ప్రాణదాత ఎవరు.. ప్రాణహర్త ఎవరు?

26 Sep, 2019 00:41 IST|Sakshi

కొత్త కోణం

పూనాలోని ఎరవాడ జైలులో మహాత్మాగాంధీ నిరాహారదీక్ష చేస్తున్నారు. మహాత్మా గాంధీ దీక్ష పైనే యావత్‌ దేశమంతా చర్చిం చుకుంటోన్న సందర్భమది. ఆ దీక్షకు ఓ ప్రత్యేకత ఉన్నది. అంట రాని కులాలకు బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఓటింగ్‌ విధానంపైన గాంధీ నిరసన. ప్రత్యేక ఓటింగ్‌ విధానం ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించి, వారి శాసనసభలకు వారి ప్రతినిధులను వారు మాత్రమే ఎన్నుకునే అవకాశాన్ని కల్పించిన విధా నమది. ఆ విధానాన్ని అమలు చేస్తే, దేశం విచ్ఛిన్నానికి గురవుతుందని, హిందువులు నిట్టనిలువునా చీలిపోతారని గాంధీ పూర్తిగా వ్యతిరేకించారు. 1932 సెప్టెంబర్‌ 20న గాంధీ నిరాహారదీక్ష ప్రారంభించారు. ప్రత్యేక ఓటింగ్‌ విధాన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంతవరకు తన నిరా హారదీక్ష విరమించేది లేదని గాంధీ స్పష్టం చేశారు. గాంధీ అనుచరులైన మదన్‌మోహన్‌ మాలవ్యా, సప్రూ, జయకర్, బాబూ రాజేంద్రప్రసాద్‌ తదితరులు ప్రత్యేక నియోజక వర్గాలను ఉపసంహరించుకోవాలని, లేనట్లయితే గాంధీ ప్రాణం ప్రమాదంలో పడుతుందని అంబేడ్కర్‌తో అనేక సార్లు చర్చించారు. అయితే అంటరానికులాలకు లభించిన   రాజకీయ హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పటికీ, రోజు రోజుకీ క్షీణిస్తోన్న గాంధీజీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, కొన్ని మార్పులతో మరొక సరికొత్త విధానానికి అంబేడ్కర్ అంగీకరించారు. దానినే పూనా ఒడంబడిక అని అంటారు. దానితో గాంధీ సెప్టెంబర్‌ 24వ తేదీన నిరసన దీక్ష విరమించారు. 

ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. గాంధీ ప్రాణం కోసం అంబేడ్కర్, అంటరాని కులాలు చేసిన త్యాగం. ప్రత్యేక ఓటింగ్‌లో ప్రత్యేక నియోజకవర్గాలను వదులుకో వడం వల్ల ఎస్సీ, ఎస్టీ రాజకీయ ప్రతినిధులు తప్పనిసరిగా పార్టీలకు లోబడి ఉండాల్సిన స్థితి. అంతే తప్ప నిజంగా ఎవరైతే సమాజంలో అణచివేతకూ, అన్యాయానికీ గురవు తున్నారో వారి పక్షాన నిలబడలేకపోతున్నారు. ఎవరికి ప్రాతినిధ్యం వహించాలో వారికి ప్రాతినిధ్యం వహించలేక పోతున్నారు. ఈ విషయాలు అంబేడ్కర్‌ని ఆలోచనలో పడే శాయి. కానీ మానవతా వాదిగా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తనని తాను తగ్గించుకొని, గాంధీ ప్రాణాలు నిలబెట్టారు. 

సరిగ్గా దీనికి విరుద్ధంగా జరిగిందే మహాత్మాగాంధీ హత్య. హిందూమత సముద్ధరణ కోసం ఆధునిక కాలంలో అత్యంత ఎక్కువగా ఆలోచించిన వారిలో మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ ప్రముఖులు. ఆయన ఛాందస హిందువు కాకపోయినా, సామాజిక విప్లవకారుడు మాత్రం కాదు. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూనే, అంటరానితనం పోవాలం టూనే, వర్గవ్యవస్థను సమర్థించిన సనాతన వాది. రామ నామాన్ని ఆధునిక ప్రపంచంలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఎంతో మందిని హిందూమతం వైపు ఆకర్షించిన వ్యక్తి గాంధీజీ. అయితే హిందూమతంతో పాటు ఇతర మత విశ్వాసాలను గౌరవించాలని, సహజీవనం చేయాలని, సామరస్యంగా ఉండాలని భావించిన ఆధునికుడు గాంధీజీ. నిజానికి గాంధీ వృత్తిపరమైన జీవితాన్ని ప్రారం భించింది అబ్దుల్లా అనే ఒక ముస్లిం కంపెనీతో. దక్షిణా ఫ్రికాలో ఆ కంపెనీలోనే గాంధీ తొలుత పనిచేశారు. నిజా నికి గాంధీలో అన్నిమతాలను కలుపుకుపోవాలనే ఆలోచ నకు రూపకల్పన జరిగింది దక్షిణాఫ్రికాలోనే. భారత దేశం నుంచి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయులందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చిన వారు గాంధీజీయే. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు అందరితో సఖ్యతగా ఉంటూ, భారతీయుల హక్కుల కోసం పోరాడిన అను భవం గాంధీకి ఉన్నది. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఇదే కార్యాచరణను కొనసాగిం చారు. అందుకే భారతదేశంలో హిందువుల తర్వాత అధిక సంఖ్యలో ఉన్న ముస్లింల సమస్యలను చాలా శ్రద్ధతో పరి శీలించి, సంపూర్ణ మద్దతును అందజేశారు. 1919 నాటి ఖిలాఫత్‌ ఉద్యమానికి అండదండగా నిలిచారు.

అలా ప్రతిచోటా ముస్లింలకు తోడుగా నిలబడ్డాడని హిందూమత సంస్థల వాదన. చివరకు పాకిస్తాన్‌ విభ జనలో గాంధీ పాత్ర ఉన్నదనే ఆరోపణలు కూడా చేశాయి. దీంతోనే హిందూమత ఆవేశం ఒంటపట్టించుకున్న నాథూరాం గాడ్సే గాంధీజీని కాల్చి చంపారు. హిందువు లపై దాడులను గాంధీ ఖండించలేదని, గాంధీని అంత మొందించడం ఏదో ఉద్రేకంలోనో, క్షణికావేశంలోనో చేసిన హత్యకాదని కూడా ఆయన ప్రకటించారు. నిజానికి గాడ్సే ఇటువంటి చర్యకు పాల్పడటానికి ఆ రోజు మహారాష్ట్రలో హిందూ మహాసభ, హిందూ సంఘటన సంస్థల ప్రచారం కారణం కావచ్చు. తిలక్‌ నుంచి వీర్‌సావర్కార్‌ వరకు హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అనే ఒక తీవ్రవాద భావజాలం గాడ్సేను ఈ హత్యకు పురిగొల్పింది. గాంధీ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి గాంధీ భావజాలాన్ని పూర్తిగా నిరసించినవాడు. ఆయన అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి అంబేడ్కర్‌. గాంధీని మహా త్ముడు కాదని ప్రకటించే సాహసం ఆనాటికి ఎవ్వరికీ లేదు. అది అంబేడ్కర్‌ చేశారు. గాంధీని మిస్టర్‌ గాంధీ అని పిలి చిన ఏకైక భారతీయుడు కూడా అంబేడ్కరే. అంబేడ్కర్‌ గానీ, అంబేడ్కర్‌ వాదులుగానీ, శాంతియుతంగా ప్రజా స్వామ్యయుతంగా సిద్ధాంతాలను, రాజకీయాలను ఎదు ర్కోవాలని భావించిన వాళ్ళు. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్లేనాడూ భావించలేదు. అంబేడ్కర్‌ గాంధీని తన వాదనలతోనే ఎదుర్కొన్నారు. కానీ హిందు వుల రక్షణ పేరుతో హిందూ మతాన్ని ఆధునికతవైపు తీసు కెళుతూన్న గాంధీని కాల్చి చంపింది కూడా హిందువే కావడం గమనార్హం. 

భావజాలంపైన వ్యతిరేకత ఉంటే, దానిని వాదన ద్వారా ఓడించాలి. ఎవరివైనా తప్పుడు భావాలనిపిస్తే వాటిని సిద్ధాంతపరంగా ఎండగట్టాలి. అంతేకానీ వ్యక్తు లను నిర్మూలించడం ద్వారా భావజాలాన్ని చంపాలనుకో వడం ఏ మతానికైనా సరైన పరిష్కారం కాదు. ఇటీవల ఈ అసహనం మరింత పెచ్చరిల్లుతున్నది. ఇటీవల గౌరీ లంకేష్, గోవింద్‌ పన్సారీ, కల్‌బుర్గిలను ఇదే ఉన్మాదంతో హత్యచేయడం గాడ్సే విద్వేషపూరిత హింసా వారసత్వాన్ని కొనసాగించడమేనని భావించాలి. ఇవాళ మహాత్మా గాంధీ 150వ జయంతి జరుపుకుంటున్న భారత దేశం ఆయనలో ఉన్న సర్వమత సామరస్యం, సోదరభావం, మానవతా దృష్టిని అలవర్చుకుంటే శాంతిబోధకుడు బుద్ధుడు నడయాడిన నేలగా ఈ దేశానికి సార్థకత లభిస్తుంది.


మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు