దేవుడికీ తప్పని కుల వివక్ష

29 Aug, 2019 01:14 IST|Sakshi

కొత్త కోణం

కుల వ్యవస్థ ఈ దేశంలోని కోటానుకోట్ల దేవుళ్ళలోనూ దళిత దేవుళ్ళ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది.  దేశ రాజధాని ఢిల్లీలో 500 ఏళ్ళ కిందట నిర్మితమైన సంత్‌ రవిదాస్‌ మందిర్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఒక్క ఉదుటున కూల్చివేసింది. అది ప్రభుత్వం గుర్తించిన అడవిలో ఉన్నందువల్ల దానిని తొలగించాలని ఢీడీఏ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టు కూడా తోసిపుచ్చింది. 1450లో వారణాసిలో అంటరాని కులంలో జన్మించిన సంత్‌ రవిదాస్‌ కుల వివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ, ప్రారంభించిన భక్తి ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. సంత్‌ రవిదాస్‌ తన జీవితకాలంలో ఈ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కలగజేశారు. ఏ దేవుడైనా దేవుడే అన్నప్పుడు తక్కువ కులాల దేవుడికో నీతి, అగ్రకుల దేవుళ్ళకో నీతి ఎలా ఉంటుంది. ఈ ద్వంద్వ నీతి పేరే కుల వివక్ష.

మానవ అభ్యున్నతికి పాటుపడిన మహనీ యులను దేవుళ్ళతో సమంగా తలుస్తారు. రాళ్ళూ రప్పల కంటే సమాజానికి ఏదో ఒకటి చేసి చనిపోయినవారిని కొలవడంలో తప్పుపట్టాల్సిన పనిలేదు. కాకపోతే భారత దేశానికి మాత్రమే పరిమితమైన కుల వ్యవస్థ ఈ దేశంలోని కోటానుకోట్ల దేవుళ్ళలోనూ దళిత దేవుళ్ళ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. సరిగ్గా ఇదే కోణంలో సంత్‌ రవిదాస్‌ దేవాలయం కూల్చివేతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయిదు వందల ఏళ్ళ కిందట నిర్మితమైన సంత్‌ రవిదాస్‌ మందిర్‌ను ఢిల్లీ డెవలప్‌ మెంట్‌ అథారిటీ ఒక్క ఉదుటున కూల్చివేసింది. 

1992లో ఢిల్లీ డెవ లప్‌మెంట్‌ అథారిటీ రవిదాస్‌ మందిర్‌ను అక్కడి నుంచి తొలగించా లని, మందిర్‌ నిర్వాహకులకు నోటీసులు జారీచేసింది. ఆ మందిర్‌ ప్రభుత్వం గుర్తించిన అడవిలో ఉన్నందువల్ల దానిని తొలగించాలని ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే మందిర్‌ నిర్వాహకులు దీనిని వ్యతిరేకిస్తూ, న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు. కానీ న్యాయస్థానాలలో సంత్‌ రవిదాస్‌ మందిర్‌ నిర్వా హకుల మాట చెల్లుబాటు కాలేదు. అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి దానిని తొలగించాలని న్యాయస్థానం నిర్ధారించింది. అందుకను గుణంగానే ఈనెల మొదటి వారంలో ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ రవిదాస్‌ మందిర్‌ను నిలువునా కూల్చివేసింది. ఈ సంఘటన పంజాబ్, హర్యానాలతో సహా ఉత్తర భారతాన్ని ఓ కుదుపు కుదిపే సింది. 

రవిదాస్‌ మందిర్‌ను కూల్చివేసినందుకు ఆగస్టు 21వ తేదీన ఢిల్లీలో వేలాది మంది నిరసన ప్రదర్శన చేశారు. రవిదాస్‌ సాంప్రదా యాన్ని అవలంభిస్తున్న వాళ్లే కాకుండా, అనేక సంఘాల కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పంజాబ్, హర్యానాల్లో రోజుల తరబడి నిరసనలు వెల్లువెత్తాయి. సంత్‌రవిదాస్‌ మందిర్‌ను కూల్చడం వెనుక కుల వివక్ష, సామాజిక అణచివేతలే కారణమని భావించక తప్పదు. సంత్‌ రవిదాస్‌ మందిర్‌ చరిత్రను పరిశీలిస్తే, ఈ వాదనకు బలం చేకూరుతుండడం కూడా సుస్పష్టం. 

సంత్‌ రవిదాస్‌ 1450 సంవత్సరంలో వారణాసిలోని అంటరాని కులంలో జన్మించారు. ఆయన కుటుంబం చర్మకార వృత్తిలో జీవితం సాగిస్తుండేది. అప్పటికే పంజాబ్‌తో సహా ఉత్తర భారతదేశంలో సిక్కుమతం పురుడు పోసుకుంటోంది. సంత్‌ రవిదాస్‌ కూడా అదే తరహాలో కుల వివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ, తన భక్తి ఉద్య మాన్ని ప్రారంభించాడు. సిక్కు మత వ్యవస్థాపకులైన గురునానక్‌ను సంత్‌ రవిదాస్‌ కలిసినట్టు సంత్‌ రవిదాస్‌ రాసిన కొన్ని పద్యాలు సిక్కు మత పవిత్ర గ్రంథమైన ‘‘ఆదిగ్రం«థ్‌’’లో పొందుపరిచినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. సంత్‌ రవిదాస్‌ అనుచరులు క్రమంగా సిక్కుమతంలో చేరిపోయారు. కానీ అక్కడ కూడా కుల వ్యవస్థ పైశాచికత్వం కోరలు చాచింది. అంటరాని కులాల్లో సైతం కుల వివక్ష కొనసాగింది. 

దానిని నిరసించిన వాళ్ళు ప్రత్యేకంగా రవిదాస్‌ మందిర్‌ను నిర్మించుకొని తమ సాంప్రదాయాలను కొనసా గిస్తూ వచ్చారు. వీరంతా చమార్‌ల నుంచి వచ్చినప్పటికీ. వీరిని రవి దాసియా చమార్‌లుగా పిలిచారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ వ్యవస్థాప కులు కాన్షీరాం ఈ సామాజిక నేపథ్యం నుంచి వచ్చినవారే. రవిదాస్‌ సాంప్రదాయానికి చెందిన రామానంద్‌దాస్‌ను 2009లో వియన్నాలో కొంత మంది హత్యచేశారు. సిక్కు అగ్రకుల శక్తులే ఈపని చేశారని భావించిన రవిదాస్‌ అనుచరులు తమకు తాముగా ప్రత్యేక మతంగా ప్రకటించుకున్నారు. కానీ రవిదాస్‌ సంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ప్రధాన గురుద్వారాలలో భాగస్వాములు కాలేకపోయారు. 

పదిహేనవ శతాబ్దం నుంచి ప్రారంభమైన సంత్‌ రవిదాస్‌ భక్తి ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. కుల వివక్షను బద్దలు కొట్టుకొని, కొన్ని వేల మంది విదేశాలలో ఈ రోజు స్వేచ్ఛా జీవులుగా గడుపుతున్నారు. భారతదేశం నుంచి విదేశాల్లో స్థిరపడిన పంజాబీలలో సగం మందికి పైగా సంత్‌ రవిదాస్‌ భక్తులే ఉంటా రంటే ఆశ్చర్యం లేదు. సంత్‌ రవిదాస్‌ తన జీవితకాలంలో ఈ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కలగజేశారని చెప్పొచ్చు. ఆయన వారణాసి ప్రాంతంలోనే కాదు, దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించి ఎంతో మందిని తన మార్గంలోకి తీసుకొచ్చారు. ఆ క్రమం లోనే ఆయన ఢిల్లీని సందర్శించి, అప్పటి ఢిల్లీ సుల్తాన్‌ సికిందర్‌లోడి మన్ననలు పొందారు. 

అందుకు గాను ఆయన సంత్‌ రవిదాస్‌కు ఢిల్లీలో ఇప్పుడున్న ప్రాంతంలో కొంత భూమిని కేటాయించి, ఆశ్రమ నిర్మాణానికి అవకాశమిచ్చారు. అప్పటి నుంచి అదే స్థలంలో సంత్‌ రవిదాస్‌ మందిర్‌ నిర్మాణం జరిగింది. 1949లో గురు రవిదాస్‌ జయంతి ఉత్సవ సమితి ఏర్పాటై, అక్కడ కొన్ని వసతులతో కూడిన రవిదాస్‌ మందిర్‌ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 1949లో ప్రారంభమైన ఆ నిర్మాణం 1954లో పూర్తయ్యింది. అప్పటి రైల్వే శాఖా మంత్రి జగజ్జీవన్‌ రాం 1954లో దానికి ప్రారంభోత్సవం చేశారు. దాదాపు అయిదు వందల ఏళ్ళకు పైగా గురు రవిదాస్‌ బోధనలకు కేంద్రమైన ఈ మందిర్‌ను 1992లో అటవీప్రాంతంలో ఉన్నదని నోటీసులు ఇచ్చి, 2019లో కూల్చి వేశారు. దీన్ని బట్టి చూసినా ఇది కేవలం వివక్షతో చేసిందన్న విషయం సుస్పష్టం. 

ఒకవేళ గురు రవిదాస్‌ మందిర్‌ అటవీ ప్రాంతంలో ఉన్నదంటే, చాలా దేవాలయాలు, ఆశ్రమాలూ, అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఢిల్లీలోనే చూసినట్లయితే ప్రభుత్వం గుర్తించిన ఆరు అటవీ ప్రాంతాలు ఉన్నాయి. పాత ఢిల్లీలోని నార్తరన్‌ రిడ్జ్, మంగేర్‌ బని అడవి, రాజోక్రి అటవీప్రాంతం, జహన్‌పన సిటీ ఫారెస్ట్, తుగ్లక్‌ బాద్‌ రిడ్జ్‌ ఫారెస్ట్, సంజయ్‌ వనం వాటిపేర్లు. సంజయ్‌ వనంలో రామ్‌ తలాబ్‌ మందిర్, ప్రాచీన గురు గోరఖ్‌నాథ్‌ మందిర్, తుగ్లక్‌ బాద్‌ అడవిలో కాళి బారిదేవాలయం ఉన్నాయి. వీటిలో వేటికీ కూడా నోటీసులు లేవు. కూల్చివేతలు లేవు. ఒకవేళ రక్షిత అటవీ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలూ ఉండకూడదని భావిస్తే ఈ దేవాలయాలను కూడా తొలగించడానికి ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ తన అధికారాలను ఉపయోగించి ఆ పనిచేయాలి. 

కానీ అలా జరగలేదు. అంతేకాదు, ఈ దేశంలోని దేవాలయాలలో సగానికిపైగా రక్షిత అటవీ ప్రాంతంలోనే నిర్మితమై ఉన్నాయి. కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం సహా చాలా దేవాలయాలు మంగళదేవి, దేవియార్‌ ఫారెన్‌ టెంపుల్, కర్ణాటకలోని హిమావత్‌ గోపాలస్వామి దేవాల యం, ఉత్తరాఖండ్‌లోని అనేక దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరు పతి, శ్రీశైలం అహోబిలం ఇట్లా చెప్పుకుంటూపోతే కొన్ని వందల పేర్లు వస్తాయి. ఇక్కడ పొరపాటు పడొద్దు. ఈ దేవాలయాలను కూల్చాలనో, తొలగించాలనో నా అభిప్రాయం కాదు. ఏ దేవుడైనా దేవుడే అన్నప్పుడు తక్కువ కులాల దేవుడికో నీతి, అగ్రకుల దేవు ళ్ళకో నీతి ఎలా ఉంటుంది అన్నదే నా ప్రశ్న. ఈ ద్వంద్వ నీతి పేరే కుల వివక్ష. 

నిజానికి ఈ పాపంలో కాంగ్రెస్‌ పార్టీకి భాగమున్నది. 1992లో ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ నోటీసులు ఇచ్చినప్పుడే ఈ చర్యని అడ్డుకోవాల్సింది. ఆ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, సానుభూతి తెలి పితే ప్రయోజనమేముంటుంది? పోనీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా ఎందుకు దీనిని పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇది పూర్తిగా సామాజిక వివక్ష, అణచివేత, వెలివేతలకు ఒక నిలువెత్తు నిదర్శనం. పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఎన్నో ప్రాజెక్టులకు రక్షిత అటవీ ప్రాంతాల్లో రిజర్వు ఫారెస్ట్‌లలో, అభయా రణ్యాలలో రహదారులకు, రైల్వే లైనులకు, పరిశ్రమలకు అనుమతి ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఒకటì æరెండున్నర ఎకరాల రవిదాస్‌ మందిరానికి మినహాయింపు ఇవ్వలేకపోవడం ఏ సామాజిక న్యాయాన్ని సూచిస్తున్నది? రోడ్లకి అడ్డంగా కుప్పలుగా పుట్టుకొస్తోన్న దేవాలయాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరిస్తోంటే, దాన్ని వదిలేసి, ఎక్కడో అడవిలో కట్టుకున్న ఆలయాన్ని సైతం నిర్దాక్షి ణ్యంగా కూల్చేయడం లోని మతలబుని అర్థం చేసుకోలేనంత వెర్రి జనం కాదుకదా ప్రజలు. 

కోట్లాది మంది దళితులు, ప్రజాస్వామ్య వాదులు డిమాండ్‌ చేస్తున్నట్టుగా ఇప్పటికే తప్పును సరిదిద్దుకొని, ఆ స్థలంలోనే గురు రవిదాస్‌ మందిరాన్ని నిర్మించి ప్రాయశ్చిత్తం చేసు కోవాల్సిన అవసరం ఉంది. లేదంటే దేవాలయాల్లో దళితుల ప్రవే శాన్ని అడ్డుకున్నట్టే, నేడు దళితుల దేవుళ్లని చివరకు అడవినుంచి సైతం తరమికొట్టే ప్రయత్నాలుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే వాటిని కాపాడుకోవడానికి ఆ వర్గాలు మరో మహోద్య మానికి ఉద్యుక్తులు కావాల్సి వస్తుంది.


వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు