మోహన్‌ భాగవత్‌ రాయని డైరీ

26 Nov, 2017 02:34 IST|Sakshi

సుబ్రహ్మణ్య స్వామికి వచ్చిన కష్టం ఏ దేశ పౌరుడికీ రాకూడదు. గుండె తరుక్కుపోతోంది నాకు. ఆయనేం కోరాడని! ‘నా రాముడికి నన్ను పూజ చేసుకోనివ్వండి’ అనేగా. కోర్టు కాదంది! ‘తేలవలసినవి తేలాక అప్పుడు నీ సంగతి చూద్దాం’ అంది.

పెద్ద లాయర్‌ అయుండి, పెద్ద బీజేపీ లీడర్‌ అయుండి, ఎనభై ఏళ్ల వయసుండి.. ఇవన్నీ కాదసలు.. రామభక్తుడు అయుండీ సుబ్రహ్మణ్య స్వామికి ఇదేం ఖర్మ.. అయోధ్యకు వెళ్లి పూజ చేసుకోడానికి లేకుండా!

‘తమిళనాడులో రామాలయం లేదా? అయోధ్యలోనే ఇంకో రామాలయం లేదా? అక్కడ చేసుకోవచ్చు కదా నీ పూజ’ అన్నారట కోర్టువారు!
భక్తుడికీ, భగవంతుడికీ మధ్య ఈ కోర్టులేమిటో! భక్తుల సంగతి సరే. పాతికేళ్లుగా పూజల్లేక అయోధ్య రాముడు అలమటిస్తున్నాడే!! ‘మిలార్డ్‌’ అంటూ ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి అడిగినా, ‘ముందు డిస్‌ప్యూట్‌ క్లియర్‌ కానివ్వండి లార్డ్‌ శ్రీరామా.. తర్వాత మీ ఇష్టం.. ఎన్ని పూజలైనా చేయించుకోండి’ అంటుందేమో కోర్టు.
డిసెంబర్‌ 5న ఫైనల్‌ హియరింగ్‌.

కేసులో ఉన్న భక్తులంతా కోర్టుకు వచ్చి, కోర్టువారికీ, కోర్టు హాల్లో కూర్చున్నవారికీ, కోర్టు బయట నిలుచున్నవారికీ.. అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితేనే అది ఫైనల్‌. ఏ ఒక్కరి భాష ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా కేసు మళ్లీ సెమీ ఫైనల్‌కో, క్వార్టర్‌ ఫైనల్‌కో వాయిదా పడిపోతుంది.

‘‘ఏమిటండీ ఈ అన్యాయం’’ అని మొన్న ఆగస్టులోనే సుబ్రహ్మణ్య స్వామి కన్నీళ్లు పెట్టుకున్నారు. దైవానికి మనిషిని దూరం చేస్తే వచ్చే కన్నీళ్లవి. కేసు డాక్యుమెంట్లు ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ అవలేదని జస్టిస్‌ మిశ్రా అయోధ్య కేసును మూడు నెలలు వాయిదా వేశారు. ఒకటీ అరా అయితే సుబ్రహ్మణ్య స్వామే కూర్చుని తర్జుమా చేసి ఉండేవారు. తొంభై వేల పేజీలు. ఎనిమిది భాషలు. అన్నిటినీ ఇంగ్లిష్‌లోకి మార్చాలి. రామకోటి రాయడం ఈజీ అంతకన్నా!

‘‘నాకిక అయోధ్య రాముడు లేడనుకోనా?’’ అని మళ్లీ ఈమధ్య విలపించారు సుబ్రహ్మణ్య స్వామి. ఏదో ఒక రాముడితో అడ్జెస్ట్‌ అయ్యేలా లేరు ఆయన.
‘‘చేద్దాం’’ అన్నాను.

‘‘ఏం చేస్తారు భగవత్‌జీ! హిమాచల్‌ప్రదేశ్‌ అయింది. గుజరాత్‌ అవుతోంది. తర్వాత కర్ణాటక. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరామ్, నాగాలాండ్, రాజస్తాన్, త్రిపుర. నెక్స్‌ట్‌ జనరల్‌ ఎలక్షన్స్‌. అవీ అయిపోతే.. రాముడు కనబడతాడా? మీరు కనబడతారా?’’ అన్నారు సుబ్రహ్మణ్య స్వామి.

భక్త రామదాసు కూడా ఇంత బాధపడి ఉండడు.
‘‘తేల్చేద్దాం దాసు గారూ’’ అన్నాను.
‘‘దాసా! దాసెవరూ?’’ అన్నారు స్వామి.

‘‘కేసు అనబోయి, దాసు అన్నాను లెండి’’ అన్నాను.

- మాధవ్‌ శింగరాజు

>
మరిన్ని వార్తలు