మీనాక్షీ

3 Jul, 2018 01:31 IST|Sakshi
జ్యోతిర్మయం

అమ్మవారి మీద ముత్తు స్వామి దీక్షితుల వారు రచించిన ఎన్నో కృతులలో ‘మీనాక్షీ! మే ముదం దేవా!’ అన్న కృతి చాలా ప్రసిద్ధం. అందులో ఆమెను దీక్షితుల వారు ‘మీన లోచనీ! పాశమోచనీ!’ అని కూడా సంబోధిస్తారు. జగజ్జననిని ఆరాధించే భక్తులకు చేపల ఆకారంతో అత్యంత సుందరంగా ఉండే ఆ కన్నుల నుంచి ప్రసరించే కటాక్ష వీక్షణం– కడగంటి చూపు– కావాలి. ఫలానా దుఃఖం పోగొట్టమనీ, ఫలానా సుఖం కలిగించమనీ ఆమెను ప్రత్యేకంగా వేడుకోనక్కర్లేదు. ఆమె చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే భావిస్తారు.ఇలా భావించటం వెనుక ఒక ప్రకృతి విచిత్రం ఉన్నది. ప్రకృతిలో ప్రాణులన్నిటికీ తమ సంతానం మీద మమతానురాగాలు ఉండటం స్వాభావికం. కోతులలో పిల్ల కోతులు, తల్లి పొట్టను తామే గట్టిగా కరచుకొని తల్లితో వెళుతుంటాయి. బిడ్డ శ్రద్ధగా ఉంటేనే తల్లి సహకారం లభిస్తుంది. ఇది ‘మర్కట కిశోర న్యాయం’. పిల్లి పిల్లలది మరో దారి. తల్లి పిల్లి పిల్లను అతి జాగ్రత్తగా నోట కరచుకొని తనతో తీసు కువెళ్లి వాటిని సురక్షితంగా ఉంచుతుంది. ఇక్కడ తల్లి ప్రమేయమే ఎక్కువ, పిల్లలేమీ చేయనక్కర్లేదు.

ఇది ‘మార్జాల కిశోర న్యాయం’. పక్షులు పిల్లల్ని మోయవు.  కేవలం గుడ్లు పెడతాయి. వాటిని అవసరమైనంత మేరకు తమ శరీరాలతో పొదిగి, తమ శరీరం వేడిని వాటికిచ్చి, అవి ఎదిగేందుకు దోహదం చేస్తాయి. పక్షుల పిల్లలకు ఆ మాత్రమే చాలు. తాబే ళ్లది వేరే మార్గం. తల్లి తాబేలు గుడ్లు పెట్టి ఎటో వెళ్లి పోతుంది. ఎటు వెళ్లినా ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుందట. చేపలలో మాతృత్వం మరీ చిత్రం. చేప కూడా గుడ్లు పెడుతుంది. పెట్టిన తరువాత వాటికి దూరంగా జరుగుతుంది. దూరాన్నుంచి వెనక్కు తిరిగి తన చూపులు మాత్రం ఆ గుడ్ల మీద ప్రసరింపజేస్తుంది. ఆ తల్లి చేప చల్లని చూపు శక్తి వల్ల, గుడ్లు పొదిగి పిల్లలై తమ జీవితాలు తాము జీవిస్తాయి. అలాగే భగవతికీ భక్తులకూ ఉండే సంబంధం కూడా తల్లీ బిడ్డలవంటి సంబంధమే. అమ్మవారిని ‘మీనాక్షి’ అనటంలో ఉద్దేశం ఆమె కళ్లు మీనాల ఆకారంలో అందంగా ఉంటాయని వర్ణించటమే కాదు. తల్లి చేప తన చల్లని చూపుల మంత్రంతో తన బిడ్డలకు వృద్ధిని కలిగించినట్టు, జగ జ్జనని కూడా తన భక్తులకు చల్లని చూపుల మంత్రం ద్వారా సర్వైశ్వర్యాలని ప్రసాదించగలదన్న సూచనను కూడా గమనించమంటారు పెద్దలు.
– ఎం. మారుతి శాస్త్రి 

మరిన్ని వార్తలు