దేశభక్తికి గీటురాయి ఏది?

26 Oct, 2017 01:03 IST|Sakshi

♦ కొత్తకోణం

జల మధ్య అనైక్యతకు కారణాలేమిటి? అనైక్యతను పెంచి పోషిస్తున్నది ఎవరు, ఏ విధానాలు? అనే ప్రశ్నలను పక్కనపెట్టి, జాతీయ గీతాలాపనతో లేదా దాన్ని గౌరవించ డంతో మాత్రమే దేశభక్తిని చాటుకోగలమనడం అవివేకం. ప్రజల మధ్య ఐక్యత లోపించ డానికి కారణం సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాలు, వైవిధ్యాలు, వ్యత్యాసాలు, వివక్షలేననే వాస్తవాన్ని మరుగుపరిచే యత్నమే ఇది. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్‌ అంటున్నామంటే మనుషులను గౌరవించడమే నిజమైన దేశభక్తి అని చాటడమే.

‘‘మహాశక్తిపరులైన, మహా ప్రభావశీలురైన వజ్జియులను నేను నాశనం చేస్తాను. నామరూపాలు లేకుండా చేస్తాను’’ అంటూ మగధ రాజు అజాతశత్రువు తన మంత్రి వర్షకారుడితో అంటాడు. ఈ విషయమై గౌతమ బుద్ధుని అభిప్రాయం తెలుసుకొని రమ్మంటాడు. ఆ సమయంలో బుద్ధుడు రాజ గృహంలోని గృథ్ర కూట పర్వతంపై తన శిష్యులతో ఉంటాడు. అయితే మగధరాజు అజాత శత్రువు మంత్రి వర్షకారుడు గౌతమ బుద్ధుని చేరుకొని, అజాత శత్రువు ఆలోచనను తెలియజేస్తాడు. గౌతమ బుద్ధుడు తన శిష్యుడు ఆనందునితో ఆ విషయం గురించి మాట్లాడుతూ, ‘‘ఆనందా! వజ్జియులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు.

ఆనందుడు అవునంటాడు. బుద్ధుడు సంభాషణను కొనసాగిస్తూ, ‘‘సమావేశాల్లో వజ్జియులంతా కలసి కూర్చుంటారా? కలసి పనులు చేస్తారా? కలసి నడుస్తారా? ఆచరణాత్మకమైన నిబంధనలను మాత్రమే విధిస్తారా? విధించిన నిబంధనలను అమలు చేస్తారా? పెద్దలను గౌరవిస్తారా? మహిళలను సమాన భాగస్వాములుగా చూస్తారా? అత్యాచారాలు, వేధింపులు ఉండవా?’’ అని కూడా ప్రశ్నిస్తాడు. వాటికి కూడా ఆనందుడు అవుననే సమాధానమిస్తాడు. అప్పుడు బుద్ధుడు ఇటువంటి సాంప్రదాయం, విధివిధానాలు, మంచి నడవడిక, ప్రేమ, గౌరవం ఉన్నంత వరకు వజ్జియులు వృద్ధి చెందుతారే కానీ, వారిని ఎవ్వరూ జయించలేరని తేల్చి చెబుతాడు.

జాతీయతకు అర్థం సమనాత్వం, సామరస్యాలే
బుద్ధుని సుత్తపిటక దీఘనికాయ మహావగ్గలోని మహాపరినిర్వాణ సుత్తలో పేర్కొన్న అంశం ఇది. దాదాపు 2,600 ఏండ్ల క్రితం బుద్ధుడు ప్రజల మధ్య ఐక్యత ఉంటే ఎటువంటి ప్రమాదం వాటిల్లదని స్పష్టం చేశాడు. ప్రజల మధ్య సామరస్యం, ప్రేమ, గౌరవం, సమానత్వ భావన ఉంటేనే ఐక్యత సాధ్యమని, ఆ ఐక్యత వారి పురోభివృద్ధికి పునాదని దాని సారాంశం. ప్రజలు కుల, మత, భాషాభేదాలతో, ప్రాంతీయ తత్వాలతో ఉంటే ఆ దేశం పురోగమించడం సాధ్యం కాదని కూడా అర్థం. మన దేశంలో సామాజిక సాంస్కృతిక వైవిధ్యం చాలా ఎక్కువ. ఇక్కడ ఉన్నన్ని వైవిధ్యభరితమైన అంశాలు మరెక్కడా లేవు. వాటిని గౌరవించడం లేదు. అదేవిధంగా అన్ని రకాల వివక్షలు కూడా ఇక్కడ నెలకొని ఉన్నాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా భారత జాతీయత, భారత జాతి, దేశభక్తి నినాదాలు ముందుకొస్తుండటం విచారకరం. 

ఈ నేప«థ్యంలోనే సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన సమయంలో నిలబడి గౌరవం చూపాలనే అంశంపై నెలకొన్న వివాదాన్ని చూడాలి. గతంలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన తీర్పును పునరాలోచించుకోవాల్సి ఉందని, వ్యక్తి స్వేచ్ఛను హరించే ఎటువంటి చర్యనైనా న్యాయస్థానాలు సునిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని తాజాగా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం తరఫున మాట్లాడిన జస్టిస్‌ చంద్రచూడ్, భవిష్యత్‌లో సినిమా హాళ్లలోకి టీæ షర్ట్‌లు, షార్ట్‌లు (నిక్కర్లు) వేసుకొని రాకూడదంటే ఏం చేయాలి? జాతీయ గీతం ఆలపించకపోతే దేశభక్తి లేన ట్టా? అని కూడా ప్రశ్నించడం గమనార్హం. సామాన్యుడి మదిలోని మాటలను సుప్రీంకోర్టు వ్యక్తీకరించడం విశేషం.

జాతీయ గీతాలాపన ద్వారా దేశ ప్రజలందరినీ ఉత్తేజితులను చేసి, ఐక్యతను నెలకొల్పడమే లక్ష్యమని చెపుతున్నారు. ప్రజల మధ్య అనైక్యతకు కారణాలేమిటి? అనైక్యతను పెంచి పోషిస్తున్నది. ఎవరు? ఏ విధానాలు, ఏ వైఖరులు ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి? అనే ప్రశ్నలను పక్కనపెట్టి, కేవలం జాతీయ గీతాలాపనతో లేదా దాన్ని గౌరవించడంతోనే దేశభక్తిని చాటుకోగలమనడం అవివేకం. ప్రజలు ఐక్యంగా ఉండకపోవడానికి కారణం భారతదేశ సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాలు, వైవిధ్యాలు, వ్యత్యాసాలు, వివక్షలేననే వాస్తవాన్ని కప్పిపుచ్చే యత్నమే ఇది. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్‌ అన్న కవి వాక్యాలు... మనుషులను గౌరవించడమే నిజమైన దేశభక్తి అని ఎన్నడో చాటాయి.

‘జనగణమన’లో లేని ప్రజలు ఎవరు?
మనం జాతీయ గీతంగా ఆలపిస్తోన్న ‘జనగణమన’ గీతాన్ని 1911, డిసెం బర్‌ 27న కలకత్తాలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మొదటిసారిగా ఆలపించారు. ఆ తర్వాత, భారత పర్యటనకు వస్తున్న బ్రిటన్‌ రాజు కింగ్‌ జార్జ్‌ 5కు ఆహ్వానం పలుకుతూ తీర్మానం చేశారు. జనగణమన గీతం కింగ్‌ జార్జ్‌ను కీర్తిస్తున్నదిగానే అప్పటి పత్రికలు రాశాయి. స్టేట్స్‌మాన్, ఇంగ్లిష్‌మాన్‌ పత్రికలు డిసెంబర్‌ 28న ప్రచురించిన వార్తలు దీనికి సాక్ష్యం. ‘‘బ్రిటన్‌ చక్రవర్తికి స్వాగతం తెలుపుతూ బెంగాలీ కవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన గీతాన్ని ఆలపించారు’’ అని స్టేట్స్‌మాన్‌ పత్రిక రాసింది.

ఆ తర్వాత ఈ గీతంపై చెలరేగిన వివాదంపై రవీంద్రనాథ్‌ టాగూర్‌ 1937, నవంబర్‌ 10న పత్రికాసంపాదకులు పులిన్‌ బిహరిసేన్‌కు ఒక ఉత్తరం రాస్తూ, ‘‘ఇది ఒక రాజును, చక్రవర్తిని దృష్టిలో పెట్టుకొని రాయలేదు. భారతదేశ దశ, దిశ నిర్దేశకుడు, దైవసమానమైన వారెవరైనా దీనికి అర్హులే. ఒక ప్రభుత్వాధికారి విజ్ఞప్తిమేరకే ఇది రాశాను. అయితే దీనిని ఒక వ్యక్తికి పరిమితం చేయరాదు’’ అని సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ కొంత కాలం క్రితం ఒక వ్యాసం రాస్తూ, ఆ గీతంలో ఎక్కడా దేశాన్ని, మాతృభూమిని పొగుడుతున్నట్టు లేదని సోదాహరణంగా వివరించారు. ఈ గీతం దేశభక్తి పూరితమైనదేనని అనుకున్నా, అందులో చాలా లోటుపాట్లున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలను ఆ గేయం ప్రస్తావించదన్న విమర్శ ప్రధానమైనది.

1911లో ఆ గీతం రాసేనాటికి మన దేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలు ఈ రోజు భారతదేశంలో లేవు. ఇప్పుడే కాదు నాడు కూడా భారత దేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాల పేర్లు అందులో కనిపించవు. పంజాబు సింధ్, గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ అని ఉంది. సిం«ద్‌ ఈ రోజు మన దేశంలో లేదు. అదేవిధంగా దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల పేర్లు ఒక్కటి కూడా లేవు. అన్నిటికీ కలిపి ద్రావిడ అన్న పదమే వాడారు. గంగా, యమునా నదులపేర్లే తప్ప దక్షిణ భారతదేశంలోని ఎన్నో నదుల పేర్లు కనిపించవు. ఈ కారణంగా కూడా కొన్ని ప్రాంతాల ప్రజలు జాతీయగీతంతో తమ అనుబంధాన్ని ఊహించుకోలేకపోయారు. అయినా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు జాతీయగీతాన్ని చాలా సందర్భాల్లో ఆలపిస్తున్నారు, గౌరవిస్తున్నారు. జాతీయ గీతాన్ని దేశభక్తికి ప్రతీకగా చూస్తున్నారు. మంచిదే. కానీ దేశభక్తి. జాతీయత భావన ఉండాలంటే ముందు దేశంలో ప్రజాస్వామ్య విలువలకు స్థానముండాలి. భావప్రకటనా స్వేచ్ఛకు అవకాశం ఉండాలి. 

భారతదేశం విభిన్న జాతుల, భాషల, కులాల, మతాల, ప్రాంతాల సంగమం. ఇటువంటి దేశాన్ని ఐక్యం చేయడానికి ప్రభుత్వాధినేతలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలతో కూడిన కార్యక్రమం కావాలి. కానీ నిర్బంధ విధానాలు కాదు. ఈ దేశంలో మూడు వేలకు పైగా కులాలు, 25 వేల ఉపకులాలు, దాదాపు 1,208 అంటరాని కులాలు, 705 గిరిజన తెగలు ఉన్నాయి. దేశంలోని మొత్తం 1,721 రకాల భాషల్లో 122 ప్రధాన భాషలు కాగా, 22 భాషలను అధికారికమైనవిగా గుర్తించారు. చిన్న చిన్న తెగలు, కులాలు మాట్లాడే భాషలు మరో 1,599 ఉన్నాయి. అధికార భాషలుగా అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రి, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మైతేయి(మణిపురి), మరాఠీ, నేపాలి, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలి, సింధ్, తమిళ్, తెలుగు, ఉర్దూలను గుర్తిం చారు. ఈశాన్య రాష్ట్రాల్లో మాట్లాడే భాషలుగానీ, మెజారిటీ ఆదివాసులు మాట్లాడుకునే గోండీ, కోయ భాషల లాంటివిగానీ గుర్తింపుకు నోచుకోలేదు. ఇది వివిధ భాషల మధ్య వివక్షకు నిదర్శనం.

దేశభక్తి వెల్లివిరియాలంటే...
వీటన్నింటితో పాటు భారతదేశం ఏకీకృతమైనదేమీ కాదు. వలస పాలనా కాలంలో దేశం అంతా ఒక పాలన కిందికి వచ్చిందని భావిస్తుంటాం. కానీ అది కూడా నిజం కాదు. భారత దేశం స్వాతంత్య్రం పొందేనాటికి దాదాపు 565 సంస్థానాలు బ్రిటిష్‌ పాలనకు అవతల తమ అస్తిత్వాన్ని కొనసాగించాయి. దేశం ఏకీకృతం కావడానికి చాలా ప్రయత్నం జరిగింది. హైదరాబాద్‌లాంటి ప్రాంతం సైనిక చర్య ద్వారా భారత్‌లో విలీనమైంది. అంటే దేశంలోని ప్రాంతాలన్నీ ఒకే సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగినవి కావు. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను మిగతా ప్రాంతాల వారు తమకు సమానులుగా చూసే పరిస్థితి లేదు. బెంగళూర్, హరియాణా, ఢిల్లీలాంటి ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల మీద, మహారాష్ట్రలో బిహారీల మీద దాడులను చూశాం.

అదేవిధంగా కులాల మధ్య అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటరాని కులాల పట్ల వివక్ష, దాడుల గురించి చెప్పక్కర్లేదు. ఆదివాసీలను అడవి నుంచి తరుముతున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. మతం పేరుతోనో, ఖనిజ సంపద పేరుతోనో వారిపైన జరుగుతున్న దాడులు వర్ణనాతీతం. వారిని వారి అడవి నుంచి తరిమికొట్టేందుకు పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతున్న దారుణ పరిస్థితి ఉంది. వారందరినీ ఈ దేశస్తులుగా చూస్తున్నారా? అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. ఆహారపు అలవాట్ల పేరిట, ఇతర రకాల సాంప్రదాయాల పేరిట ఇటీవల మైనారిటీలపై దాడులు, హత్యలు పెచ్చుపెరుగుతున్నాయి. దేశభక్తి అంటే నేల, నీరు, నిప్పు కాదు. దేశమంటే జనం. ప్రజల మధ్య సత్సంబంధాలు. మనుషులందరినీ ఒక్కటిగా చూసే భావన.

మనిషిని మనిషి గౌరవించే సత్సంప్రదాయం. పౌరుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసే వాతావరణాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం. ఇవేవీ చేయకుండా సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని వింటూ నించుంటే దేశభక్తి వస్తుందా? అది భయపెట్టి కల్పించగలిగేదేనా? కానే కాదు. ప్రజలందరికీ సమానావకాశాలు, సమాన గౌరవం, కల్పించే ప్రజాస్వామిక విధానాలు అమలు జరగాలి. దేశభక్తిని పెంపొందించడానికి వ్యక్తి స్వేచ్ఛకు హామీని కల్పించాలి, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలకు స్వస్తిపలకాలి. దేశ ప్రజల మధ్య వ్యత్యాసాలను, వివక్షలను, వైమనస్యాలను తొలగించనిదే దేశభక్తిని ప్రేరేపించడం సాధ్యం కాదు. సమాజంలోని ఆర్థిక, సామాజిక, వ్యత్యాసాలను, వివక్షలను తొలగించి, భద్రత, ఆత్మగౌరవం గల జీవితాన్ని ప్రజలకు అందిస్తేనే దేశభక్తి ఇంద్రధనుస్సులా వెల్లివిరిసేది.


మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 

మరిన్ని వార్తలు