అన్నదాతల ఆత్మబంధువు

8 Jul, 2020 01:41 IST|Sakshi

సందర్భం

రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాలు రూపొందించిన మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ పుట్టిన రోజు అయిన డిసెంబర్‌ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో దివంగత ముఖ్య మంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున వారి పుట్టిన రోజైన జూలై 8ని రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి సకాలంలో వర్షాలు పడక,  ప్రాజెక్టుల నుండి నీరు విడుదల గాక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీ యంగా తగ్గిపోయి, ఆ పండిన ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు  ఉంటే 18 దివాళా తీసిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన మొదటి కార్యక్రమం–ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుం బాలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో జీవో 421 విడుదల చేసి 2 లక్షల రూపాయల పరిహారం అందిం చడం. అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులకు కూడా అందేలా చర్య తీసు కోవడం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. వైద్యనా«థన్‌ కమిటీ సిఫా రసులు అమలు చేసి రూ.1,800 కోట్లు సహకార సంఘా లకు సహాయం అందించి, పూర్తిగా నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు.

కృష్ణదేవరాయల పాలన నుండి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరా లకు సాగునీరందిస్తానని జలయజ్ఞం మొదలుపెట్టారు. ఇందులో ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టు పులిచింతల అయితే, మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు నిజామా బాద్‌లోని అలీసాగర్‌. పోలవరం ప్రాజెక్టు కోసం గోదా వరి జిల్లావాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి ఈ ప్రాజెక్టు అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి రాష్ట్రానికే వరమైన పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్ట డమే కాదు, జలయజ్ఞంలో చేపట్టిన అన్ని పనులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్ప తనం ఆయనకే సాధ్యం. 

సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజె క్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. అదే భూగర్భ జలాలకైతే రైతు సొంత ఖర్చుతో బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు.  అందుకని వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. కానీ ఆయన సంకల్ప బలం నేడు అనేక రాష్ట్రాలకు ఆదర్శమైంది. నేడు సుమారు 18.70 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల ఉచిత విద్యుత్‌కు ఇదే పునాది.

వ్యవసాయం రాష్ట్రప్రభుత్వం అధీనంలో ఉన్నప్ప టికీ, వ్యవసాయ విధానాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందువలన కేంద్ర–రాష్ట్రాల సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గుర్తించి ఆయన ఛైర్మన్‌గా, పెద్దలు సోమయాజులు వైస్‌ చైర్మన్‌గా 2006లో అగ్రికల్చర్‌ టెక్నాలజీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. రాజ శేఖరరెడ్డి పోద్బలంతోనే కేంద్రప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకా లంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతుసంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షలమంది రైతులకు ఐదువేల రూపాయల చొప్పున రూ.1,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు.

పావలా వడ్డీకే పంట రుణాలు, 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఆయన ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్య లేదు. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలన గావించిన ముఖ్యమంత్రి వై.ఎస్‌. రైతుల గుండెల్లో చిరం జీవిగా మిగిలిన– ఆ మహానాయకునికి మనమిచ్చే గౌరవం ఈ రైతు దినోత్సవం.


వ్యాసకర్త: ఎం.వి.ఎస్‌. నాగిరెడ్డి
వైస్‌ చైర్మన్, ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌  

మరిన్ని వార్తలు