సామాజిక న్యాయపోరాట యోధుడు

21 Nov, 2019 00:58 IST|Sakshi

కొత్త కోణం

భారతదేశంలో కులమే అన్ని అనర్థాలకు కారణమనే భావాన్ని మదిలో నింపుకొని, సమానత్వం కోసం తుది శ్వాస వరకు పరితపించిన అరుదైన వ్యక్తి పి.ఎస్‌. కృష్ణన్‌. ఐఏఎస్‌ అధికారి అయిన క్షణం నుంచే అంటరాని కులాల దయనీయ స్థితిని మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు  మొదలుపెట్టారు. దళిత వాడల్లోనే ఉండి, పరిస్థితులను, పరిసరాలను గమనించిన కృష్ణన్‌ వాటిని ఎట్లా మార్చడమో కూడా తెలుసుకున్నారు. ఎస్సీలకు స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్, స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్, అత్యాచారాల నిరోధక చట్టం, మండల్‌ కమిషన్‌ సిఫారసుల అమలు వంటి అనేక పథకాల అమలుకు అహరహం కృషి చేసిన పి.ఎస్‌. కృష్ణన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం జీవితాన్ని వెచ్చిం చిన నిరంతర సామాజిక న్యాయపోరాట యోధుడు. అంబేడ్కర్‌ మరణించినరోజే ఏపీలో ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్‌ ఆయన భారాన్ని తన భుజాలపై మోశారు.

రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే దానిని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళైతే, రాజ్యాంగం నిష్ప్రయోజనకరంగా మారుతుంది. అలాగే రాజ్యాంగం ప్రగతినిరోధకమైనప్పుడు కూడా దాన్ని అమలు చేసేవాళ్ళు ప్రగతిశీలురవుతే రాజ్యాంగం గొప్పగా మారుతుంది. ఎప్పటికప్పుడు రాజ్యాంగమనే అతిపెద్ద కొలమానంలో ప్రతిపనిని తరచి చూసుకున్న పాలకులు ప్రజల హృదయాల్లోనే కాదు, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాధినేతలు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మలుచుకుంటున్నారంటూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1949 నవంబర్, 25వ తేదీన రాజ్యాంగ సభ చివరి రోజుకు ఒక రోజు ముందు వ్యాఖ్యానించారు. ఏడు దశాబ్దాల క్రితం అంబేడ్కర్‌ నోట వెలువడిన వాక్కులు ఈ రోజు అక్షరసత్యాలుగా మనముందు ఆవిష్కృతమౌతున్నాయి. 

రాజ్యాంగాన్ని సైతం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్న పార్టీలూ, రాజకీయ నాయకులూ నేడు కోకొల్లలు. నిజం చెప్పాలంటే కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన చేయడానికి సైతం వెనుకాడడం లేదు. అన్ని ప్రభుత్వాలలో ఈ తరహా ధోరణి కొనసాగుతూనే వచ్చింది. అయితే కొంతమంది ప్రభుత్వాధికారులు తమకున్న మానవీయ దృక్పథంతో రాజ్యాం గాన్ని ఒక ఆయుధంగా వాడుకొని దేశ సామాజిక సమస్యల పరిష్కారానికి నడుంకట్టారు. అలాంటి వారిలో ఇటీవల మన నుంచి భౌతి కంగా దూరమైన పి.ఎస్‌. కృష్ణన్‌ ఒకరు. భారత్‌లో కులమే అన్ని అనర్థాలకు కారణమనే భావాన్ని మదిలో నింపుకొని, సమానత్వం కోసం తుది శ్వాస వరకు పరితపించిన పీఎస్‌ కృష్ణన్‌ నవంబర్‌ పదవ తేదీన మరణించినప్పటికీ, ఆయన చేసిన కృషి తనను సామాజిక న్యాయపోరాటాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. భారత రాజ్యాంగం వెలుగులో ఆయన ప్రారంభించిన ఎన్నో కార్యక్రమాలు, రూపొందించిన ఎన్నో చట్టాలు భారత సమాజాన్ని సమానత్వం వైపు, సామాజిక న్యాయంవైపు నడిపిస్తాయనడానికి సందేహం అక్కర్లేదు. 

కేరళలోని తిరువనంతపురంలో 1932, డిసెంబర్‌ 30 వ తేదీన పి.ఎల్‌.సుబ్రహ్మణ్యన్, అన్నపూర్ణమ్మలకు పి.ఎస్‌.కృష్ణన్‌ జన్మించారు. తిరువనంతపురంలో హైస్కూల్‌ వరకు చదువుసాగించిన కృష్ణన్‌ ట్రావెన్‌కోర్‌ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో డిగ్రీ పొందారు. మద్రాసులోని క్రిస్టియన్‌ కళాశాలలో ఇంగ్లిష్‌లో మాస్టర్‌ డిగ్రీ చేసి, కాంచీ పురం సచియప్ప కళాశాలలో ఇంగ్లిష్‌ అ«ధ్యాపకునిగా పనిచేశారు. ఆయన హైస్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే కేరళలో సామాజిక ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. నారాయణ గురు, అయ్యంకాళిల ప్రభావం పి.ఎస్‌.కృష్ణన్‌పైన పనిచేసింది. అదే సమయంలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సాగిస్తున్న పోరాటాలను కూడా ఆయన పత్రికల్లో చదివి ఆకర్షితులయ్యారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ, సామాజిక ప్రభావం, తండ్రి చెప్పిన సత్యాలు ఆయనను చిన్నతనంలోనే సామాజిక వివక్షను, అంటరానితనాన్నీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ విషయాలతో పాటు తాను ప్రత్యక్షంగా చూసిన అసమానతలూ, వివక్ష ఆయన హృదయాన్ని ఎంతగానో రగిల్చాయి.  

పి.ఎస్‌.కృష్ణన్‌ ఐఏఎస్‌ అధికారి అయిన మరునాటి నుంచే అంటరాని కులాల దయనీయ స్థితిని మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు  మొదలుపెట్టారు. 1956 మే 2న ఐఏఎస్‌ శిక్షణ ప్రారంభమైన రెండు నెలల్లోనే ఢిల్లీ సమీపాన ఉన్న అలీపూర్‌ పంచాయతీ పరిధిలోని బడ్లీ గ్రామానికి అధ్యయనం కోసం వెళ్ళారు. అధ్యయనంకోసం వెళ్ళిన మిగిలిన బృందంతో విడిపోయి ఎస్సీలు నివసించే బస్తీవైపుకి తనకి తెలియకుండానే అడుగులు వేసేవారు. అదే సందర్భంలో ఈశ్వర్‌ దాస్‌ అనే దళితుడు శరీరం నిండా పొక్కులు ఉన్న శిశువును ఎత్తుకొని ఉండడం చూసి కృష్ణన్‌ చలించిపోయాడు. మరుసటిరోజు ఐఏఎస్‌ ట్రైనింగ్‌ స్కూల్‌డాక్టర్‌ను తీసుకెళ్ళి, ఆ శిశువుకు చికిత్స చేయించారు. ఇది ఆయన ఆలోచనను మరింత పదునెక్కించింది. ఢిల్లీ పరిసరాల్లోనే ఇలా ఉంటే, మారుమూల పల్లెల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆరోజే ఆలోచించారు పి.ఎస్‌. కృష్ణన్‌ శిక్షణను ముగించుకున్న కృష్ణన్‌ 1956లోనే ఆంధ్ర ప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిగా నియమితులయ్యారు. 1956వ సంవత్సరం భారతదేశం ఒక గొప్ప మేరు పర్వతాన్ని కోల్పోయింది. 1956 డిసెంబర్‌ 6వ తేదీన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మహాపరినిర్వాణం పొందారు. అదే సంవత్సరం పీఎస్‌ కృష్ణన్‌ ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టడం కాకతాళీయమే కావచ్చు, కానీ ఆ తరువాత ఆ హోదాలో పి.ఎస్‌. కృష్ణన్‌ సాధించిన విజయాలను చూస్తే, అంబేడ్కర్‌ తన బాధ్యతలను పి.ఎస్‌. కృష్ణన్‌ భుజస్కంధాలపై ఉంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ రోజు బలహీన వర్గాల కోసం, ప్రత్యేకించి ఎస్సీల కోసం ఆయన రూపొందించిన పథకాలు, రూపొందించిన చట్టాలను పరిశీలిస్తే మనం ఎవ్వరం కాదనలేం. 

ఆయన ప్రారంభించిన పథకాలన్నీ, కూడా అనుభవం నుంచి రూపొందినవే. ఊరు బయట ఉన్న దళిత వాడల గాలికూడా తమ మేనుకి సోకనివ్వని అధికారులు అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ రోజు అది ఊహించడానికి కూడా వీలు లేనిది. కానీ పి.ఎస్‌. కృష్ణన్‌ ఒక గ్రామం వెళితే ముందుగా అంటరాని కులాలు నివసించే చోటకు వెళ్ళేవారు. వాళ్ళు ఏం తింటే అదే తినడం ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారు. అక్కడే ఉండి, పరిస్థితులను, పరిసరాలను గమనించిన కృష్ణన్‌ వాటిని ఎట్లా మార్చడమో కూడా తెలుసుకున్నారు. అప్పటివరకు భారత ప్రభుత్వంలో మూడే మూడు పథకాలు ఉండేవి. ఆ పథకాలు కూడా 1949కి ముందు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టారు. అవి, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్, విదేశీ చదువుకు ఉపకారవేతనాలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు. అవి మినహా ప్రభుత్వాలు ఎటువంటి నూతన పథకాలనూ అమలు చేయడం ప్రారంభించలేదు. ఆ విషయాలను గమనించిన పి.ఎస్‌. కృష్ణన్‌ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్‌ 46 ప్రకారం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తించారు. ‘‘అణగారిన వర్గాలు ప్రత్యేకించి, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలను విద్య, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని, అన్ని  రకాల సామాజిక వివక్షల నుంచి, దోపిడీ, పీడనల నుంచి విముక్తి కలిగించాలి’’ అని ఆదేశిక సూత్రం పిఎస్‌. కృష్ణన్‌ చేతిలో ఒక బలమైన ఆయుధంగా మారింది. 

ఒకవైపు దళితుల దయనీయ స్థితి, రెండోవైపు రాజ్యాంగం అండదండలు పి.ఎస్‌. కృష్ణన్‌ను ప్రభుత్వాధినేతలపై పోరాడే స్థైర్యాన్నిచ్చాయి. అందుకే వారి సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు రూపొం దిస్తున్న బడ్జెట్‌లలో ఈ వర్గాలకు తగిన వాటా లభించాలని వాదిం చారు. వారి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు, బడ్జెట్‌ కేటాయింపులు లేకపోతే, సామాజిక వివక్ష నుంచి వాళ్ళు విముక్తి కాలేరని భావిం చారు. అందుకోసమే మొదటగా ఎస్సీలకోసం స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌ ను రూపొందించి కేంద్ర ప్రభుత్వం చేత ఒప్పించారు. 1978 లోనే దీనికి అంకురార్పణ జరిగింది. 1980లో ఇందిరాగాంధీ పాలనలో దీనికి బలమైన పునాదులు పడ్డాయి. ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమాంతరంగా అమలు జరగాలని, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్న పథకాలలో ఏవైనా బడ్జెట్‌ లోటు ఏర్పడితే స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌(ఎస్‌సిఏ)ను అందించాలని సూచించారు.

అదే విధంగా అత్యాచారాల నిరోధక చట్టం. మండల్‌ కమిషన్‌ సిఫారసుల అమలు, బౌద్ధం తీసుకున్న ఎస్సీలకూ, ఎస్టీలకూ అందేవిధంగా జీవోలు అన్నీ ఈయన చేతి నుంచి వచ్చిన సంక్షేమ ఫలాలేనన్న విషయం చాలామందికి తెలియదు. ఎస్సీ, ఎస్టీలలో అభివృద్ధి చెందిన కొన్ని కులాలు మిగతా వారిని తమతో పాటు తీసుకెళ్ళాలనీ, వారికి నాయకత్వం వహించాలని సూచించారు. రిటైరై ఇప్పటికి ఇరవైఏళ్ళు గడిచిపోయింది. కానీ ఆయన తన సంక్షేమ సాధన, సామాజిక న్యాయ సాధన మార్గాన్ని విడిచిపెట్టలేదు. తనకున్న గౌరవాన్ని తనకోసం కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం వెచ్చించిన నిరంతర సామాజిక న్యాయపోరాట యోధుడు ఆయన. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పినట్టు ఇటువంటి వ్యక్తుల చేతుల్లోనే రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరుగుతుంది. ఈ కాలం అధికారులు పీఎస్‌. కృష్ణన్, ఎస్‌.ఆర్‌. శంకరన్‌ల నుంచి అందిపుచ్చుకోవాల్సింది సరిగ్గా ఇదే   మరి. అదేమిటంటే అంకితభావం, నిరంతర దీక్ష అణగారిన వర్గాల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధితో పనిచేయడం.


మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు