రాష్ట్రాల మధ్య భాషా సమస్యలు

21 Feb, 2019 01:11 IST|Sakshi

సందర్భం 

మన దేశంలోని అన్ని వ్యవస్థలు ఇంగ్లిష్‌ భాషని ఎక్కువగా ఉపయోగిస్తు న్నాయి. ఒక వ్యక్తి చాలా భాషలు నేర్చుకున్నప్పటికీ తన మాతృ భాషకి ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకమైనది.  ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజల భాషని అధికార భాషగా అమలు చేసుకునే సౌకర్యాన్ని మన రాజ్యాంగం కల్పించింది. అందుకని తెలుగుని అధికార భాషగా ఉమ్మడి రాష్ట్రం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం కూడా గుర్తించింది. ప్రభుత్వ, న్యాయపాలనలో తెలుగుని ఎక్కువగా వాడటంవల్ల పాలన ప్రజలకి చేరువవు తుంది. తెలుగులో తీర్పులతో బాటూ, తెలుగులో న్యాయ శాస్త్రానికి సంబంధించి ఓ యాభై పుస్తకాలు రాశాను. తెలుగులో న్యాయపాలన దిశగా అవసర   మైనంత కృషి జరగడంలేదని గొంతు చించుకున్న వ్యక్తుల్లో నేనూ ఉన్నాను.

కింది కోర్టుల్లో మాతృ భాషలో న్యాయపాలన జరగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తీర్పులని పై కోర్టుల్లో సవాలు చేసినప్పుడు వాటికి ఇంగ్లిష్‌ అను వాదం పంపించాల్సిన అవసరం ఉంది. మరో రకంగా చెప్పాలంటే మనకి కూడా ఓ దేశ భాష అవసరం అయిపోయింది. ఆ స్థానాన్ని హిందీ భాష కాకుండా ఇంగ్లిష్‌ ఆక్రమించింది. హైకోర్టుల్లో సుప్రీం కోర్టుల్లో వివిధ భాషలకి చెందిన న్యాయమూర్తులు ఉంటారు. అందుకని దేశ భాష అవసరం అయి పోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో న్యాయపాలన, ప్రభుత్వ పాలన ఇంగ్లిష్‌లోనే ఎక్కువగా జరుగు తుంది. హిందీ రాష్ట్రాల్లో, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ పాలన, న్యాయ పాలన వాళ్ల భాషల్లో జరుగుతుంది. చాలా మంచి పరిణామం. అయితే నేర న్యాయ వ్యవస్థ పాలన వాళ్ల భాషలోనే జరగడంవల్ల కొన్ని చిక్కులు ఉన్నాయి.

భీమా, కోరేగావ్‌ కేసులో చాలామంది వ్యక్తులని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మన రాష్ట్రం లోనూ ఆ కేసుకి సంబంధించి ప్రముఖ కవి వరవర రావుని పోలీసులు అరెస్టు చేసి టాన్సిట్‌ వారంట్‌ కోసం చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజ రుపరిచారు. ఆ తరువాత ఆయన్ని పుణేలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. అప్పటికి సుప్రీంకోర్టు వాళ్లని గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఆయనని మళ్లీ హైదరాబాద్‌ తీసుకునివచ్చి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ అరెస్టుకి భాషకి సంబం ధం ఉంది. వీవీని అరెస్టు చేసి, మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచినప్పుడు, వాళ్లు హైదరాబాద్‌ కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ మరాఠీలో ఉన్నాయి. ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతనికి రిమాండ్‌ రిపోర్టుని ఇవ్వాలి. అది ఇతర భాషల్లో ఉంటే దాని ఇంగ్లిష్‌ అనువాదాన్ని ఇవ్వాలి. ఈ కేసులో మేజిస్ట్రేట్‌కి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ మరాఠీలోనే ఉన్నాయి. ఆ మెజిస్ట్రేట్‌కి మరాఠీ రాదు. వాటి తర్జుమాని నాకు ఫలానా వాళ్లు చేశారన్న నోట్‌ కూడా మేజిస్ట్రేట్‌ చేయ లేదు. కానీ వీవీని రిమాండ్‌ చేసి çపుణే కోర్టులో హాజరుపరచమని ఆదేశాలు జారీ చేశారు. ఎవరినైనా రిమాండ్‌ చేసే ముందు అతనిపైన ఆరోపించిన నేరా లకి గట్టి ఆధారాలు ఉన్నాయా లేదా అని మేజిస్ట్రేట్‌ చూడాలి. ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడే రిమాం డ్‌ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సిట్‌ రిమాండ్‌కి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ విధంగా చేయనప్పుడు ఆ రిమాండ్‌ చట్ట వ్యతిరేకమవుతుంది. ఈ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకోకపోవడం, ఇతర భాషల్లో డాక్యుమెంట్స్‌ ఉండి, ఆ భాష ఆ మేజి స్ట్రేట్‌కి తెలియనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని కూడా హైకోర్టు నిర్దేశించకపోవడం బాధ కలిగించే అంశం. ఇదే కేసులో గౌతమ్‌ నవలఖాని కూడా పోలీ సులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ ట్రాన్సిట్‌ రిమాండ్‌ని రద్దు చేసింది. ప్రజల భాషలో న్యాయపాలన జరగడం అత్యంత అవశ్యం. అయితే పై కోర్టులకి కేసు వెళ్లిన ప్పుడు అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో అరెస్టులు చేసి నప్పుడు అవసరమైన చర్యలని పోలీసులు, ఇతర అధికారులు తీసుకోవా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భీమా, కోరేగావ్‌ కేసులో భాషవల్ల ఉత్పన్న మైన సమస్యవల్ల ప్రజల భాషలో పరిపాలన అవసరం లేదు. దేశీ భాష ఇంగ్లిష్‌లో జరగాలని అనడం సమంజసమా?

న్యాయస్థానాల్లో వాదోపవాదాలు, కార్యకలా పాలు, తీర్పులు ప్రజల భాషలో కాకుండా, వారికి అర్థంకాని భాషలో జరిగినప్పుడు ఆ వ్యవస్థపట్ల వారికి నమ్మకం సడలిపోతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నప్పుడు, అరెస్టులు చేస్తున్న ప్పుడు అక్కడి ప్రజల భాషలో లేదా దేశ భాషలో జరగాలి. అలా జరగనప్పుడు న్యాయవ్యవస్థ మీద, దర్యాప్తు సంస్థలమీద విశ్వాసం ఉంటే అవకాశం లేదు. భాష మన అస్తిత్వానికి చిహ్నం. భాషవల్ల ఉత్పన్నమయ్యే సమస్యలని అధిగమించాలి తప్ప, ప్రజల భాషలో న్యాయపాలన జరగకూడదనీ అను కోవడం సమంజసం కాదు. (నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)

వ్యాసకర్త : మంగారి రాజేందర్‌ (గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులుగా పనిచేశారు)
మొబైల్‌ : 94404 83001
 

మరిన్ని వార్తలు