్వాల్లో, ప్రజల్లో సామూహిక భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. కరోనా నుంచి బయటపడిన తర్వాత ఒక సమగ్రమైన, దీర్ఘకాలికమైన దేశ ప్రగతి ప్రణాళిక అవసరం. అందులో మొదటిది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన ఆరోగ్య వ్యవస్థ. ఈ రోజు వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచానికే తలమానికంగా నిలుస్తున్న దేశం క్యూబా. క్యూబా సోషలిస్టు దేశంగా అవతరించిన నాటినుంచే ఒక సమగ్రమైన ఆరోగ్య విధానాన్ని అమలు చేయడానికి పూను కున్నది. ‘ఆరోగ్యం కూడా మానవ హక్కులలో భాగమే.

ఉత్ప త్తితో ముడిపడి ఉన్న లాభంకన్నా క్యూబా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత’ అని 1959లోనే రాసుకున్న రాజ్యాంగంలో పేర్కొన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా, పర్వత ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. వందలాదిమంది డాక్టర్లను పర్వత ప్రాంతాలకు, తీర ప్రాంతాలకు పంపించారు. విప్లవం విజ యవంతం అయిన ఐదారేళ్లలోనే ఈ విజయాన్ని సాధించారు. ఆరో గ్యాన్ని, వ్యక్తి గత సమస్యగా కాక ప్రజలందరి సమష్టి అవసరంగా ప్రభుత్వం భావించింది. దీని ఫలితంగా నిర్దిష్ట మైన ప్రాంతానికి, జనా భాకు ఒక డాక్టర్‌ను నియమించింది. ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థకు రూప కల్పన చేసింది. మొదటి దానిని లావ్టా పట్టణంలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టి, తదనంతరం క్యూబా అంతటికీ విస్తరింపజేశారు. ప్రతి 150 కుటుంబాలకు ఒక ఫ్యామిలీ డాక్టర్, ఒక నర్స్‌ని నియమించారు. దానిని డాక్టర్స్‌–నర్స్‌ పథకంగా పిలుస్తారు. రోగాలు వస్తే వైద్యం చేయడం మాత్రమే వీరి బాధ్యత కాదు.

ప్రజలు రోగాల బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టేలా వారు ప్రజలను చైతన్య వంతం చేశారు. ఈ నూటయాభై కుటుంబాల వివరాలు వీరివద్ద ఉంటాయి. వీరిలో ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అవస రమైన చికిత్స అందిస్తారు. ఒకవేళ ఇంకా అదనంగా వైద్యం కావాల్సి వస్తే వారికి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఉన్న పాలీ క్లినిక్‌కు వాళ్లే తీసు కెళతారు. ఈ విధానంలో ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ నిర్మాణా త్మక బాధ్యత కోసం లాటిన్‌ అమెరికా మెడికల్‌ స్కూల్స్‌ స్థాపించి దాదాపు 72 దేశాలకు చెందిన 30 వేల మందికి పైగా డాక్టర్లను అందిం చింది. ఇందుకుగానూ క్యూబా బడ్జెట్‌లో భారీ కేటాయింపులను చేస్తు న్నది. ఆ దేశ జీడీపీలో ఆరోగ్యానికి 10.57 శాతం నిధులను కేటాయి స్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవల కరోనాతో పొరుగుదేశం అగ్ర రాజ్యమైన అమెరికా తల్లడిల్లిపోతుంటే ప్రపంచ చిత్రపటంలో అతి చిన్న దేశమైన క్యూబా మాత్రం తట్టుకొని నిలబడింది. ఇప్పటివరకు 320 కరోనా కేసులు నమోదైతే అందులో 15 మంది కోలుకున్నారు. 8 మంది మాత్రమే మరణించారు.

అంతేగాకుండా ఇరాన్, ఇటలీ లాంటి దేశాలకు వందలాది మంది డాక్టర్లను క్యూబా పంపగలిగింది. ఇది ఒక నమూనా మాత్రమే. మన పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అది చిన్న దేశం కాబట్టి అట్లా చేయగలిగిందంటూ తప్పించుకునే ధోరణి మనకు అలవాటు. కానీ మన రాష్ట్రాలు కూడా చిన్నవే. వైద్యంలో రాష్ట్రాలు ఎంతైనా చేయవచ్చు. దానికి ఏ అడ్డంకులూ ఉండవు. వైద్య కళాశాలల అనుమతి లాంటి సమస్యలు ఉన్నా, వాటిని అధిగమించడానికి మార్గాలుంటాయి. ఏపీ, తెలంగాణ సీఎంలు కనుక క్యూబా లాంటి ఒక కార్యాచరణ పథకం ఆలోచిస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తా రనడంలో సందేహం లేదు. లాక్‌డౌన్‌ తర్వాత మనం ఎదుర్కొన్న మరొక ముఖ్యమైన సమస్య ఉపాధి లేని వారికి ఆహారం సమస్య. వలస కూలీలకు నివాస సమస్య. ఉపాధి సమస్య. ఇది చాలా ముఖ్యమైన సవాల్‌. మన దేశంలో మూడు కోట్లమంది వలస కార్మికులున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత వీరంతా నెత్తిమీద తట్టాబుట్టా పెట్టుకొని పారిపోవాల్సి వచ్చింది. దీనితో సోషల్‌ డిస్టెన్స్‌ అనే నినాదం బుట్టదాఖలైంది.

వేలాదిమంది ఒకే దగ్గర గుమికూడి, రవాణా సౌకర్యాలు లేక రోడ్ల మీద చీమల పుట్టల్లా కుప్పలు కుప్పలుగా జనం నిండిపోతే ఇక సోషల్‌ డిస్టెన్స్‌కి అర్థం పరమార్థం ఏమిటో నాకర్థం కాలేదు. ఇన్ని కోట్లమంది ప్రజలు వలస పోవడానికి గ్రామాల్లో ఉపాధి కరువైపోవడమే కారణం. నగరీకరణ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. పనులు వెతుక్కుంటూ ప్రతి ఒక్కరూ నగరాలకు బయలుదేరారు. గత ఇరవై ఏళ్లలో ప్రతి నగరం, పట్టణ జనాభా రెండింతలు, మూడింతలు అయ్యాయి. అభి వృద్ధిగానీ, విద్య, వైద్య సౌకర్యంగానీ ఒకే దగ్గర కేంద్రీకృతం కావ డంవల్ల నగరాలు జన సముద్రాలుగా తయారయ్యాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడానికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, వ్యవసాయాధారిత పరిశ్రమ లను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నోసార్లు మాట్లాడారు. అదే విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైతే పట్టణీకరణ పెరిగి భారంగా మారిందో, అక్కడ ఇకమీదట భవన నిర్మాణాలకు అనుమతిని ఇవ్వకూడదు.

అదే విధంగా ప్రజలను వలసలు కాకుండా ఉన్న ఊళ్లో కనీసం కాలినడకన చేరుకునే దూరంలో ఉండే విధంగా పనులు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.  ప్రభుత్వం బడ్జెట్‌ను మించిన ధనం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పోగుపడి ఉంది.  అభివృద్ధిని వికేంద్రీ కరించేసి అన్ని రకాల ఉత్పత్తులకు సంబం ధించిన పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపార స్తులు ముందుకు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వనరులకు తగ్గట్టుగా పరిశ్రమలు పెడితే, వారికి లాభాలకు లాభాలూ వస్తాయి. స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది. కరోనా కల్లోలం ముగిసిన అనంతరమైనా ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలైన విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక స్వయం సమృద్ధి వంటి అంశాలను చాలా ముఖ్యమైనవిగా భావించాలని ఆశిద్దాం.

మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు