పదండి ముందుకు!

12 Oct, 2019 03:12 IST|Sakshi

అక్షర తూణీరం

చంద్రబాబు అసహనంతో రోజుకో ఇంచ్‌ కుంగిపోతున్న యథార్థం జనసామాన్యానికి స్పష్టంగా కనిపిస్తోంది. కాపిటల్‌ నిర్మాణంలో ‘ఊహ’ మంచిదే. కానీ మన దేశమే అంతటి మహా నగరాన్ని భరించలేదు. ఇక ఒక చిన్న రాష్ట్రం తట్టుకోగలదా? దాన్ని పక్కనపెడితే ఇక మిగిలింది పోలవరం. అది అవినీతి పునాదుల మీద ఇంతదాకా పైకి లేచిందని కొందరికి డౌటు. ఆ డౌటు తీరగానే పోలవరం శరవేగంతో సిద్ధం అవుతుంది అని విజ్ఞులు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిదానికీ ఆందోళన చెంది అల జడి చేస్తున్నారు. రోజూ రెండు నుంచి నాలుగు ప్రెస్‌మీట్లు పెడుతూ పాలన మీద ఇసుక, బురద, రాళ్లు జల్లుతూ వినోదిస్తున్నారు. ఇసుక లేక ఇరవై లక్షల కుటుంబాలు పస్తులుంటు న్నాయని ఊరేగింపు నడిపారు. నేను ఒక పెద్ద బిల్డర్‌ని అనుమానం నివృత్తి చేసుకోవడానికి అడిగా. ఆయన అన్ని ప్రాంతాల్లో ఇళ్లు కడతారు. ఆయన వివరంగా చెప్పారు. ‘అదేం లేదు. ప్రతియేటా వర్షాకాలం రెండు నెలలూ ఇసుక కరువు ఉంటుంది. రేవుల్లో ఇసుక తోడుకోవడానికి ఉండదు. పైగా ఈ సీజన్‌లో వర్షాలు ఎక్కువ పడ్డాయ్‌. వాగులు, నదులు వరదలై పొంగాయి. రేవుల్లో ఇసుక తీయడానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు పొంగు తగ్గింది. కావల్సినంత ఇసుక. పైగా సరసమైన ధర’ అని సవివరంగా చెప్పుకొచ్చారు. బాబు పాలనలో పొడి తప్ప తడిలేదు. అందు కని ఆయనకు తెలీదు.

చంద్రబాబు దేన్నీ సక్రమంగా చూడలేక పోతున్నారని వాళ్ల వాళ్లే ఆందోళన చెందుతున్నారు. కాకి పావు రం లాగా, పావురం చిలకలా, చిలక గద్దలా ఆయన కళ్లకి కనిపిస్తోందని వాళ్ల వాళ్లు అనుకుంటున్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే నూట ఇరవై ఆరోపణలు జగన్‌ ప్రభుత్వం మీద చేశారు. ఎన్నిసార్లు సూర్యోదయం ప్రభుత్వ పంచాంగంలో చెప్పిన వేళకు కాలేదో, ఎన్నిసార్లు చంద్రోదయం లెక్క తప్పిందో నిమిషాలు, సెకన్లతో చెప్పి జగన్‌ని ఝాడించి, పిండి ఆరేశారు. ఒక అపోజిషన్‌ లీడర్‌గా ప్రజలని అన్నివిధాలా సంరక్షిస్తున్నారు. అక్టోబర్‌ 2న, గాంధీ 150వ పుట్టినరోజున పోలీసులతో మద్యం అమ్మించిందని ఈ కొత్త ప్రభు త్వాన్ని దులిపేశారు. అయ్యా, తమరెవరూ కొంచెం కూడా సాహసించలేని పనికి జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారు. అందుకు ఆనందపడాలి. ఆయనని అభినందించాలి. ఆ సంస్కరణకి మనసా మద్దతు ఇవ్వాలి. ఇప్పటికే బెల్ట్‌ షాపుల్ని లేపేశారు. ఇంకా అనేక ఆంక్షలు విధించారు. దీనికి ఆడపడుచులు ఆనందపడుతున్నారు. చంద్రబాబు హయాంలో లిక్కర్‌ని కోటాలిచ్చి అమ్మించారు. పల్లెల్లో ఇంటింటా బెల్ట్‌ షాపుని ప్రోత్సహించి, నిత్య దరిద్రాన్ని నట్టింట తిష్ట వేయించారు. ప్రభుత్వాన్ని సారాయితోనే నడిపించారు. జగన్‌ నవరత్నాల మేనిఫెస్టోకి కట్టుబడి, అధికారంలోకి వచ్చిన రోజునుంచి వ్యవహరిస్తున్నారు. పాపం, అవేవీ చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చినట్టు లేదు.

వ్యవసాయానికి, విద్యకి, వైద్యానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. ప్రతిసారీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని పదే పదే చెప్పుకోవడం మంచిది. ‘నేను తలచుకుంటే జగన్‌ పాదయాత్ర చేసేవాడా’ అని మైకులో ప్రశ్నించారు. అంటే, ఇలా రకరకాలుగా జరిగినవన్నీ తలచుకొని పశ్చాత్తాపపడుతు న్నారు. పోలీసు శాఖ మీద నోరు చేసుకున్నారు. డొక్క చించి డోలు కడతానన్నారు. ఏదో మొత్తానికి అసహనమూర్తిగా సభల్లో మెరుస్తున్నారు. మా ఊళ్లో వృద్ధులు, పెద్ద ముత్తయిదువులు ఏమనుకుంటున్నారంటే– బాబు ఈవిధంగా కాలం వృథా చేసుకోవడం కంటే పాదయాత్రకి దిగడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఆయన రెండు రాష్ట్రాలు నడవాలి. వారి సాధక బాధకాలు గమనించాలి. కేసీఆర్‌ని, జగన్‌ని తూర్పారబట్టాలి. పక్క రాష్ట్రాలను కొంచెం తడమాలి. నాలుగేళ్ల వ్యవధి ఉంటేగానీ బాబుకి చాలదు. అప్పుడు గానీ ఆ లాంగ్‌మార్చ్‌ పాత రికార్డులని బద్దలు కొట్టలేదు. బాబు ఆ విధంగా నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలి. ఆయన సరే అంటే మా ఊరి జనం దగ్గర బోలెడు ఆలోచనలున్నాయ్‌. చినబాబుని కూడా వెంటతెస్తే మరీ కొత్తగా ఉంటుంది. ఆ బాబుకి అనుభవం వస్తుంది. ఇంకా బోలెడు లాభాలుంటాయ్‌. దిగితే తెలుస్తాయ్‌.


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు