మేఘన్‌ మార్కెల్‌ రాయని డైరీ

9 Feb, 2020 04:03 IST|Sakshi

సంతోషంగా ఉంది. ఈ సమ్మర్‌కి లాస్‌ ఏంజెలిస్‌కి షిఫ్ట్‌ అయిపోతున్నాం నేనూ, ప్రిన్స్‌ హ్యారీ, ఆర్చీ. మే ఆరుకు ఏడాది నిండుతుంది ఆర్చికి. పెద్ద రెడ్‌ కార్పెట్‌ పరిచి లాస్‌ ఏంజెలిస్‌ లోనే ఆస్కార్‌ వేడుకలంత ఘనంగా చేయాలి ఆర్చి ఫస్ట్‌ బర్త్‌డేని.‘‘చేద్దామా అలా.. హ్యారీ’’ అని అడిగాను. నవ్వాడు. ‘‘వేడుక అంటే ముందొచ్చి కూర్చుం టాయి మీడియా దెయ్యాలు. ఆర్చి జడుసు కుంటాడు. ఏకాంతంగా ఏ దీవి లోనికైనా వెళ్లిపోదాం. నువ్వు, నేను, ఆర్చి..’’ అన్నాడు. అతడి కళ్లలోకి చూశాను. మీడియా తన తల్లి ప్రిన్సెస్‌ డయానాను మింగేసిన కోపం, ఆ కళ్లలో నేటికీ కనిపిస్తూనే ఉంది. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచేవాడు. ‘ఏమైంది హ్యారీ?’ అని దగ్గరకు తీసుకునే దాన్ని. ‘మా అమ్మ..  మా అమ్మ.. దెయ్యాలు తరుముకుంటుంటే వాటి నుంచి తప్పించుకోడానికి పరుగులు తీస్తోంది. హ్యారీ నువ్వు జాగ్రత్త.. హ్యారీ నువ్వు జాగ్రత్త అని అరుస్తూ నేనెక్కడున్నానా అని నన్ను వెతుక్కుంటోంది. దెయ్యాలు తరుము కుంటుంటే తను కదా జాగ్రత్తగా ఉండాల్సింది. నన్ను జాగ్రత్తగా ఉండమంటోంది..’ అని చెప్పేవాడు.
 
ఆమే బతికి ఉంటే నా భర్త హ్యారీ కూడా ఆమె తర్వాతే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయ్యేవాడు. ఒక ఆడపిల్ల ఆశలు ఎలా ఉంటాయో ఆమెకు తెలుసు. ఒక ఆడపిల్ల కోరుకునే స్వేచ్ఛకు ఎలాంటి పంజరాలు తయారవుతూ ఉంటాయో ఆమెకు తెలుసు.ప్రిన్సెస్‌ డయానా చనిపోయారన్న వార్త విన్నప్పుడు.. నేను టీనేజ్‌లో ఉన్నాను. అయ్యో అనిపించింది. నా వ్యక్తిత్వానికి ఆమె ఒక అభౌతిక స్వరూపం.  ప్రిన్సెస్‌ డయానా ఎంత అందంగా, ఎంత సహజంగా, ఎంత చలాకీగా ఉండేవారు! ఫొటోల్లో చూస్తుండేదాన్ని. లోపల ఉన్న ఏ బాధనో బయటికి రానివ్వని ఆమె హృదయపు లావణ్యాన్ని చాలాసార్లు పట్టుకున్నాను ఆ ఫొటోల్లో. ‘‘సరే హ్యారీ, లాస్‌ ఏంజెలిస్‌లోని మన కొత్త ఇంటినే ఏకాంత దీవిలా మార్చు కుందాం’’ అని చెప్పాను. హ్యారీకి కెనడా నచ్చింది కానీ, నేను పుట్టి పెరిగిన లాస్‌ ఏంజెలిస్‌ ఇంకా బాగా నచ్చుతుందని చెప్పి ఒప్పించాను.

మా పెళ్లయ్యాక రెండు సమ్మర్‌లు రాణి గారి భవంతిలో ఎలా గడిచాయో తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేనా అక్కడుంది! నేనేనా కాలిపై కాలు వేసుకుని కూర్చోకుండా, మోకాళ్లు రెండూ కలిపి ఒద్దికగా కూర్చోవాలన్న రాణి గారి ఆదేశాన్ని పాటించింది! నేనేనా నా తోడికోడలు కేట్‌ మిడిల్టన్‌ మాటలకు రాని నవ్వు నవ్వింది! నేనేనా నా భర్త హ్యారీతో రాజమాత ముభావంగా ఉంటే ‘ఏంటలా ఉన్నారు? నా భర్త చేసిన తప్పేమిటి?’ అని అడక్కుండా ఉండగలిగింది! నేనేనా నేను వేసే ప్రతి అడుగుకూ సమ్మతి తీసుకుని, నేను వేసిన ప్రతి అడుగుకూ సంజాయిషీ ఇచ్చుకుంది! బ్రిటన్‌లో ఏడాదికి ఒకే సమ్మర్‌ ఉంటుంది. రాణిగారింట్లో ఏడాదంతా సమ్మరే!! ‘‘ప్రిన్స్‌ హ్యారీ, ఇకనుంచీ మీరు మీ అభీష్టానుసారం ఇక్కడ ఉండొచ్చు. ఈ రాజ్యానికి మీరే రాజు’’ అన్నాను.. లాస్‌ ఏంజెలిస్‌లో ఫ్లయిట్‌ దిగగానే. పెద్దగా నవ్వాడు హ్యారీ. ‘‘లాస్‌ ఏంజెలిస్‌కి రాణి గారు కదా ఉంటారు. రాణీ మేఘన్‌ మార్కల్‌’’ అన్నాడు! ఆర్చిని హ్యారీ చేతికి అందించి, హ్యారీ ఛాతీకి నా తలను ఆన్చాను. నా కోసం తన సింహాసన వారసత్వాన్ని వదలుకుని వచ్చాడు. తన తర్వాత వచ్చే ఆర్చి స్థానాన్ని కూడా వదిలేసి వచ్చాడు.‘‘యు ఆర్‌ మై క్రౌన్‌’’ అన్నాను. గిలిగింతలు పెట్టినప్పుడు అచ్చు ఆర్చి నవ్వినట్లే నవ్వాడు హ్యారీ.

మాధవ్‌ శింగరాజు 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు