వలసల రీతిలో ‘నిలువుదోపిడీ’ నీతి

20 May, 2020 23:55 IST|Sakshi

కొత్త కోణం

కార్మికులను ‘స్థాన బలంలేని బానిసలు’గా తయారుచేయడం. స్థిరమైన పని, సుస్థిరమైన బతుకుదెరువులేకుండా జీవితాన్ని అస్థిరం చేసి, అభద్రతకు గురిచేయడమే ‘ఫుట్‌ లూజ్‌ లేబర్‌’ సిద్ధాంతం. ప్రతినెలా భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు పంపాల్సిన డబ్బులు మాత్రమే కార్మికులకు కనపడతాయి. భారత దేశంలో కార్మికవర్గం ఈరోజు చెల్లాచెదురైంది. దాని విశ్వరూపాన్ని మనం కరోనా వ్యాప్తితో ప్రకటించిన లాక్‌డౌన్‌లో చూశాం. ఇంతటి భయంకర పరిస్థితులు ఏర్పడడానికి పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య వర్గాల దోపిడీ, ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యం కారణాలు. వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోవడం వెనుక ఒక నయా దోపిడీ విధానం ఉన్నది. 

‘ఫుట్‌ లూజ్‌ లేబర్‌. ఇది ఒక పదబంధం. కొత్తగా వింటున్నాం. ఇది పదబంధం మాత్రమే అనుకుంటే పొరబడ్డట్టే. ఈ పదం వెనుక ఓ పెద్ద కుట్రే దాగివుంది. యావత్‌ ప్రపంచంలోని శ్రామిక వర్గాన్నీ, మన లాంటి పేద దేశాలన్నింటినీ అతలాకుతలం చేసిన కుట్ర అది. కరోనా సంక్షోభంతో ఇది చర్చకు వస్తున్నది. లారీలూ, బస్సులూ, రైళ్లూ ఒకటా రెండా దేశంలోని దారులూ... రహదారులన్నీ కోట్లాది మంది నెత్తుటి ముద్దలుగా మారిన వలసకార్మికుల  పాదముద్రలే. ఇది ఒక చోటి నుంచి మరోచోటికి మాత్రమే కాదు. నలుదిక్కులనుంచి కదులుతోన్న బాధాతప్త హృదయ జనప్రవాహం. రైళ్ళు నడవడంలేదన్న ధీమాతో రైల్వే ట్రాక్‌పై అలసి, సొలసి ఆదమరిచి నిద్దరోయిన వారి తలలు తెగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రతిరోజూ వలసల దారుల్లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేకానేక వలసప్రాణాలు గాలిలో కలసిపోయాయి.  

దేశంలోనే కానీ, ప్రపంచంలోనే వలస బతుకు వెతలకు వేల ఏళ్ళ చరిత్ర ఉన్నది. శతాబ్దాలుగా ఈ వలసలు సాగుతూనే ఉన్నాయి. ఇందులో బతుకుదెరువు వలసలున్నాయి. బలవంతపు వలసలున్నాయి. ఆక్రమణకోసం వలసలున్నాయి. దురాక్రమణ వలసలు సైతం ఉన్నాయి. కానీ ఈ రోజు జరుగుతున్న వలసల వెనుక ఒక దోపిడీ, కుట్ర దాగిఉంది. అదే నేను ముందు ప్రస్తావించిన ‘ఫుట్‌ లూజ్‌ లేబర్‌’ సిద్ధాంతం. ఈ రోజు దీనినే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, కాంట్రాక్టర్ల వర్గాలు అనుసరిస్తున్నాయి.   

‘ఫుట్‌ లూజ్‌ లేబర్‌’ అంటే ఒక కార్మికుడిని తన సొంత ఊళ్ళోనో, జిల్లాలోనో, రాష్ట్రంలోనో పని ఇవ్వకుండా పొరుగు రాష్ట్రాల వారినో, ఇతర ప్రాంతాల వారినో వెతికితెచ్చుకోవడం. కార్మికులను ‘స్థాన బలంలేని బానిసలు’గా తయారుచేయడం. స్థిరమైన పని, సుస్థిరమైన బతుకుదెరువులేకుండా జీవితాన్ని అస్థిరం చేసి, అభద్రతకు గురిచేయడమే ‘ఫుట్‌ లూజ్‌ లేబర్‌’ సిద్ధాంతం. దీనిని మొదట బయటపెట్టింది జాన్‌బ్రెమన్‌. జాన్‌ బ్రెమన్‌ డచ్‌ దేశానికి చెందిన సామాజిక శాస్త్ర పరిశోధకులు. ఈయన అమెస్టర్‌డమ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

 ‘ఫుట్‌ లూజ్‌ లేబర్‌’ పేరుతో పుస్తకాన్ని రచించారు. 1936లో జన్మించిన జాన్‌ బ్రెమన్‌ దాదాపు అర్ధ శతాబ్దం భారత దేశంలోని కార్మికవర్గ జీవితాలపైన సమగ్రమైన పరిశోధన చేశారు. దక్షిణ గుజరాత్‌లో చేసిన ఆయన అధ్యయనాన్ని గత జనవరిలో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త జయతీఘోష్‌ తన సమీక్షలో కొనియాడారు. జాన్‌ బ్రెమన్‌ చేసిన అధ్యయనం ఇప్పటివరకూ నిర్లక్ష్యానికి గురైందని, భారతదేశంలో జరుగుతున్న ఆర్థికాభివృద్ధిలో కార్మిక వర్గంపై జరుగుతున్న దోపిడీని, అణచివేతను, అమానుషాన్ని బ్రెమన్‌  పుస్తకంలో రాసిన విషయాలను జయతీఘోష్‌ వెల్లడించారు. గతంలో ఉన్న వెట్టిచాకిరీ, బానిస విధానం, కూలీ విధానాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక వర్గాలు కొత్తగా, నూతన రూపాల్లో తెరమీదికి తీసుకొచ్చా యని బ్రెమన్‌ రాసిన విషయాలను జయతీఘోష్‌ ఉదహరించింది.  

‘ఫుట్‌ లూజ్‌ లేబర్‌’ విధానాన్ని ఈ రోజు దేశమంతా అమలు చేస్తున్నారు. వలస కార్మిక విధానమే మారిపోయింది. గతంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా రాష్ట్రాలకు కార్మికులు వలసలు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలసకార్మికులు వస్తున్న మాట నిజమే, అయితే వీరికి సొంత గడ్డపై పనులు లభించడంలేదు. నూటికి 80 శాతం కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్ళు, ఇతర సేవాసంస్థలు, చివరకు అతి తక్కువ జీతాలు ఇచ్చే సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉండటం మనం చూడొచ్చు.

దీనికి వ్యాపారం, వాణిజ్య, పారిశ్రామిక వర్గాల వాదనలు వేరుగా ఉన్నాయి. స్థానికంగా ఉన్నవాళ్ళకు నైపుణ్యం లేదన్నది వారి నిశ్చితాభిప్రాయం. ఇది పూర్తిగా అబద్ధం. అయితే ఇక్కడి వాళ్ళు ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు గల్ఫ్‌ దేశాల నిర్మాణాల్లో, వాళ్ళ ఆర్థికాభివృద్ధిలో ఎట్లా ఉపయోగపడుతున్నారు? దుబాయ్‌లో ఇతర గల్ఫ్‌ నగరాల్లో నిర్మించిన అద్భుతమైన, అందమైన భవనాలను నిర్మించింది కరీంనగర్‌ భవననిర్మాణ కార్మికులేననే విషయాన్ని దాచిపెట్టగలమా? 

అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కార్మికులు అండమాన్‌ దీవుల్లో, బెంగాల్, ఒడిశాలలో అనేక నిర్మాణ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న పాత్రను విస్మరించగలమా? ఇటీవల హోటల్‌ రంగం చాలా అభివృద్ధి అయింది. ఈ ఉద్యోగుల్లో స్థానికుల శాతం దాదాపు శూన్యమనే చెప్పాలి. అదేవిధంగా గృహనిర్మాణ రంగం హైదరాబాద్‌లో ఒక ప్రధాన ఆర్థిక వనరు. దీనిలో కూడా స్థానికులు చాలా తక్కువ. అదేవిధంగా వడ్రంగి, బంగారు నగల తయారీ కూలీలూ, ఇంకా రకరకాల పనుల్లో స్థానికులు లేరు. మధ్య, చిన్న తరహా పరిశ్రమల్లో సైతం స్థానిక కార్మికులకు స్థానం లేదు.  

భారత దేశంలో  కార్మికవర్గం ఈరోజు చెల్లాచెదురైంది. దాని విశ్వరూపాన్ని మనం కరోనా వ్యాప్తితో ప్రకటించిన లాక్‌డౌన్‌ లో చూశాం. ఇంతటి భయంకర పరిస్థితులు ఏర్పడడానికి పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య వర్గాల దోపిడీ, ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యం కారణాలు. వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోవడం వెనుక ఒక నయా దోపిడీ విధానం ఉన్నది. స్థానికేతరులు కావడం వల్ల అక్కడే పడి ఉంటారు. వారితో కావాల్సినన్ని గంటలు గొడ్డుచాకిరీ చేయించు కోవచ్చు. రెండవది, కనీస వేతనాలు అమలు చేయాల్సిన పని ఉండదు. 

వాళ్లకు అందిస్తున్న ఆహారం, వసతి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. దానికి డబ్బులు మినహాయించుకోవచ్చు. అంతే కాకుండా, అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, ఈ వలసకార్మికులకు నోరుండదు. కిమ్మనకుండా చెప్పింది చెప్పినట్టు వింటారు. ఇది ఒకరకంగా బ్రిటిష్‌వారు అమలుచేసిన బానిస విధానానికి నయాచిత్రం. లేబర్‌ క్యాంపుల్లో వంద మందికి ఒకటి రెండు టాయ్‌లెట్స్, బాత్రూంలు, పది అడుగుల గదిలో పదిమందిని కుక్కి, నాసిరకం తిండి పెట్టి, హింసతోకూడిన దోపిడీని అమలుచేయడానికి వలస కార్మికులను తెస్తున్నారు. అంతేకానీ స్థానికంగా నైపుణ్యం లేకకాదు. ఒకవేళ నైపుణ్యం అంతగా లేదనుకుంటే శిక్షణ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ ఆ పనిచేయరు. ఎందుకంటే ఇది నయా బానిసత్వం.  

అంతేకాకుండా ఈ విధానం మీద ఒక మాఫియా నెట్‌వర్క్‌ ఉన్నది. కంపెనీలు, సంస్థలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు తాము నేరుగా ఈ కార్మికులను తెప్పించుకోవడానికి మ్యాన్‌పవర్‌ సప్లయ్‌ సంస్థలు వెలిశాయి. వీళ్ళ సబ్‌కాంట్రాక్టులు తీసుకొని కంపెనీలకు సప్లయ్‌ చేస్తుంటారు. ఈ సబ్‌కాంట్రాక్టర్లు ముందుగా కార్మికులకు అడ్వాన్స్‌ ఇచ్చి, వారి బానిసత్వానికి ముందుగానే ఖరీదు కట్టేస్తారు. ఆ డబ్బుని కార్మికులు తమ ఇంట్లో ఇస్తారు. ఇక్కడికొచ్చాక ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా, కంపెనీలు పట్టించుకోవు.

ఒక వేళ అర్ధంతరంగా వెళ్లిపోతే అడ్వాన్స్‌ తిరిగి చెల్లించాల్సి ఉంటుందనే భయం వెంటాడుతుంది. దాంతో కార్మికులు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా పనుల్లోకి వెళ్తారు. ప్రతినెలా భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు పంపాల్సిన డబ్బులు మాత్రమే కార్మికులకు కనపడతాయి. ఇటీవల వలస కార్మికుల జీవన పరిస్థితులపై, వాళ్ళ కుటుంబ జీవితాలపైనా జరిగిన సర్వేలు భయంకరమైన నిజాలను బయటపెట్టాయి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. భార్యా, భర్తలు దూరంగా ఉండడం వల్ల ఎన్నో కాపురాలు విడిపోయాయి.

‘ఫుట్‌లూజ్‌’ లేబర్‌గా మారిన మట్టిమనుషుల బానిస బతుకులు ఒట్టికాళ్ళతో సొంతూళ్ళ బాటపట్టాయి. వేలకిలోమీటర్లు నడిచి నడిచి, దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వారు కోల్పోగా మిగిలిన వారు అష్టకష్టాలు పడి జీవచ్ఛవాలుగా ఇళ్లకు చేరుతున్నారు. ఇలా ఇళ్లకు చేరినవాళ్లలో అనారోగ్యం బారిన పడి మరణిస్తున్న వారి లెక్కలు ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవాలన్న ప్రయత్నమూ చేయరు. ఈ పరిస్థితి కల్పించింది వ్యాపార, వాణిజ్య వర్గాలు మాత్రమే కాదు. చట్టాలు శాసనాలు చేసి, అమలు చేయాల్సిన ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్టు దుర్మార్గమైన విధానాన్ని ప్రోత్సహించాయి. దాదాపు 20 కోట్ల మంది వలసకార్మికులు భారతదేశం రోడ్ల మీదికొస్తేగానీ దాని నిజస్వరూపం మనకు అర్థం కాలేదు. ఇప్పటికైనా ఈ వ్యవస్థ దుర్మార్గానికి స్వస్తి చెప్పి, గౌరవప్రదమైన జీవితాన్ని సాగించే వ్యవస్థను ఏర్పర్చడానికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు