ఝాన్సీ కోటలో మెరిసిన కరవాలం

9 May, 2019 01:08 IST|Sakshi

కొత్త కోణం 

ప్రథమ భారత మహాసంగ్రామంలో శతృవు కన్నుగప్పి తన రాణిని గెలిపించడానికి కత్తిచివరన నెత్తుటి బొట్టై మెరిసిన వీరవనిత, దళిత సేనాని ఝల్‌కారి బాయి పేరుని చరిత్ర మరువజాలదు. రాణి లక్ష్మీబాయిని బ్రిటిష్‌ సైన్యం నుంచి తప్పించడానికి తెగువ చూపిన ఝల్‌కారి బాయి చివరకు తమ చేతికి చిక్కినప్పుడు ఆమె పట్ల బ్రిటిష్‌ సేనాని ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కనీసం ఒక్కశాతం మంది భారత మహిళలు ఈమెలా ఉంటే బ్రిటిష్‌ వారు తక్షణమే ఈ దేశాన్ని వీడి ఉండేవారు’ అంటూ తాను వ్యాఖ్యానించడం విశేషం. పరదాల మాటున తప్ప పదిమందిలోకి సైతం స్త్రీలను అనుమతించని కాలంలో ఒక మహిళ యావత్‌ సామ్రాజ్య దుర్గాసేనకి సేనానిగా ముందు వరుసన నిలబడి తలలు తెగిపడుతున్నా తరగని గుండెనిబ్బరంతో సైన్యంలో సత్తువ నింపిందన్న ఊహకూడా మనకు కలగదు.

బానిస సంకెళ్ళ నుంచి, పరాయి పాలన నుంచి విముక్తి కోసం యావత్‌ భారత ప్రజల స్వేచ్ఛానాదమై నినదించిన ప్రప్రథమ భారత సంగ్రామం ప్రారంభమైన రోజు ఈ రోజు. భారతదేశాన్ని చెరబట్టిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టేందుకు భారతదేశం నడుం బిగించిన రోజు. విదేశీ దురా క్రమణకు ఎదురొడ్డి నిలిచిన జనసామాన్యులెందరో చరిత్రపుటల్లోకి చేరనే లేదు. అట్టడుగున పడి కాన్పించని అణగారిన వర్గాల జాడే ఏ చరి తకూ అందని అక్షరమయ్యింది. ఇక వేనవేల సైనిక పటాలాలను తుత్తు నియలు చేసి, శత్రువు గుండెల్లో  తుఫానులు రేపిన 1857 ప్రథమ భారత సంగ్రామంలో చిందిన నెత్తుటి ధారలెవ్వరివో లెక్కించడం బహుకష్టం. ఇదే తొలిభారత మహాసంగ్రామంలో శత్రువు కన్నుగప్పి తన రాణిని గెలిపించడానికి కత్తిచివరన నెత్తుటి బొటై్ట మెరిసిన వీరవనిత పేరుని చరిత్ర మరువజాలదు.  

ప్రథమ భారత సంగ్రామం గుర్తుకురాగానే ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు వస్తుంది. బ్రిటిష్‌ వారి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ఝాన్సీ లక్ష్మీబాయి పేరు తలచుకున్న వెంటనే గుర్తురావాల్సిన పేరు ఝల్‌కారీ బాయి. పరదాల మాటున తప్ప పదిమందిలోకి సైతం స్త్రీలను అను మతించని కాలంలో ఒక మహిళ యావత్‌ సామ్రాజ్య దుర్గా సేనకి సేనా నిగా ముందువరుసన నిలబడి తలలు తెగిపడుతున్నా తరగని గుండె నిబ్బరంతో సైన్యంలో సత్తువ నింపిన స్త్రీ ఉంటుందన్న ఊహకూడా మనకు కలగదు. అలనాటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యానికి నాయకత్వం వహించిన తెగువ గలిగిన ఓ దళిత మహిళను భరత నేల గుండెలకు హత్తుకుంది. ఝల్‌కారీ బాయితో సహా కొందరు వీరనారీ మణులను ఇక్కడ స్మరించుకోవాల్సి ఉంది. భారత స్వతంత్ర సంగ్రా మంలో పురుషులకు దీటుగా పోరాడిన మహిళలెందరో చరిత్రపుటల్లోకి ఎక్కలేదు. అందులోనూ దళిత, ముస్లిం మహిళల సాహసోపేత పోరా టాలెన్నో మరుగునపడిపోయాయి. అలాంటి వారిలో బేగమ్‌ హజరత్‌ మహల్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, ఊదా దేవి, అజీజున్‌ బాయి, ఝల్‌ కారీ బాయి ప్రముఖులు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించ డంలో దళిత మహిళల పాత్ర మరువలేనిది. వీరాంగనల పేరుతో భారత మహిళలు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన మహా సంగ్రామంలో పోరాడారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రాణీ, ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యాధ్యక్షురా లిగా పనిచేసిన వీరాంగన ఝల్‌కారీ బాయి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దళిత మహిళ. నిరుపేద కుటుంబానికి చెందిన ఝల్‌కారీ బాయి ‘కోరి’ సామాజిక వర్గానికి చెందినవారు. 1830 నవంబర్‌ 22న ఝాన్సీకి దగ్గర్లోని భోజ్లా గ్రామంలో జమునా సింగ్, సడోబా సింగ్‌లకు జన్మించారు. ఝల్‌కారీ బాయి తండ్రి మల్లయోధుడు. ఝల్‌కారీ బాయికి యుక్త వయస్సురాగానే తల్లి మరణించింది. తండ్రి స్వతహాగా మల్లయోధుడు కావడంతో ఆమెకు చిన్నప్పటి నుంచే కత్తిసాము గుర్రపు స్వారీ నేర్పించారు. ఏకైక కుమార్తె అయినప్పటికీ తండ్రి చాటు బిడ్డగా పెరగడం వల్లనో, తండ్రినుంచి వారసత్వంగా వచ్చిన వీరత్వమో కానీ ఝల్‌కారీ బాయి చిన్ననాటి నుంచే అంతులేని ధైర్యసాహసాలు ప్రదర్శించేవారు. 

ఆమెలోని ధైర్యసాహసాలూ, మరణాన్ని సైతం లెక్కచేయని తెగువ, మృత్యువుని సైతం కౌగిలించుకునే చేవ కలిగిన ఝల్‌కారీ బాయి చరిత్రను ఇటీవలి కాలంలో చరిత్రకారులు వెలికి తీయడంతో ఆమె సాహసోపేత జీవితం వెలుగులోకి వచ్చింది. ఒకసారి వంటచెరకు కోసం అడవికి వెళ్ళినప్పుడు చిరుత దాడి చేస్తుంది. తన చేతిలోని గొడ్డలితో చిరుతపై ఝల్‌కారీ బాయి తిరగబడుతుంది. చేతిలోంచి జారిపడిన గొడ్డలిని లెక్కచేయకుండా చిరుతపై పడి పళ్లతోనూ, గోళ్ళతోనూ దాన్ని చీల్చి చెండాడి రక్తమోడుతూ తిరిగి ఇంటికి చేరిన ఘటన స్థానిక ప్రజ లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటివే ఎన్నో సాహసాలు ఈ దళిత వీరవనిత పేరుని పరిసర ప్రాంతాల్లో మారుమోగేలా చేస్తుంది. అలాగే ఒకసారి ఝల్‌కారీ బాయి ఊరిలోని వ్యాపారి ఇంటిపై దొంగలు పడి దోచుకుంటున్న సమయంలో కూడా ఝల్‌కారి బాయి ఒంటిచేత్తో దొంగ లతో పోరాడి దుండగులను తరిమి తరిమి కొడుతుంది. ఈ సాహసో పేత చర్యలే ఆమె ఘనతను రాణీ లక్ష్మీబాయి చెవికి సోకేలా చేశాయి.

ఝల్‌కారీ బాయి ఝాన్సీ లక్ష్మీబాయి దృష్టిలో పడటానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి సామ్రాజ్యంలో ప్రతియేటా దుర్గా పూజ జరిగేది. ఆ పూజాకార్యక్రమానికి మహిళలందరికీ ఆహ్వానం ఉండేది. సహజంగానే నాయకత్వ లక్షణాలున్న ఝల్‌కారీ బాయి  పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక గ్రామప్రజలను వెంటబెట్టుకుని రాణీవాసానికి  వెళ్ళినప్పుడు ఝల్‌కారీ బాయి తొలిసారిగా రాణీ లక్ష్మీ బాయి దృష్టిలో పడుతుంది. స్వతహాగా వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఝల్‌కారీ బాయిని గురించి ఆ తరువాత అడిగి తెలుసుకున్న ఝాన్సీ రాణీ ఆమెను తరచూ రాణివాసానికి రప్పించుకొని స్వయంగా తానే యుద్ధ విద్యలు నేర్పించినట్టు చరిత్ర చెపుతోంది. వీరాంగనగా పిలువ బడే యుద్ధవనితలతో ఒక సైన్యాన్నే ఏర్పాటు చేసిన ఘనత రాణీ లక్ష్మీ బాయికే చెందుతుంది. 

అంతేకాదు ఒక మహిళకి అందునా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన అట్టడుగు వర్గం మహిళకి దేశభద్రతా బాధ్యతలు అప్పగించిన చరిత గతమంతా వెతికినా దొరకదు. ఝాన్సీ లక్ష్మీబాయి మహిళ కావడం వల్లనే దళిత స్త్రీకి అంతటి రక్షణ బాధ్యతలను అప్పగించ గలిగినట్టు భావించొచ్చు. ఆ తరువాత బ్రిటిష్‌ సైన్యాన్ని దీటుగా ఎదు ర్కొనేందుకు పలు విద్యలు నేర్పించి ఝల్‌కారీ బాయిని దుర్గాదళ్‌లో నియమించాలని ఝాన్సీ లక్ష్మీబాయి ఆదేశిస్తారు. అనంతరం రాణీయే స్వయంగా ఆమెకు యుద్ధవిద్యలో ఆరితేరేలా శిక్షణ ఇస్తారు. శరీరాకృతి లోనూ యుద్ధతంత్రంలోనూ ఝాన్సీ లక్ష్మీబాయి పోలికలతో ఉన్న ఝల్‌ కారీ బాయి ఆ తరువాత రాజ్యంకోసం, ప్రజలకోసం చూపిన సాహసం, చొరవ ఆమె చరిత్రను మౌఖిక సాహిత్యంలో సజీవంగా ఉంచేలా చేశాయి. ఇప్పటికీ ఝాన్సీలోని జానపద గేయాల్లో ఝల్‌కారీ బాయి జీవన గాథలు, కథలు కథలుగా స్థానిక సంస్కృతిలో భాగమయ్యాయి. 

1858 ఏప్రిల్‌ మాసంలో బ్రిటిష్‌ సైన్యం రాణివాసంపై దాడిచేసిన ప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. దీంతో ఆమెను యుద్ధరంగం నుంచి తప్పించేందుకు దళిత వీరనారి ఝల్‌కారీ బాయిచేసిన సాహసం ప్రథమ భారత సంగ్రామంలో జనం మదిలో చెరగని ముద్రవేసింది. ఝాన్సీ లక్ష్మీబాయిలా మారువేషం వేసుకొని యుద్ధరంగంలోకి దూకిన ఝల్‌కారీ బాయి ఝాన్సీ సైన్యానికి సారథ్యం వహిస్తారు. బ్రిటిష్‌ జనరల్‌ హగ్‌ రోజ్‌ దరికి చేరగానే ఝల్‌కారీ బాయి ఝాన్సీ రాణీని తప్పించేందుకు తాను బ్రిటిష్‌ జనరల్‌ని కలవాలనుకుం టున్నానని అరుస్తూ చెప్పడంతో బ్రిటిష్‌వారి దృష్టి ఝల్‌కారీ బాయిపై పడుతుంది. అదే అదనుగా భావించి ఝాన్సీ లక్ష్మీబాయి తప్పించుకుం టారు. బ్రిటిష్‌ సైన్యంతో వీరోచితంగా పోరాడుతూ జనరల్‌ చేతికి చిక్కిన ఝల్‌కారీ బాయిని ఝాన్సీరాణీగా భావించిన బ్రిటిష్‌ జనరల్‌ ‘నిన్నేం చేయాలి’ అని ప్రశ్నించినప్పుడు ఝల్‌కారీ బాయి ఏ మాత్రం తొణకకుండా ‘ఉరితీయండి’ అని కోరుతుంది. దళిత వీరవనితలో దాగున్న ధైర్యసాహసాలూ, గుండెనిబ్బరం మనల్ని నివ్వెరపరుస్తాయి. బుందేల్‌ ఖండ్‌ వీరవనిత సాహసం చూసి హతాశుడైన బ్రిటిష్‌ సైని కాధికారి ఝల్‌కారీ బాయిని ఉద్దేశించి ‘‘కనీసం ఒక్కశాతం మంది భారత మహిళలు ఈమెలా ఉంటే బ్రిటిష్‌ వారు తక్షణమే ఈ దేశాన్ని వీడి ఉండేవారు’’ అంటూ వ్యాఖ్యానించడం దళిత బిడ్డ ఝల్‌కారీ బాయి తెగువకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

శతాబ్దాల దళితుల చరిత కనుమరుగైనట్టే ఝల్‌కారీ బాయి చరిత్ర కూడా చరిత్ర మరుగున పడిపోయింది. నిజానికి స్వతంత్ర సంగ్రా మంలో, భారత సమాజ నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ ఎందరో దళిత మహిళల నెత్తుటి గుర్తులు దాగున్నాయి. జాతీయత పేరుతోనో, మరోపేరుతోనో దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు సమాజ పురోగతిలో వారి త్యాగాలను చిరునామాను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ సమాజాన్ని తమ దేహపు చెమట చుక్కలతో స్వచ్ఛంగా మార్చుతోంది మరెవ్వరో కాదు.. ఈ దేశంలో దగాపడిన దళిత మహిళ లేనన్నది మర్చిపోకూడదు. మన వేపచెట్టునీ, మన పసుపు గుట్టునీ విప్పి చెప్పింది కూడా బౌద్ధ బిక్కు అయిన ఒక దళిత మహిళే. ఈనేలపై పండిన పసుపు లోని ఔషధగుణాలను గుర్తించి పూజాకార్యక్రమాల్లో దాని వాడకం అవసరాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది దళిత మహిళే. మశూచి, ఆటలమ్మలకు విరుగుడు ఔషధగుణాలున్న వేపచెట్టే నని తేల్చి చెప్పింది సైతం ఆ దళిత సామాజికవర్గానికి చెందిన అంబి కామయి అని చరిత్ర చెపుతోంది. వైద్యం మొదలుకొని యుద్ధం వరకు దళిత మహిళల ప్రమేయంలేని చరిత్ర లేదు. దాన్ని మననం చేసుకోవడ మంటే అనాదిగా వారిపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలనడమే. 


-మల్లెపల్లి లక్ష్మయ్య 
(నేడు ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రారంభమైన రోజు)
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు